యువతి, యువకుడిపై దాడి చేసి నెట్లో వీడియో పెట్టారు
లక్నో: కాలేజీ విద్యార్థినిని, ఆమె స్నేహితుడిని పిలుచుకు వెళ్లి దారుణంగా కొట్టిన సంఘటనలో నలుగురు నిందితులను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ నెల 8వ తేదీన కాలేజీ విద్యార్థిని, ఆమె స్నేహితుడు బైక్ పైన యూపీలోని హథ్రాస్‌లోని మార్కెట్‌కు వెళ్తున్నారు. ఆ సమయంలో ఆరుగురు మూడు బైక్‌ల పైన వారిని వెంబడించారు.

వారిని అడ్డగించి సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి తీసుకు వెళ్లారు. మీరిద్దరు బైక్ పైన ఎందుకు తిరుగుతున్నారని వారు ప్రశ్నించారు. వారు సమాధానం చెబుతుండగానే.. ఆ ఆరుగురు నిందితులు.. దాదాపు 10 నిమిషాల పాటు వారిద్దర్నీ ఇష్టం వచ్చినట్లు కొట్టారు. దీనిని నిందితుల్లో ఒకడు వీడియో తీశాడు.
అంతటితో ఆగకుండా ఆ క్లిప్పింగులను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. యువతి చిన్నాన్న సోషల్ మీడియాలో వీడియో క్లిప్పింగ్స్ చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి, యువకుడి మీద దాడి చేసిన కేసులో ఇప్పటికే పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications