సీఈసీ రాజీనామా, SIR వివాదం పై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు..!!
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. సీఈసీ రాజీనామా, 'సర్' ప్రక్రియ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలపై స్పందించారు. ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. రాజ్యాంగబద్ధ సంస్థను రాజకీయాలతో ముడిపెట్టడం, వ్యక్తిగత విమర్శలు సరికాదన్నారు. నిరాధార ఆరోపణలతో సీఈసీ, ప్రధాని రాజీనామా చేయాలనే డిమాండ్ సమంజసం కాదని చెప్పుకొచ్చారు. ఓట్లు మూకుమ్మడిగా తొలగించారనేది అపోహ మాత్రమే అని స్పష్టం చేశారు.
ఎన్నికల సంఘం వివాదం ఇప్పుడు రాజకీయ అంశంగా మారింది. ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ ఈ రోజు పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు ఇచ్చింది. ముందస్తు అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో సీఈసీ వివాదం .. ప్రతిపక్షాల తీరుపైన వెంకయ్య నాయుడు స్పందించారు. గెలిస్తే తమ ఘనత అని.. ఓడిపోతే ఈవీఎమ్‌లను నిందించడం హాస్యాస్పదమంటూ వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘంపై వ్యక్తిగత దాడి సరికాదు.. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ అని, అలాంటి వ్యవస్థలను అనవసర రాజకీయ వివాదాల్లోకి లాగడం ఏమాత్రం తగదని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాలు, విధానాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగడం సాధారణమేనని... ప్రతిపక్ష పార్టీలు తమ నిరసనను తెలియజేయవచ్చు లేదా సీఈసీ రాజీనామా డిమాండ్ చేయవచ్చు, కానీ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులపై వ్యక్తిగతంగా దాడులు చేస్తూ రాద్ధాంతం చేయడం సరికాదని వెంకయ్య నాయుడు హితవు పలికారు.

ప్రతిపక్షాల తీరు పై విమర్శలు
అదే విధంగా దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను మూకుమ్మడిగా తొలగించారని వస్తున్న ఆరోపణలను వెంకయ్య నాయుడు ఖండించారు. "ఇది కేవలం కొందరు కల్పిస్తున్న అపోహ మాత్రమే, ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఎన్నికల్లో విజయం సాధిస్తే తమ సొంత ఘనత అని చెప్పుకునే పార్టీలు, ఓటమి ఎదురైన వెంటనే ఈవీఎంలు, ఎన్నికల సంఘంపై నిందలు వేయడం పరిపాటిగా మారింది" అని దుయ్యబట్టారు. దేశ ప్రతిష్ఠను కాపాడాలిఎన్నికల కమిషన్ సభ్యులందరూ ఐక్యంగా పనిచేస్తున్నామని స్పష్టత ఇస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు ఎందుకు వివాదాన్ని రాజేస్తున్నాయో అర్థం కావడం లేదని అన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థల విశ్వసనీయత ను వీధుల్లోకి తీసుకువచ్చి దెబ్బతీయడం వల్ల అంతిమంగా దేశ ప్రతిష్ఠకే భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించకుండా, ఏదైనా ప్రకటన చేసేముందు ఆలోచించుకోవాలని సూచించారు.













Click it and Unblock the Notifications
