వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వర్గీస్ కురియన్: ‘అమూల్ సీక్రెట్ తెలుసుకోవడానికే ప్రధాని లాల్ బహాదుర్ శాస్త్రి ఆ ఊళ్లో రాత్రి బస చేశారు..’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వర్గీస్ కురియన్

స్వతంత్ర భారత చరిత్రలో ప్రధానంగా రెండు విప్లవాల గురించి మాట్లాడుతుంటారు. ఒకటి హరిత విప్లవం, రెండోది క్షీర విప్లవం లేదా శ్వేత విప్లవం. వర్గీస్ కురియన్‌కు క్షీర విప్లవ పితామహుడనే పేరుంది. ఆయనను 'అమూల్’ బ్రాండ్ సృష్టికర్తగా, 'మిల్క్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’గా కూడా గుర్తు చేసుకుంటారు. నవంబర్ 26 ఆయన పుట్టిన రోజు.

1970ల నాటికి డిమాండ్‌కు తగినంత పాల దిగుబడి లేని స్థితిలో ఉన్న భారత్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద పాల ఉత్పత్తిదారుగా నిలబెట్టడం క్షీర విప్లవం సాధించిన అతి పెద్ద విజయం.

అయితే, క్షీర విప్లవ సూత్రధారి వర్గీస్ కురియన్ మాత్రం రెండు విజయాలు సాధించారు. దేశ ప్రజలకు సగటు పాల లభ్యతను రెండింతలు చేయడం ఒకటైతే, సహకారోద్యమాన్ని ఒక విజయవంతమైన అభివృద్ధి నమూనాగా దేశం ముందుంచడం మరొకటి.

లాల్ బహదూర్ శాస్త్రి

దిగుమతి చేసుకునే స్థితి నుంచి..

“అప్పుడు విదేశాల నుంచి పాలు దిగుమతి చేసుకునే వాళ్లం. దిల్లీ వంటి నగరాల్లో ఓ సీసా పాలు కొనాలన్నా మిల్క్ బూత్‌ల ముందు టోకెన్ తీసుకొని రెండేసి గంటలు నిలబడాల్సి వచ్చేది” అంటూ నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు 'అమూల్’ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ఎస్ సోఢీ. స్వాతంత్ర్యం తర్వాత దేశంలో పాల ఉత్పత్తి ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.

1970లో ఆపరేషన్ ఫ్లడ్ పేరుతో క్షీర విప్లవం మొదలైంది. అది మూడు దశల్లో కొనసాగి 1996లో పూర్తయ్యింది. ఈ విప్లవానికి ముందు, అంటే 1968-69లో దేశంలో పాల ఉత్పత్తి 21.2 మిలియన్ టన్నులుగా ఉండేది.

2020-21 నాటికి అది దాదాపు పదింతలై, 209.96 మిలియన్ టన్నులకు చేరుకుంది. 1970లో రోజువారీ తలసరి పాల లభ్యత 107 గ్రాములు ఉండగా, ఇప్పుడది దాదాపు 400 గ్రాములుగా ఉంది. ప్రపంచ పాల ఉత్పత్తిలో ఇప్పుడు భారత్ వాటా 21 శాతం.

లాల్ బహదూర్ శాస్త్రి

భారత్‌లో ఇప్పుడు పాడి పరిశ్రమే అతి పెద్ద పరిశ్రమ అంటే చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. దీని విలువ రూ. 7 లక్షల కోట్లని ఓ అంచనా. సంఘటిత రంగంలో జరిగే పాడి వ్యాపారం విలువ రూ. 1 లక్ష 80 వేల కోట్లు కాగా, ఇందులో ప్రధానంగా అమూల్, తదితర సహకార సంఘాలు, ప్రైవేటు సంస్థలు భాగంగా ఉన్నాయి.

అయితే, ఇదంతా ఒక వ్యక్తి రూపొందించిన ప్రణాళిక, దానికి కార్యరూపం ఇచ్చేందుకు ఆయన చేసిన కృషి వల్లే సాధ్యమైంది. ఆయనే వర్గీస్ కురియన్. కురియన్‌ను ఆ పనికి పురికొల్పింది ఆనాటి ప్రధాని లాల్ బహాదుర్ శాస్త్రి.

అమూల్

ఆనంద్‌లో శాస్త్రి రాత్రి బసతోనే క్షీర విప్లవానికి నాంది..

ఇప్పుడు గుజరాత్‌లో ఓ జిల్లా కేంద్రంగా ఉన్న ఆనంద్ 1965లో పాతిక వేల జనాభా దాటని ఓ చిన్న పట్టణం. లేదా ఓ పెద్ద ఊరు. లాల్ బహాదుర్ శాస్త్రి ఆ ఊరి పర్యటనకు వచ్చారు.

అక్కడి పాల వ్యాపారాన్ని, సహకార సంఘం పని తీరును, మొత్తంగా అమూల్ మోడల్‌ను అధ్యయనం చేయాలన్న లక్ష్యంతో ఆ రాత్రి ఆనంద్‌లోనే బస చేశారు.

ఆ రోజు జరిగిన ఘటనలను, శాస్త్రితో తన సంభాషణలను కురియన్ ఓ రేడియో ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు

“శాస్త్రిగారు ఒక రైతు ఇంట్లో రాత్రి భోజనం చేశారు. రైతులతో, వారి భార్యలతో మాట్లాడారు. ఓ ముస్లిం రైతును పిలిపించి, ఆయనతోనూ, ఆయన భార్యతోనూ మాట్లాడారు. అతను కోఆపరేటివ్‌లో సభ్యుడిగా ఉన్నాడా, లేడా అడిగి తెలుసుకున్నారు. మతం ఆధారంగా కోఆపరేటివ్‌లో వివక్ష ఏమైనా ఉందేమో అని పరిశీలించారు.

ఆ తర్వాత ఊళ్లో దళితులు ఉన్నారా అని అడిగారు. వాళ్ల ఇళ్లలోంచి కూడా పాలను సేకరిస్తున్నారా అని అడిగారు. వారు కోఆపరేటివ్‌లో సభ్యులుగా ఉన్నారా, లేరా అని అడిగి తెలుసుకున్నారు. అలా రాత్రి 2 గంటల వరకూ రైతులతో మాట్లాడుతూనే గడిపారు. ఆయన ఇక పడుకోవాలని సిబ్బంది బలవంతంగా ఆపాల్సి వచ్చింది.

ప్రధాని ఆనంద్‌కు వచ్చిన సమయంలో నేను ఊళ్లో లేను. మరుసటి రోజు ఉదయం నేను ఆయనను కలిశాను. తర్వాత ఆయనను అమూల్ డెయిరీకి తీసుకెళ్లాం. క్యాటిల్ ఫీడ్ ప్లాంట్‌ను ప్రారంభించడం కోసం ఆయన అక్కడికి వచ్చారు. ఆ తర్వాత, 'నీతో మాట్లాడాలి, రా, కూర్చో’ అన్నారు. 'అమూల్‌ను నేను చాలా సునిశితంగా పరిశీలించాను. క్షేత్రస్థాయి అధ్యయనం కోసమే రాత్రి ఊళ్లో గడిపాను. పాలకు సంబంధించి ఇప్పటికి దాదాపు 100 ప్రభుత్వ పథకాలు విఫలమయ్యాయి. పాలు అమ్మేవాళ్లనూ, కొనేవాళ్లనూ ఎవ్వరినీ అవి సంతృప్తి పరచలేదు. అన్నీ నష్టాలే తెస్తున్నాయి. అమూల్ ఒక్కటే దీనికి మినహాయింపు. అమూల్ సీక్రెట్ ఏంటో చెప్పు’ అని అడిగారు. దాన్ని తెలుసుకోవడం కోసమే రాత్రి ఊళ్లో గడిపానన్నారు’’

వర్గీస్ కురియన్

“ఇక్కడ నేల బాగానే ఉంది, కానీ గంగామైదానం నేలలతో పోలిస్తే గొప్పదేం కాదు. ఉష్ణోగ్రత, వర్షాలు, గడ్డి మేత మైదానాలు... వేటిలో కూడా ఇది మిగతా దేశానికి భిన్నంగా ఏం లేదు. గేదెల్ని కూడా చూశాను. గొప్పగా ఏమీ లేవు. యూపీలోని మా గ్రామాల్లో ఇంతకన్నా పెద్ద గేదెలున్నాయి. ఇంతకన్నా ఎక్కువ పాలిస్తాయి. ఇక్కడి రైతులు మంచి వాళ్లే కానీ పంజాబీ రైతులంత కష్టజీవులు కూడా కాదు. అయినా మీ డెయిరీ ఇంతగా వృద్ధి చెందుతోంది. అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు. మీ బ్రాండ్‌కు చాలా గౌరవం ఉంది. అవినీతి లేదు. ఈ రహస్యం ఏంటో తెలుసుకోవడానికే ఇక్కడికొచ్చాను అన్నారు ప్రధాని శాస్త్రి.

ఈ డెయిరీ రైతులది కావడమే దాని సీక్రెట్ అన్నాను. ప్రపంచవ్యాప్తంగా కూడా డెయిరీలు రైతుల చేతుల్లోనే ఉన్నాయి. అమెరికాలో 70 శాతం డెయిరీలను కోఆపరేటివ్‌లే నడుపుతున్నాయి. న్యూజీలాండ్‌లో 100 శాతం కోఆపరేటివ్‌లే నడుపుతాయి. డెన్మార్క్, హాలండ్.. ఇంకా చాలా ప్రాంతాల్లో ఇదే ఉంది. కాబట్టి మేం కొత్తగా చేసిందేమీ లేదని ఆయనకు వివరించాను.

అయితే ఇంకా మనకు చాలా 'అమూల్‌’లు కావాలి అన్నారాయన. పాడి పరిశ్రమతో పాటు, మనం ప్రజలను నిర్మిద్దాం అన్నారు. నిజమైన అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధే. ఆవులు, గేదెల అభివృద్ధి కాదు అన్నారాయన. ప్రజలను ఇలాంటి నిర్మాణాల్లో భాగం చేస్తే అన్నీ వాళ్లే నడిపిస్తారు. అవి ప్రజాస్వామ్యబద్ధంగా నడిస్తే గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యం కూడా బలపడుతుంది. ఇది రెండు విధాలా లాభం. భారత్‌కు కావాల్సింది ఇదే అన్నారు. నేనో బ్లాంక్ చెక్ ఇస్తాను. ఇప్పటి నుంచి నువ్వు ఆనంద్ కోసం కాకుండా, దేశం కోసం పని చేయాలన్నారు. కానీ నేను దిల్లీకి రాలేనన్నాను. అలాగే ప్రభుత్వ ఉద్యోగిని కావాలనుకోవడం లేదని కూడా చెప్పాను. ఆనంద్ కోఆపరేటివ్ ఉద్యోగిగానే ఉంటానన్నాను. ఆయన 'సరే ఆనంద్ నుంచే పని చెయ్యి’ అన్నారు.”

వర్గీస్ కురియన్

కేరళ నుంచి మొదలైన కురియన్ ప్రయాణం...

ఇప్పుడు కేరళలో భాగమైన కోజికోడ్‌లో 1921 నవంబర్ 26న వర్గీస్ కురియన్ జన్మించారు. మద్రాస్ లయోలా కాలేజీలో 1940లో బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత, గిండీ ఇంజినీరింగ్ కాలేజీలో బీఈ కోర్సు పూర్తి చేశారు. క్రీడల్లో, చదువులో ఎప్పుడూ ముందుండేవారు కురియన్. టెన్నిస్ ఆయనకు బాగా ఇష్టమైన ఆట.

ఇంజినీరింగ్ తర్వాత జంషెడ్‌పూర్‌లోని టాటా స్టీల్‌ టెక్నికల్ ‌ఇన్‌స్టిట్యూట్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేశారు. ఆ తర్వాత, భారత ప్రభుత్వ ఫెలోషిప్‌పై అమెరికాకు వెళ్లిన కురియన్ 1948లో మిషిగన్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేశారు. అంతకన్నా ముందే బెంగుళూరులో డెయిరీ ఇంజినీరింగ్‌లో ఓ కోర్సు పూర్తి చేశారు.

వర్గీస్ కురియన్

'నన్ను ఆనంద్‌కు పంపించడమే అన్నింటికన్నా పెద్ద శిక్ష...’

కురియన్ జీవితాన్ని ఆనంద్ పట్టణం నుంచి, ఆనంద్ కేంద్రంగా వృద్ధి చెందిన 'అమూల్’ నుంచి విడదీసి చూడలేం. కానీ 1949లో అమెరికా నుంచి తిరిగొచ్చిన కురియన్‌ను భారత ప్రభుత్వం ఆనంద్‌లోని డెయిరీ డివిజన్‌లో అధికారిగా పని చేయాలని పంపించినప్పుడు మాత్రం ఆయన దాన్ని ఓ శిక్షగా భావించారు.

ఆనంద్ ఆనాడు బాంబే స్టేట్‌లోని ఖేడా (అప్పుడు కైరా) జిల్లాలో భాగం. 1960లో గుజరాత్ రాష్ట్రం ఏర్పాటుతో ఆనంద్ గుజరాత్‌లో భాగం కాగా, 1997లో విడిగా జిల్లా అయ్యింది.

ఇష్టం ఉన్నా, లేకున్నా ఫెలోషిప్ నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన చోట ఉద్యోగం చేయక తప్పదు. ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ వర్గీస్ కురియన్ తన రేడియో ఇంటర్వ్యూలో ఇలా అన్నారు:

“నేను ఆనంద్‌కు వెళ్లాలన్నప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించింది. అప్పటి ఆర్థిక మంత్రి, స్వయంగా మా మేనమామ జాన్ మత్తాయిను దిల్లీలో కలిసి ఎలాగైనా సరే నన్ను ఆనంద్ నుంచి బదిలీ చేయించమని అడిగాను. కానీ ఆయన సిఫార్సు చేయడానికి ససేమిరా అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వంలో మంత్రుల ప్రమాణాలు అలా ఉండేవి. చాలా మందిని కలిసినా పని కాలేదు...

“అలా నేను అయిష్టంగానే ఆనంద్‌కు వచ్చాను. అద్దె ఇల్లు దొరకలేదు. నేను బ్యాచిలర్‌ను, క్రైస్తవుణ్ని, పైగా మాంసాహారిని కూడా. కాబట్టి నాకు ఇల్లు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దాంతో డెయిరీలోని గరాజ్‌లోనే మకాం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. అందులో మధ్యలో ఓ గొయ్యి ఉండేది. దాన్ని నేనే పూడ్చుకున్నాను. కిటికీలు లేవు. గోడను కూలగొట్టి ఓ విండో తయారు చేయించుకున్నా. బాత్రూం లేదు. రేకులతో అమర్చుకున్నా. దానికి ముందు ద్వారం కూడా ఉండేది కాదు. అయినా దాంతో పనేముందిలే అని అలాగే వదిలేశా.

“పెళ్లి చేసుకొని, కాపురం చేయాలంటే నాకొచ్చే 600 రూపాయల జీతం సరిపోదు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి డెయిరీ కోఆపరేటివ్‌లో చేరిన తర్వాత నాకు రూ. 800 వేతనం ఇచ్చారు. ఆ తర్వాత, 32 ఏళ్ల వయసులో చాలా కష్టంగా నా పెళ్లి అయ్యింది. మా వాడు కోఆపరేటివ్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు వచ్చేవారు కాదు. అదే నెస్లే కంపెనీలో ఆఖరుకు డిప్యూటీ మేనేజర్ అయి ఉంటే, ఎగిరి గంతేసి పిల్లనిచ్చేవారు. కోఆపరేటివ్‌లంటే అసలు విలువే ఉండేది కాదు.”

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌

కోఆపరేటివ్ ఉద్యమాన్ని మొదలుపెట్టింది కురియన్ కాదు...

ఇప్పుడైతే అమూల్ అనగానే కురియన్ గుర్తుకొస్తారు కానీ, వాస్తవానికి ఆనంద్ ప్రాంత రైతుల్లో కోఆపరేటివ్ అనే భావనను పాదుకొల్పిన ఘనత మాత్రం నాటి హోంమంత్రి, ఉప ప్రధాని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌కు దక్కుతుంది.

ఈ విషయాన్ని కురియన్ చెప్పినట్టుగా, ఆయన ఆత్మకథ 'ఐ టూ హాడ్ ఎ డ్రీమ్’లో గౌరీ సాల్వీ రాశారు.

బ్రిటిష్ పాలనలో, 1942-43 మధ్య ఈ ప్రాంత రైతులపై జరిగిన దారుణమైన దోపిడీలోనే సహకారోద్యమానికి మూలాలున్నాయి. అప్పుడు ఆనంద్ నుంచి ముంబయికి పాల సరఫరా జరుగుతూ ఉండేది.

పెస్తోన్‌జీ ఎడుల్జీ అనే వ్యాపారవేత్త పోల్సన్ అనే కంపెనీ నడిపేవారు. తన కంపెనీ ఒక్కటే ముంబయి నగరానికి పాల సరఫరా చేసేలా ఆయన బ్రిటిష్ ప్రభుత్వంతో ఓ చట్టం చేయించారు.

అంటే, ఆనంద్, దాని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పోల్సన్‌ కంపెనీకి తప్ప మరెవ్వరికీ పాలు అమ్మటానికి వీల్లేదు. పాడి వ్యాపారంపై గుత్తాధిపత్యం సాధించిన పెస్తోన్‌జీ రైతులకు చాలా తక్కువ ధర చెల్లించేవారు. అంతేకాదు, కుంటిసాకులు చెబుతూ కొన్ని సార్లు పాలను రిజెక్ట్ కూడా చేస్తుండేవారు.

దీంతో నష్టపోయిన రైతులు పటేల్ దగ్గరికి వెళారు. అది స్వాతంత్ర్యోద్యమం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న కాలం. రైతులు పెస్తోన్‌జీ చేతిలో దోపిడీకి గురి కాకుండా, లాభాలు ఆర్జించగలగాలంటే కోఆపరేటివ్ పెట్టుకొని వాళ్లే పాలను కొని, ప్రాసెసింగ్ చేసి, మార్కెటింగ్ చేయాలని సర్దార్ పటేల్ సూచించారు. 'పోల్సన్ కాడీ ముకో’ (పోల్సన్‌ను వెళ్లగొట్టండి) అని పిలుపునిచ్చారు సర్దార్ పటేల్.

ఆ తర్వాత మొరార్జీ దేశాయి కూడా ఒక మీటింగ్ పెట్టారు. 'పోల్సన్‌కు గానీ, మరెవరికి గానీ పాలు అమ్మం’ అని రైతులతో తీర్మానం చేయించారు. ఈ నేపథ్యంలో 'కైరా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్ యూనియన్ లిమిటెడ్’ పేరుతో ఏర్పాటైన కోఆపరేటివ్‌కు స్వాతంత్ర్యోద్యమ నేతల్లో ఒకరైన త్రిభువన్ దాస్ అధ్యక్షుడయ్యారు. అలా 1946లో 'అమూల్‌’కు బీజాలు పడ్డాయి.

త్రిభువన్ దాస్ ఊరూరూ తిరిగి రైతులంతా కోఆపరేటివ్‌లో చేరాలని ప్రచారం చేశారు. రైతులు రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు – పోల్సన్ కంపెనీకి పాలు అమ్మకూడదు; ముంబయికి పాల సరఫరా బాధ్యతను తామే చేపట్టాలి.

కానీ పెస్తోన్‌జీ వెనుకడుగు వెయ్యలేదు. తనకు దన్నుగా ఉన్న బ్రిటిష్ ప్రభుత్వంతో రకరకాల ఎత్తులు వేయించారు. అయితే, రైతులు దీనికి నిరసనగా పాలు వీధుల్లో పారబోశారు. పోల్సన్ కంపెనీకి మాత్రం పాలు అమ్మలేదు.

రైతుల పోరాటంతో దిగివచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం రైతులే నేరుగా పాలు సరఫరా చేసేలా అనుమతినిచ్చింది. అలా రైతులు విజయం సాధించారు.

అయితే, పాలు చెడిపోకుండా ప్రాసెస్ చేసి నిల్వ చేయడం కోసం ఓ పెద్ద డెయిరీని ఏర్పాటు చేయడం వారి ముందున్న సవాలు. అప్పటికి భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చింది. ఈ దశలో త్రిభువన్ దాస్ కురియన్‌ను కలిశారు.

అమూల్

ఉద్యోగం వదిలేసి సహకారోద్యమంలోకి..

అప్పటికే తాను చేస్తున్న ఉద్యోగంతో విసిగిపోయి ఉన్న కురియన్ అనేక విఫల ప్రయత్నాల తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1949లో ఆనంద్ నుంచి వెళ్లిపోతున్న కురియన్‌ను దారిలో కలిసిన త్రిభువన్ దాస్ తమ కోఆపరేటివ్‌లో పని చేయాలని కోరారు.

అప్పటికే వారి మధ్య ఉన్న స్నేహంతో, నెలకు 600 రూపాయల జీతానికి కేవలం రెండు నెలలు మాత్రమే ఆ కోఆపరేటివ్‌లో పని చేసేందుకు కురియన్ సిద్ధపడ్డారు.

నాటి అనుభవాన్ని కురియన్ ఇలా గుర్తు చేసుకున్నారు:

“అందులో చాలా సమస్యలుండేవి. రైతుల కోరికలు చాలా చిన్నవి. ప్రాసెసింగ్, మార్కెటింగ్‌లో వారిని భాగం చేస్తే చాలు. నా దగ్గర దానికి కావల్సిన సాంకేతిక పరిజ్ఞానం ఉంది. అప్పటికి ఉన్న మెషీన్‌ను తీసేసి కొత్త డెయిరీ ఏర్పాటు చేయాలని నేను త్రిభువన్ దాస్‌ను కోరాను. దానికి రూ.40 వేలు ఖర్చవుతుందని చెప్పాను. అలా పాశ్చరైజింగ్ మెషీన్‌ను ఏర్పాటు చేశాను. రెండు నెలల తర్వాత నా జీతాన్ని రూ. 700లకు పెంచి మరి కొద్ది రోజులుండమని కోరారు. ఆ తర్వాత రూ. 800లకు పెంచి నన్ను దానికి మేనేజర్‌ చేశారు. ఇక అక్కడే ఉండిపోయాను.”

1955లో ఆ కోఆపరేటివ్‌కు 'అమూల్’ అనే బ్రాండ్‌ నేమ్‌ను స్థిరపర్చారు. 'అమూల్యమైన’, 'ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్’ – ఈ రెండు పేర్లూ కలిసి వచ్చేలా 'అమూల్’ అని పెట్టారు. అలా అయిష్టంగా ఆనంద్‌కు వచ్చిన కురియన్ 'అమూల్‌’లో విడదీయరాని భాగం అయ్యారు. దాదాపు 90 ఏళ్ల వయసులో, 2012 సెప్టెంబర్ 9న ఆయన చనిపోయేంత వరకూ 'అమూల్‌’తోనే కొనసాగారు.

“కేవలం 200 మంది రైతులతో మొదలైన మా సహకార సంస్థ సభ్యత్వం తర్వాత 20 వేలకు, ఆ తర్వాత 40 వేలకు చేరింది. త్రిభువన్ దాస్ అందులో ఎవ్వరినీ జోక్యం చేసుకోనివ్వలేదు. నన్ను పూర్తిగా ఓ ప్రొఫెషనల్ మేనేజర్‌గా ఉంచారు. నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. రైతులు మొదట్లో నన్ను వింతగా చూశారు. ఓ విదేశీయుడిలా భావించేవారు. గ్రామస్థులు ఒక దశలో నన్ను వ్యతిరేకించారు కూడా. మొదట్లో నష్టాలు కూడా ఉండేవి. అయితే, అమూల్‌కు ప్రతిష్ట వచ్చింది అంటే, అది అప్పటి ప్రధాని లాల్ బహాదుర్ శాస్త్రి 1965లో ఆనంద్‌లో పర్యటించిన తర్వాతే” అన్నారు కురియన్.

'అమూల్’ మోడల్

1965లో నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) ఏర్పాటు తర్వాత కురియన్ 'ఆపరేషన్ ఫ్లడ్’ బ్లూ ప్రింట్ తయారు చేశారు. అలా 'అమూల్’ మోడల్‌ను దేశమంతా అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధమైంది.

కురియన్ అభిప్రాయం ప్రకారం, అమూల్ మోడల్ అంటే రైతులు కేవలం పాల ఉత్పత్తికి మాత్రమే పరిమితం కాకుండా, ప్రాసెసింగ్, మార్కెటింగ్ బాధ్యతల్ని కూడా వారే నిర్వహించడం.

ప్రస్తుతం దాదాపు 36 లక్షల మంది గుజరాత్ రైతులు అమూల్‌లో సభ్యులుగా ఉన్నారు. గుజరాత్‌లో దాదాపు 18,500 గ్రామాల్లో విలేజ్ కోఆపరేటివ్‌లు ఉన్నాయి. భారత్‌లో అగ్రశ్రేణి డెయిరీ, ఫుడ్ కంపెనీగా ఉన్న అమూల్ టర్నోవర్ దాదాపు రూ. 52 వేల కోట్లు.

మాంద్యం, ఆర్థిక సంక్షోభాలు లాంటివేవీ కూడా 'అమూల్’ వృద్ధిని ఏనాడూ అడ్డుకోలేకపోయాయి.

దేశవ్యాప్తంగా 'అమూల్’ మొదటి స్థానంలో ఉండగా, వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు కోఆపరేటివ్‌లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో విజయ, సంగం డెయిరీలు, రాజస్థాన్‌లో సరస్, పంజాబ్‌లో వెర్కా, కర్నాటకలో నందిని, బిహార్‌లో సుధ డెయిరీ... ఇంకా మరెన్నో కోఆపరేటివ్‌ సంస్థలు అమూల్ నమూనాలో తయారైనవే.

వీటిలో చాలా వాటికి కురియన్ ఆధ్వర్యంలో అమూల్ నుంచి సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ అందాయి.

ఇప్పుడు అమూల్ రోజూ దాదాపు 230 లక్షల లీటర్లు పాలను 70 ప్లాంట్లలో ప్రాసెస్ చేస్తుంది. ఈ ప్లాంట్లలో 20-22 వరకూ గుజరాత్ వెలుపల, దిల్లీ, ముంబయి, కోల్‌కతా వంటి నగరాల్లో ఉన్నాయి. అమూల్ పాల ఉత్పత్తులను దేశవ్యాప్తంగా 62 గిడ్డంగుల్లో నిల్వ చేస్తారు. అవి 10 లక్షల రిటైల్ దుకాణాల ద్వారా ప్రజల ఇళ్లలోకి చేరుతాయి.

ఇప్పుడేదీ సహకారోద్యమ స్ఫూర్తి?

ఆనంద్‌లో కురియన్ నిర్మించిన సహకారోద్యమం విప్లవాత్మకమైందని మాజీ వ్యవసాయ మంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్ వడ్డే శోభనాద్రీశ్వరరావు బీబీసీతో అన్నారు. అది చిన్న, సన్నకారు రైతుల జీవితాలను, ముఖ్యంగా మహిళా రైతుల స్థితిగతులను సమూలంగా మార్చివేసిందన్నారు.

“కరువు కాటకాల కాలంలో రైతులను ఆదుకునేది, అండగా నిలబడేది పాడి పరిశ్రమే. వ్యవసాయరంగ జీడీపీలో దాదాపు 25 శాతం పాడి, పశువుల పెంపకం నుంచే వస్తోంది. అయితే, కురియన్ పాడి రంగంలో అత్యంత విజయవంతంగా అమలు చేసిన సహకారోద్యమ స్ఫూర్తి మిగతా రంగాలకు ఎందుకు విస్తరించలేదు అనేది మాత్రం ప్రశ్నగానే ఉంది” అన్నారు వడ్డే.

“మొదట్లో గ్రామాల్లో సహకార బ్యాంకులు, సహకార సొసైటీలు రైతులకు రుణాలు అందిస్తూ ఉండేవి. కానీ అమూల్ నమూనా భిన్నమైంది. అది పూర్తిగా స్వయంప్రతిపత్తితో, ప్రభుత్వ జోక్యం లేకుండా పని చేసింది. కానీ గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న సహకార సంస్థలపైన ప్రభుత్వం, అధికారుల జోక్యం పెరగడంతో అవి క్రమంగా బలహీనపడిపోయాయి. ఆ తర్వాత 1990ల్లో వచ్చిన ఆర్థిక సంస్కరణలు వాటిని ఇక పూర్తిగానే దెబ్బతీశాయని చెప్పొచ్చు” అన్నారు వడ్డే శోభనాద్రీశ్వరరావు.

కురియన్ కూడా గతంలో ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు, “కోఆపరేటివ్ నిర్మించగానే అయిపోదు. అందులో ప్రజాస్వామ్యం ఉండాలి. సభ్యులతో ఎన్నియ్యే బోర్డు ఉండాలి. బోర్డు సభ్యులకు మేనేజింగ్ డైరెక్టర్‌ను నియమించే, తొలగించే అధికారాలు ఉండాలి. అప్పుడే అది సరిగా నడుస్తుంది.”

అమూల్ కోఆపరేటివ్ మోడల్ మిగతా రంగాల్లో ఎందుకు సక్సెస్ కావడం లేదు అన్న ప్రశ్నకు కురియన్ ఇలా జవాబిచ్చారు, “దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజాస్వామిక పాలన సక్సెస్ అయ్యిందా? ప్రజాస్వామ్యంలో సమస్యలున్నాయంటే, దానికి పరిష్కారం మరింత ప్రజాస్వామ్యమే. క్షేత్రస్థాయిలో అసంఖ్యాకమైన ప్రజాస్వామిక నిర్మాణాలు లేకుండా దేశంలో ప్రజాస్వామ్యం నిలబడదు. ప్రజా సంస్థలైన విలేజ్ కోఆపరేటివ్‌లు అలాంటి వాటిలో ఒకటి.”

లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలను కురియన్ తప్పుపట్టారు. “అమెరికా సామ్రాజ్యవాదం, దాని ద్రవ్యసంస్థలైన ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ దేశ ఆర్థికవ్యవస్థలోకి చొరబడుతున్నాయి. ప్రభుత్వం తలకెత్తుకున్న ఈ ఆర్థిక విధానాల పట్ల నేను చాలా అసహనంగా ఉన్నాను. ఇవి దేశానికి ఏ మాత్రం మంచి చేయవు.”

విమర్శలూ తప్పలేదు..

కురియన్‌కు ఎన్ని ప్రశంసలు వచ్చినా, విమర్శలకు కూడా ఆయన అతీతుడేమీ కారు. కాలమిస్ట్ లైలా బవడం అభిప్రాయం ప్రకారం, అవసరమైన సందర్భాల్లో ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వకపోవడం వాటిలో ముఖ్యమైందని అంటారు.

అమూల్‌కు ముఖచిత్రంగా ఎల్లప్పుడూ తానే ఉండాలని ఆయన చూస్తారని విమర్శకులు అంటూ ఉండేవారు. 2006లో ఆయన కెరియర్ చివరి దశలో కొన్ని తీవ్రమైన వివాదాలు కూడా ఎదుర్కొన్నారు. నిరసనగా కొన్ని పదవులకు రాజీనామా కూడా చేశారు.

ఏదేమైనా, ఆయన తన ఆత్మకథలో పేర్కొన్నట్టుగా, రైతులకు నిజమైన సేవకుడిగా ఉండాలనేది ఆయన ధ్యేయం.

“రైతాంగం కోసం పని చేయాలనే భావన నాలో సామాజిక బాధ్యతను తట్టిలేపింది. సంతృప్తికరంగా జీవించడానికి డబ్బు ఒక్కటే ముఖ్యం కాదని నేను చాలా త్వరగా గుర్తించాను. సంతృప్తికరమైన జీవితానికి ఎన్నో మార్గాలున్నాయి. అవన్నీ నాకు ఆనంద్‌లో లభించాయి.”

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Varghese Kurian: 'Prime Minister Lal Bahadur Shastri stayed the night in that village to know Amul's secret..'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X