వందేమాతరంలో తొలి రెండు చరణాలే పాడాలి: కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు
జాతీయ గేయం వందేమాతరంపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరం గేయంలో తొలి రెండు చరణాలే పాడాలని ఆదేశించింది. అలాగే రాష్ట్ర కార్యక్రమాలు, అధికారిక వేడుకల్లో వందేమాతరం గీతం పాడటాన్ని తప్పనిసరి చేసింది. అయితే రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, రాష్ట్రాల గవర్నర్ల సమక్షంలో, కేంద్ర ప్రభుత్వ ప్రాతినిధ్యం ఉండే కార్యక్రమాల్లోనూ వందేమాతరం గీతంలోని ఆరు చరణాలనూ ఆలపించాలని ఆ ఉత్తర్వులో కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. వందేమాతరం గేయాన్ని ఆలపించడంలో ఏకరూపత, గౌరవాన్ని పాటించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరం గేయాన్ని మొత్తం పాడాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగే అవకాశం కనిపిస్తోంది.
వందేమాతరంలో తొలి రెండు చరణాలే పాడుతామని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గతంలోనే ప్రకటించారు. ఈ మేరకు 1937 నాటి తీర్మానానికి కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గత నెలలో నిర్ణయించిన నేపథ్యంలో సీఎ డీకే ఈ నిర్ణయం తీసుకున్నారు. వందేమాతరంలోని కొన్ని చరణాల్లో హిందూ దేవతలకు సంబంధించిన ప్రస్తావనలు ఉండటం.. అలాగే వాటిపై ముస్లిం వర్గాల్లో అభ్యంతరాలు వ్యక్తం కావడం వంటి కారణాలతో తొలి రెండు చరణాలనే కాంగ్రెస్ ఆలపిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం వందేమాతరం మొత్తం గేయాన్ని ఆలపించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వం.. వందేమాతరం గేయానికి జనగణమన తో సమాన గౌరవాన్ని కల్పించింది. ఇటీవల అధికారిక కార్యక్రమాల్లోనూ వందేమాతరం గేయాన్ని పూర్తిగా పాడటంపై కేంద్రం దృష్టి సారించింది. అయితే కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది. అధికారిక కార్యక్రమాల్లో పూర్తి వందేమాతరం ఆలపించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం తాజా ఆదేశాలు ఇవ్వడం గమనార్హం అని పలువురు విశ్లేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications
