ఏనుగు కుంభస్థలంపై గురిపెట్టిన విజయ్
తమిళనాడులో పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 234 నియోజకవర్గాలకు నేడు ఒకే దశలో ఓటింగ్ జరుగుతోంది. డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకే.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలతో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించాయి. దీనికి అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకున్నాయి. టీవీకే పూర్తిస్థాయిలో ఎన్నికల బరిలో నిల్చోవడం వల్ల త్రిముఖ పోరు ఏర్పడింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ హోరాహోరి పోరు నెలకొంది. ఈ పోరులో విజేత ఎవరనేది మే 4వ తేలుతుంది.
టీవీకే చీఫ్ విజయ్ ఈ ఉదయమే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నీలాంకారైలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పుడు అక్కడ కొంత గందరగోళం నెలకొంది. విజయ్ రాకతో ఆయన అభిమానులు, మీడియా ప్రతినిధులు భారీ సంఖ్యలో ఒకేసారి దూసుకువచ్చారు. ఆయన ఫొటోలు తీయడానికి ఎగబడ్డారు. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక షామియానా కూలిపోయింది. షామియానాకు సపోర్ట్ గా పెట్టిన కర్రలు వంగిపోయాయి.

2021లో విజయ్ ఓ సాధారణ ఓటరుగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంటి నుంచి సైకిల్ పై పోలింగ్ కేంద్రానికి వచ్చారాయన అప్పట్లో. కరోనా ఉండటం వల్ల ముఖానికి మాస్క్ ధరించి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఆ మాస్క్ కలర్ పై పెద్ద చర్చే జరిగింది. డీఎంకే జెండాను పోలిన ఎరుపు, నలుపు రంగులు ఉన్న సైకిల్ పై పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేశారు. నల్లరంగు మాస్క్ ధరించారు. దీంతో డీఎంకే పరోక్షంగా మద్దతు తెలిపారనే వార్తలు అప్పట్లో వెల్లువెత్తాయి.
సరిగ్గా అయిదు సంవత్సరాలు తిరిగే సరికి ఇప్పుడు అదే విజయ్.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలవడం విశేషం. టీవీకే పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడేళ్ల కిందటే పార్టీని నెలకొల్పారు గానీ..2024 నాటి లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టంగా నిర్మించుకోగలిగారు ఈ మూడు సంవత్సరాల కాలంలో. ద్రవిడ పార్టీలకు ధీటుగా నిల్చున్నారు.
లక్షలాదిమంది అభిమానుల బలం, అండదండలతో డీఎంకే, ఏఐఏడీఎంకే, ఇతర పార్టీలకు సవాల్ విసిరారు. ఒంటరిగా పోటీ చేయడమే కాకుండా 234 నియోజకవర్గాల్లో సొంతంగా అభ్యర్థులను నిలబెట్టారంటే ఆయన ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సీబీఐ కేసులను ఎదుర్కొంటూ కూడా ఒంటరిపోరుకే మొగ్గు చూపారు. రాజకీయంగా బీజేపీ నుంచి ఎటువంటి ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గలేదు దళపతి. ఈ ఎన్నికల్లో విజయ్ ప్రభావం ఎంత అనేది చర్చనీయాంశమౌతోంది.












Click it and Unblock the Notifications