గోవాకు వందే భారత్ రైలు
వందే భారత్ రైళ్ల విషయంలో భారతీయ రైల్వే చాలా దూకుడుగా ఉంది. తాజాగా 16వ వందే భారత్ రైలును ప్రారంభించింది. పూరీ-హౌరా మార్గంలో వందే భారత్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఒడిసా రాష్ట్రానికి ఇది తొలి వందే భారత్ రైలు. హౌరా నుంచి ఇప్పటికే మరో వందే భారత్ నడుస్తోంది. ఈ రైళ్ల విషయంలో ప్రధానమంత్రి మోడీ టార్గెట్ విధించారని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రాబోయే నెలలో అన్ని రాష్ట్రాల్లో వందే భారత్ రైలు ప్రారంభించాలని పీఎం ఆదేశాలు జారీచేశారని చెప్పారు. జూన్ చివరకు లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు.
ప్రతిరోజు 100 కిలోమీటర్ల లోపు ప్రయాణించేవారి కోసం వందే మెట్రోను తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి వందే మెట్రో రైలును తయారు చేసి వచ్చే సంవత్సరం అందుబాటులోకి తీసుకురావాలనుకుంటునట్లు తెలిపారు. వీటిపై రైల్వేశాఖ కసరత్తులు చేస్తోంది. పూరీ-హౌరా మార్గంలో తాజాగా వందే భారత్ ప్రారంభమైంది. జూన్ చివరి నాటికి మరో నాలుగు మార్గాల్లో వందే భారత్ లు అందుబాటులోకి రానున్నాయి. న్యూజల్పాయ్‌గురి-గౌహతి, పాట్నా-రాంచీ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబయి-గోవా మార్గంలో కూడా వందే భారత్ ప్రారంభం కాబోతోంది.

ఇది ప్రారంభమైతే గోవాకు తొలి వందే భారత్ అవుతుంది. ముంబయి-గోవా ఇప్పటికే వందే భారత్ రైలు ట్రయల్ పూర్తిచేసింది. ముంబయి నుంచి గాంధీనగర్, సాయినగర్ షిరిడీ, షోలాపూర్ మార్గాల్లో ఇవి నడుస్తున్నాయి. ఏపీ, తెలంగాణ విషయానికొస్తే కాచిగూడ-బెంగళూరు, సికింద్రాబాద్-పూణె మార్గంలో వందే భారత్ రైళ్లు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రెండు మార్గాలను భారతీయ రైల్వే పరిశీలిస్తోంది. అలాగే హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ కు వందే భారత్ నడపాలని ఒడిసా ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇది కూడా ప్రారంభమైతే మరో వందే భారత్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.












Click it and Unblock the Notifications