అసదుద్దీన్ ఒవైసీపై దాడికి పాల్పడినవారికి అండగా ఉంటామని యూపీ మంత్రి హామి
లక్నో: ఏఐఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై దాడి కేసులో రాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తులకు ఉత్తరప్రదేశ్ మంత్రి సునీల్ భరాలా బుధవారం మద్దతు ప్రకటించారు.
ఫిబ్రవరి 4న పశ్చిమ యూపీలో అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిపిన నిందితులు సచిన్ శర్మ, శుభమ్ లకు "న్యాయమైన విచారణ" కోసం భరాలా హామీ ఇచ్చారు. సచిన్, శుభమ్ కుటుంబానికి అన్ని విధాలుగా పూర్తి సహకారం అందిస్తాం.. ఈ వ్యవహారంలో న్యాయమైన విచారణ జరుగుతుందని మంత్రి సునీల్ భరాలా ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

యూపీలోని కార్మిక సంక్షేమ మండలి చైర్మన్, రాష్ట్ర మంత్రి మంగళవారం గౌతమ్ బుద్ధ నగర్‌లోని శర్మ కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులిద్దరినీ తప్పుగా ఇరికించారని కూడా ఆయన చెప్పారు. ఈ కేసులో న్యాయమైన విచారణ జరిగిన తర్వాతే విషయం స్పష్టమవుతుందని తెలిపారు. ఈ ఎపిసోడ్ కుట్రగా కనిపిస్తోందని ఈ బీజేపీ నేత ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికలకు వారం ముందు, ఫిబ్రవరి 4 సాయంత్రం పశ్చిమ యూపీలో ఎన్నికల సంబంధిత కార్యక్రమాలకు హాజరై ఢిల్లీకి తిరిగి వెళ్తుండగా హాపూర్‌లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కారుపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
నిందితుల్లో ఒకరిని అదే రోజు అరెస్టు చేయగా, మరొకరిని సంఘటన జరిగిన మరుసటి రోజు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. తనపై జరిగిన దాడిపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. తనపై కాల్పులు జరిపిన వారిపై యూఏపీఏ చట్టం ఎందుకు ప్రయోగించరని ప్రశ్నించారు అసదుద్దీన్ ఒవైసీ. తనపై కాల్పులు జరిపిన వారిని శిక్షించి.. తనకు న్యాయం చేయాలని కోరారు.
కాగా, ఈ ఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వం అసదుద్దీన్ ఒవైసీకి జడ్ కేటగిరీ భద్రతను కల్పించగా.. దాన్ని ఆయన తిరస్కరించారు. తనకు జడ్ కేటగిరీ భద్రత అక్కర్లేదని, అందరిలాగే తాను ఏ కేటగిరీ పౌరుడిగానే ఉండాలనుకుంటున్నట్లు అసదుద్దీన్ స్పష్టం చేశారు. అంతేగాక, తన కారుపై కాల్పుల ఘటనను లోక్‌సభలో ఆయన ప్రస్తావించారు. తాను చావుకు భయపడబోనని అన్నారు. తనకు జడ్ కేటగిరీ భద్రత అవసరం లేదనీ, దాన్ని తిరస్కరించినట్లు తెలిపారు. కాల్పులు జరిపిన వారి చూసి తాను ఏమాత్రం భయపడనన్నారు. దాడి చేసిన వారికి యూపీ యువకులు బ్యాలెట్ ద్వారా సమాధానం చెబుతారన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications