మీ ఇంట్లో కారు, బైక్ ఉందా..? కేంద్రం భారీ ఊరట.. కొత్త రూల్స్ ఇవే..
ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ రెండు మూడు బైక్ లు.. ఓ కారు సాధారణం అయిపోయింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్లు, బైక్ యజమానులు ఉన్నారు. అయితే వారందరికీ కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటను కలిగించింది. ఈ మేరకు కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ (PUC) వ్యాలిడిటీ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను నవంబర్ 19, 2026 న విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరేళ్ల లోపు ఉన్న భారత్ స్టేజ్-6 వ్యక్తిగత వాహనాలకు ప్రస్తుతం సంవత్సరానికి ఒకసారి పీయూసీ ఇస్తుండగా దాన్ని మూడేళ్లకు పెంచింది. కొత్త రూల్ వల్ల ఏడాదికోసారి రెన్యూవల్ చేసుకోవాల్సిన అవసరం లేనట్లు అయింది.
అలాగే ఆరేళ్ల నుంచి పదేళ్ల లోపు ఉన్న భారత్ స్టేజ్-6 వ్యక్తిగత వాహనాలకు కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ గడువును ఒక సంవత్సరానికి పెంచింది. ఆ పైబడిన వాహనాలకు ఆరు నెలలుగా పేర్కొంది. కాగా భారత్ స్టేజ్- 1, 2, 3 వాహనాలకు మూడు నెలలు, భారత్ స్టేజ్- 4 వాహనాలకు ఆరు నెలల వ్యాలిడిటీ ఉంటుందని స్పష్టం చేసింది. ఇక వెహికల్ మొదటి రిజిస్ట్రేషన్ తేదీ ఆధారంగా చేసుకుని వాహనాలకు సంబంధించిన వయస్సును లెక్కిస్తారన్న సంగతి తెలిసిందే. అటు భారత్ స్టేజ్- 6 ట్రాన్స్ పోర్ట్ వాహనాలకూ గడువును సవరించింది కేంద్ర ప్రభుత్వం. వాహనం రిజిస్ట్రేషన్ నుంచి ఆరేళ్ల వరకు రెండు సంవత్సరాలకోసారి పీయూసీ చేయించాల్సి ఉంటుంది.

ఇక ట్రాన్స్ పోర్ట్ వాహనం వయసు ఆరేళ్ల నుంచి పదేళ్ల వరకు ఉంటే పీయూసీ గడువును ఒక సంవత్సరంగా పేర్కొంది. అంటే ఏడాదికోసారి రెన్యూవల్ చేయించుకోవాలి. ఇక పదేళ్ల పైబడిన కమర్షియల్ వాహనాలు ప్రతి ఆరు నెలలకోసారి పీయూసీ రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుందని తాజా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కొత్త నిబంధనలు కేవలం దేశ రాజధాని దిల్లీలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. మరోవైపు ఈ రూల్స్ రాకముందే జారీ చేసిన పీయూసీ సర్టిఫికెట్ల విషయంలో వాటి తదుపరి రెన్యువల్ సమయంలోనే కొత్త వ్యాలిడిటీ పరిమితులు వర్తించనున్నాయి.












Click it and Unblock the Notifications
