'ఏ క్షణమైనా ప్రభుత్వం కూలిపోవచ్చు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు'
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త పొలిటికల్ హీట్ మొదలైంది. దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండికొడుతూ సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) అధికారంలోకి వచ్చినప్పటికీ, అక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోవచ్చంటూ డీఎంకే (DMK) అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలు రావచ్చని, అందుకోసం డీఎంకే శ్రేణులు ఇప్పుడే సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత మొదటిసారి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన స్టాలిన్, ఈ ఓటమి తాత్కాలికమేనని స్పష్టం చేశారు. "ప్రస్తుత విజయ్ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు, ఏ క్షణమైనా పడిపోవచ్చు. 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటే తమిళనాడు అసెంబ్లీకి కూడా మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. మనమంతా సిద్ధంగా ఉండాలి, మళ్లీ గెలిచి తీరుతాం" అంటూ స్టాలిన్ క్యాడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేశారు.

విజయ్ సర్కార్‌ను వెంటాడుతున్న 'అస్థిరత' భయం!
ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి సొంతంగా 107 సీట్లు ఉన్నాయి, దానికి మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇవి కాకుండా, రెండేసి సీట్లు ఉన్న నలుగురు డీఎంకే మిత్రపక్షాలు వెలుపల నుండి మద్దతు ఇస్తుండటంతో విజయ్ ప్రభుత్వం మెజారిటీని ఎంజాయ్ చేస్తోంది. వీటికి తోడు, గత వారం జరిగిన విశ్వాస పరీక్షలో (Trust Vote) ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన 25 మంది తిరుగుబాటు ఏఐఏడీఎంకే (AIADMK) ఎమ్మెల్యేల మద్దతు కూడా సీఎం విజయ్‌కు ఉంది.
అయితే, ఈ లెక్కల వెనుకే అసలు ప్రమాదం పొంచి ఉందని డీఎంకే వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బయట నుండి మద్దతు ఇస్తున్న వీసీకే (VCK), సీపీఐ (CPI), సీపీఎం (CPM), ఐయూఎంఎల్ (IUML) పార్టీలు ఎప్పుడైనా మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు, ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన ఆ 25 మంది తిరుగుబాటు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలపై తమిళనాడు స్పీకర్ లేదా కోర్టులు అనర్హత వేటు వేస్తే.. విజయ్ ప్రభుత్వం తక్షణమే మైనారిటీలో పడిపోవడం ఖాయం. ఈ పొలిటికల్ లూప్‌హోల్స్‌ను బేస్ చేసుకునే స్టాలిన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.
ఓటమికి బాధ్యత నాదే.. సోషల్ మీడియాలో తగ్గొద్దు!
తమిళనాడు రాజకీయ చరిత్రలో గత 59 ఏళ్లుగా సాగుతున్న ద్రవిడ పార్టీల గుత్తాధిపత్యానికి బ్రేక్ వేస్తూ టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో డీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూడటమే కాకుండా, స్టాలిన్ స్వయంగా తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో కూడా ఓడిపోయారు. ఈ ఓటమికి పూర్తి నైతిక బాధ్యత తనదేనని అంగీకరించిన స్టాలిన్.. "తమిళనాడులో సూర్యుడు (DMK గుర్తు) ఎప్పటికీ అస్తమించడు" అని ధీమా వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో ఉనికిని పెంచుకోవాలి..
అలాగే, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ చాలా వేగంగా దూసుకుపోతోందని, డీఎంకే కూడా సోషల్ మీడియాలో తన ఉనికిని భారీగా పెంచుకోవాలని క్యాడర్‌కు సూచించారు. "ఒకప్పుడు మనం టీ కొట్టుల్లో మాట్లాడిన రాజకీయాన్ని, ఇప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది" అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఎన్నికల ఓటమికి గల కారణాలను విశ్లేషించడానికి, ప్రజల నుండి నేరుగా ఫీడ్‌బ్యాక్ సేకరించడానికి స్టాలిన్ 36 మంది సభ్యులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు, డీఎంకే విమర్శలపై స్పందించిన టీవీకే వర్గాలు.. తాము దేనికీ భయపడటం లేదని, పూర్తి కాలం ప్రభుత్వం నడుపుతామనే నమ్మకం తమకు ఉందని స్పష్టం చేశాయి.














Click it and Unblock the Notifications