అక్రమ నిర్మాణాల తొలగింపులో విషాదం: మంటల్లో తల్లీకూతురు మృతి, ఉద్రిక్తత
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దేహత్ జిల్లాలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న క్రమంలో ఏర్పడిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మహిళలు(45ఏళ్ల మహిళ, ఆమె కూతురు(20)) సజీవ దహనమయ్యారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దేహత్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న క్రమంలో ఏర్పడిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మహిళలు(45ఏళ్ల మహిళ, ఆమె కూతురు(20)) సజీవ దహనమయ్యారు. అయితే, పోలీసులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ.. నిప్పుపెట్టడంతోనే వారు మరణించారని బాధితుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ విషాద ఘటన మదౌలి గ్రామంలో చోటు చేసుకుంది.ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీసులు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ముందుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలను ప్రారంభించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

నివాసాల్లో ప్రజలు ఉండగానే.. అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రయత్నం చేశారని స్థానికులు మండిపడ్డారు. తామే భయంతో బయటికి పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నామన్నారు. జిల్లా కలెక్టర్ కూడా తమను రక్షించే ప్రయత్నం చేయలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నిర్మించుకున్న ఆలయాలను కూడా కూల్చివేశారన్నారు.
అయితే, పోలీసులు వాదన మరోలా ఉంది. ప్రమీల దీక్షిత్, ఆమె కూతురు నేహా తమకు తామే నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. తాము వారిని కాపాడేందుకు ప్రయత్నించామన్నారు. ప్రమీల భర్తను కాపాడామని, ఆయన తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని స్థానిక పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
బాధితులు వారి నివాసంలోనే లోపల గడియ పెట్టుకుని నిప్పంటించుకున్నారని జిల్లా ఎస్పీ మూర్తి తెలిపారు. అయితే, వారి మరణానికి ఎవరైనా కారణం అని తెలిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న సమయంలో వీడియో తీశారని.. ఆ వీడియోను పరిశీలిస్తామని చెప్పారు.
కాగా, తల్లీకూతురు మరణంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వారి మరణానికి కారణమైన అధికారులపై కేసు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామి ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇద్దరి మరణంతో ప్రతిపక్షాలు యోగి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications