భారత్‌లో దిగిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుడిభుజం- రష్యా, చైనాలతో భేటీపై కీలక నిర్ణయం
ప్రతిష్ఠాత్మక జీ20 సమావేశంలో పాల్గొనడానికి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్ భారత్ కు వచ్చారు. కొద్దిసేపటి కిందటే ఆయన న్యూఢిల్లీలో ల్యాండ్ అయ్యారు.
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. దీనికి సంబంధించిన కోలాహలం దేశంలో నెలకొంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఈ సమ్మిట్‌ను నిర్వహించబోతోంది భారత్. ఈ నేపథ్యంలో సన్నాహాక సమావేశాలు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. బెంగళూరులో ఇటీవలే జీ20 సభ్య దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం ముగిసింది. ముంబై, జైపూర్‌లల్లో తొలిదశ షెర్పాల భేటీలు ముగిశాయి కూడా.
జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా అధ్యక్షులు జో బైడెన్, ఇమ్మానుయెల్ మక్రాన్, వ్లాదిమిర్ పుతిన్, గ్ఝి జిన్‌పింగ్ హాజరు కానున్నారు. వివిధ దేశాల ప్రధానులు ఈ సమ్మిట్‌లో పాల్గొనడానికి భారత్‌కు రానున్నారు. భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో సభ్యులుగా కొనసాగుతున్నాయి.

తాజాగా- జీ20 సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఆరంభం కాబోతోంది. దీనికోసం ఆయా దేశాల విదేశాంగ మంత్రులు భారత్ కు చేరుకుంటోన్నారు. ఇప్పటికే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, దక్షిణాఫ్రికా మంత్రి నలేడి పండోర్, అర్జెంటీనా మంత్రి శాంటియాగో కెఫీరో, నెదర్లాండ్ మంత్రి వొప్కే హొక్సెట్రా, చైనా మంత్రి క్విన్ గ్యాంగ్, జర్మనీ మంత్రి అన్నాలెనా బేర్‌బాక్, ఫ్రాన్స్ మంత్రి కేథరీన్ కొలోనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మంత్రి షేక్ అబ్దుల్ జయేద్ ఢిల్లీకి చేరుకున్నారు.
ఇక అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటొని బ్లింకెన్ కొద్దిసేపటి కిందటే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. ఉజ్బెకిస్తాన్ పర్యటనను ముగించుకున్న ఆయన అక్కడి నుంచి నేరుగా భారత్ కు చేరుకున్నారు. భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం అధికారులు, భారత్ తరఫున జీ20 ప్రతినిధులు ఆయనను ఎయిర్ పోర్టులో సాదరంగా స్వాగతం పలికారు.

ఈ భేటీ సందర్భంగా ఆంటొని బ్లింకెన్ అటు చైనా, రష్యా విదేశాంగ మంత్రులతో భేటీ అయ్యే అవకాశం లేదని స్పష్టమైంది. ఆయన షెడ్యూల్ లో వన్ టు వన్ సమావేశం లేదని తేలింది. కాగా- తన పర్యటన సందర్భంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ తో ఆంటొని బ్లింకెన్ భేటీ అవుతారు. భారత్-అమెరికా మధ్య వాణిజ్య, ఆర్థికపరమైన ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చిస్తారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల భేటీలోనూ ఆయన పాల్గొంటారు. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంది.












Click it and Unblock the Notifications