Dilip Kumar: బాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ కన్నుమూత: విషాదంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూశారు. ఆయన వయస్సు 98 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యానికి గురైన ఆయన ముంబైలోని పీడీ హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం 7:30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని హిందూజా ఆసుపత్రి డాక్టర్లు ధృవీకరించారు. అనారోగ్య కారణాలతో దిలీప్ కుమార్ కన్నుమూశారని ఆసుపత్రి సీనియర్ డాక్టర్ జలీల్ పార్కర్ తెలిపారు.
దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్. హిందీ చలన చిత్ర పరిశ్రమలో ఓ ట్రెండ్ సెట్టర్. తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ను ఏర్పరచుకున్నారు. బాలీవుడ్‌ను ఏలిన నటుల్లో దిలీప్ కుమార్ ఒకరు. మ్యూజికల్ సినిమాల కేరాఫ్ అడ్రస్ ఆయన. దశాబ్దాల పాటు హిందీ చలనచిత్ర రంగాన్ని ఏలారు. భారతీయ చలన చిత్ర రంగంలో గోల్డెన్ ఏజ్‌గా చెప్పుకొనే తరానికి చెందిన నటుడాయన. దేవదాస్, మొఘల్-ఎ-ఆజమ్, గంగా జమున, రామ్ ఔర్ శ్యామ్, నయా దౌర్, మధుమతి, క్రాంతి, విధాత, శక్తి వంటి మైల్ స్టోన్స్ వంటి సినిమాల్లో నటించారు.

1940వ దశకంలో హిందీ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన దిలీప్ కుమార్ 1998 వరకూ సినిమాల్లో నటించారంటే ఆయన స్టామినా, ఇమేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. 1998లో విడుదలైన ఖిల్లా.. ఆయన చివరి సినిమా. తనతో పాటు అనేక సినిమాల్లో నటించిన సైరాబానును పెళ్లి చేసుకున్నారు. ముంబైలో నివసిస్తోన్నారు. కొంతకాలంగా ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతూ వస్తోన్నారు. శ్వాసకోస సంబంధిత ఇబ్బందులు, న్యుమోనియాతో బాధపడుతున్నారు.
కొద్దిరోజుల కిందటే ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య కుదుటపడటంతో డిశ్చార్జ్ అయ్యారు. మళ్లీ తిరగబెట్టడంతో హిందూజా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని డాక్టర్లు అత్యాధునిక వైద్యాన్ని అందించారు. అయినప్పటికీ- కోలుకోలేకపోయారు. ఈ ఉదయం 7:30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్ జలీల్ పార్కర్ తెలిపారు. దిలీప్ కుమార్ భౌతికకాయానికి ఈ సాయంత్రం అంత్యక్రియలను నిర్వహించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications