Yogi-Rajini : యోగీ ఆదిత్యనాథ్ కు "జైలర్" చిత్రం చూపిస్తున్న రజనీకాంత్...
యూపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన యోగీ ఆదిత్యనాథ్ రాష్ట్రంలో పాలనపై తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం జైలర్ భారత్ తో పాటు విదేశాల్లోనూ సంచలన రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా విడుదల తర్వాత హిమాలయాలకు వెళ్లిపోయిన రజనీకాంత్ ఇవాళ తిరిగొచ్చారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోకు చేరుకున్న ఆయన.. అక్కడి సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను కలిశారు.
హిమాలయాలతో పాటు జార్ఖండ్ యాత్ర కూడా పూర్తి చేసుకున్న రజనీకాంత్ ఉత్తర్ ప్రదేశ్ కు చేరుకున్నారు. ఉదయం లక్నో చేరుకున్న ఆయన.. కాసేపు విశ్రాంతి తర్వాత సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం హిందీ వెర్షన్ ప్రత్యేక షోను వీక్షించబోతున్నారు. వీరితో పాటు పలువురు రాష్ట్రమంత్రులు, బీజేపీ నేతలు కూడా ఈ సినిమా చూడబోతున్నారు. దీంతో యూపీలో జైలర్ హవా అర్ధమవుతోంది.

నెల్సన్ దిలీప్ కుమార్ రజనీకాంత్ మూవీ జైలర్ ఇప్పుడు తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. విదేశాల్లోనూ దుమ్మురేపుతోంది. ఈ మూవీ రజనీకాంత్ కెరీర్లోనే కలెక్షన్ల పరంగా బెస్ట్ అవుతుందనే అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిందీ వెర్షన్ కూడా భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఇదే క్రమంలో యూపీకి వెళ్లి అక్కడి సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో కలిసి ఈ సినిమా చూడబోతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఎప్పుడూ యోగీతో కలిసి సినిమాలు చూడని రజనీ ఈసారి మాత్రం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చర్చ జరుగుతోంది.
తమిళనాడులో బీజేపీతో సహా ఇతర రాజకీయపార్టీలతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్న రజనీకాంత్.. యూపీకి వెళ్లి తన జైలర్ సినిమాను సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో కలిసి చూడటం వెనుక కీలక కారణాలు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు బీజేపీకి సినీ గ్లామర్ కోసం చూస్తున్న యోగీ వంటి నేతలకు రజనీకాంత్ రావడం సంతోషం నింపుతోంది. అందుకే రజనీకి రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వనిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications