విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖపట్నం: ఏజెన్సీలో చిన్నారుల ప్రాణాలు తీస్తున్న ఆ అంతుచిక్కని వ్యాధి ఏంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రూఢకోటలో గత రెండేళ్లలో పుట్టిన పిల్లల్లో ఇప్పటికి 12 మంది శిశువులు మరణించారు.

విశాఖ ఏజెన్సీలోని రూఢకోట గ్రామంలో వరస శిశు మరణాలు మిస్టరీగా మారాయి. పుట్టిన మూడు నుంచి నాలుగు నెలల లోపే చిన్నారుల ప్రాణాలు పోతున్నాయి. గత రెండేళ్లలో 12 మంది శిశువులు ఇలా మరణించారు.

ఆ గ్రామంలో ఏం జరుగుతుందో తెలియక, బిడ్డ కడుపున పడ్డాడని తెలియగానే...ఆ కుటుంబ సభ్యులు ఆ గ్రామాన్ని విడిచిపోతున్నారు. అంతు చిక్కని శిశుమరణాలు సంభవిస్తున్న పెదబయలు మండలం, రూఢకోట గ్రామంలో బీబీసీ తెలుగు టీం పర్యటించింది.

'నా వైపు చూసి నవ్వుతూ ఉండేవాడు'

రూఢకోట గ్రామంలో ప్రవేశించగానే మొదటి వరుసలో కనిపించే ఇల్లు సుభద్రది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు 2019 కంటే ముందు పుట్టారు. వారు ఆరోగ్యంగానే ఉన్నారు. 2021 ఆగస్ట్‌లో బాబు పుట్టాడు. నవంబర్ 6న అనారోగ్యంతో చనిపోయాడు.

"ఒక రోజు ఊపిరందక ఇబ్బందిపడ్డాడు. పొట్ట కూడా కాస్త ఉబ్బినట్లు కనిపించింది. దవాఖానాకు తీసుకుని వెళ్లాం. అంతా బాగానే ఉందన్నారు. ఇటువంటివి పిల్లల్లో సహజమే అని చెప్పారు. ఇంటికి తీసుకొచ్చిన కొద్ది గంటలకే చనిపోయాడు. అప్పటికే ఊర్లో కొందరు పిల్లలు చనిపోయినా, అందరికీ అలాగే జరగదు కదా అని ఊళ్లోనే ఉన్నాం. బాబుని పోగొట్టుకున్నాం'' అని సుభద్ర గద్గద స్వరంతో చెప్పారు.

''నన్ను చూసి నవ్వుతూ ఉండేవాడు. కాళ్లు, చేతులు కదుపుతూ ఆడుకునేవాడు. అన్నయ్య, అక్క అని చూపిస్తే... వాళ్లని చూసేవాడు. నేను వాడిని చూసుకుంటూ ఇంటి పనులు చేసుకుంటూ ఆనందంగా ఉండేదాన్ని'' అన్నారామె.

మిగతా ఇద్దరు పిల్లలకూ ఏమైనా అవుతుందేమోనని సుభద్ర భయపడుతున్నారు.

''గత రెండేళ్లుగానే మా గ్రామంలో చనిపోయిన 14 మంది పిల్లల వయసు మూడు, నాలుగు నెలలే. అసలేందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు" అని సుభద్ర బీబీసీతో అన్నారు.

గత రెండేళ్లలో 12మంది చిన్నారులు మరణించారని అధికారులు చెబుతుంటే, గ్రామస్థులు మాత్రం 14 మంది అంటున్నారు.

"వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరికి మా ఊర్లో జరుగుతున్నపిల్లల మరణాల గురించి చెప్పాం. కొందరు వచ్చి చూశారు. కానీ మరణాలు మాత్రం ఆగలేదు. మహిళలకు తల్లి కాబోతున్నామన్న సంతోషంకన్నా భయం పట్టుకుంటోంది" అని రూఢకోట గ్రామంలోని పరిస్థితిని సుభద్ర వివరించారు.

వరస మరణాలతో గ్రామంలో మహిళలు పిల్లల గురించి బెంగ పెట్టుకుంటున్నారు.

'ఈసారి గర్భం వస్తే ఇక్కడ ఉండను'

గ్రామంలో శిశుమరణాలు సంభవించడంతో గర్భవతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైద్యుల సూచన మేరకు అవసరమైన పరీక్షలన్నీ చేయిస్తున్నారు. అంతా బాగానే ఉంటోంది. అయినా పిల్లల మరణాలు మాత్రం ఆగడం లేదు.

"నా భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు. నేను గర్భవతిని అయినప్పటి నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. అప్పటికే ఊర్లో కొందరు పిల్లలు మరణించడంతో భయంగా ఉండేది. 2020 పిభ్రవరిలో తొలి కాన్పులో మగబిడ్డ పుట్టాడు. మూడు నెలలకే చనిపోయాడు. మళ్లీ 2021 మార్చిలో మరో బాబు పుట్టాడు. ఆ బాబు కూడా మూడు నెలలకే చనిపోయాడు. వాంతులు వస్తున్నాయని ఆసుపత్రికి తీసుకెళ్తే, ఏం సమస్య లేదని చెప్పి పంపించేశారు. ఇద్దరు పిల్లలు కూడా వాంతులు, పొట్ట ఉబ్బరంలాంటి సమస్య కనపడిన రెండు రోజులకే చనిపోయారు'' అని హిమబిందు అనే మహిళ వెల్లడించారు.

''వేర్వేరు సమస్యలతో చనిపోయారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ, చనిపోయిన చిన్నారులంతా దాదాపు ఒకే విధంగా చనిపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు" అని వరుసగా ఇద్దరు కొడుకులను కోల్పోయిన హిమబిందు తన బిడ్డల ఫొటోని చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

"ఈ సారి గర్భం రాగానే మరో ఊరు వెళ్లిపోతాం. పిల్లలు కాస్త పెద్దవాళ్లైన తర్వాతే వస్తాం. పుట్టిన పిల్లలు వరుసగా చనిపోతూంటే ఆ బాధను తట్టుకోలేకపోతున్నాం" అని హిమబిందు బీబీసీతో అన్నారు.

కొడుకును కోల్పోయిన ఓ తండ్రి

'ఆరోగ్యంగా ఉన్న పిల్లలను ఎందుకు తీసుకొస్తున్నారు'

రూఢకోటలో పుట్టిన శిశువులందరూ రెండు, మూడు నెలల వరకు బాగానే ఉంటున్నారు. ఆ తర్వాతే సమస్య మొదలవుతోంది. ఒక బిడ్డను కోల్పోయిన వారు రెండో బిడ్డనైనా బతికించుకోవాలని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వైద్యం కోసం ఏజెన్సీ నుంచి విశాఖపట్నంలోని పెద్ద ఆసుపత్రులకు, ప్రైవేటు ఆసుపత్రులకు కూడా తీసుకెళ్తున్నారు. అయినా ప్రాణాలు మాత్రం దక్కడం లేదు. గత రెండేళ్లలో వరుసగా పాపని, బాబుని కోల్పోయిన రత్నవేణిది అలాంది వ్యధే.

"మొదట పుట్టిన ఆడబిడ్డ మూడు నెలలకే మరణించింది. దాంతో, తర్వాత పుట్టిన బాబు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ వైద్యులు అంతా బాగానే ఉందని చెప్పడంతో...ఎందుకైనా మంచిందని విశాఖపట్నం కూడా తీసుకుని వెళ్లాం. అక్కడ కూడా అలాగే చెప్పారు. పైగా చక్కగా నవ్వుతూ, ఆడుకుంటున్నా పిల్లలను అనారోగ్యం అంటూ ఎందుకు తీసుకొస్తున్నారని డాక్టర్లు కోప్పడేవారు. ఆ తర్వాత నెలకే బాబు చనిపోయాడు" అని రత్నవేణి చెప్పారు.

గర్భవతులైన మహిళలున్న కుటుంబాలు భయంతో గ్రామం వదిలి వెళుతున్నాయి.

భయంతో గడపలకు తాళాలు

రూఢకోట గ్రామంలో చాలా గడపలకు తాళాలు వేసి కనపడుతున్నాయి. ఉన్న 150 కుటుంబాలలో కొందరు వరుస శిశు మరణాలతో ఈ గ్రామంలో ఏదో జరుగుతుందని భయపడి వేరే ఊర్లు వెళ్లిపోతే...మరి కొందరు గర్భవతులైన వారి కుటుంబాలు ఇక్కడ ఉంటే పుట్టబోయే పిల్లలు చనిపోతారనే భయంతో వెళ్లిపోయినట్లు స్థానికులు చెప్పారు.

"గ్రామంలో పుట్టే పిల్లలందరూ ఆరోగ్యంగానే ఉంటున్నారు. తగినంత బరువుతోనే పుడుతున్నారు. పాలు బాగానే తాగుతున్నారు. ఆహారం తినేటప్పుడు ఎటువంటి ఇబ్బంది పడటం లేదు. ఇక సమయానికి టీకాలు కూడా వేయిస్తున్నాం. సాధారణ జర్వాలకు టానిక్స్ ఇస్తున్నాం. ఎక్కడా తేడా ఉండటం లేదు. కానీ ఆకస్మాత్తుగా మరణిస్తున్నారు. ఎందుకు జరుగుతుందో అంతుపట్టడం లేదు. అయితే, గత రెండేళ్లలో పుట్టిన వారిలో ఎక్కువ మరణాలు కనిపిస్తున్నాయి'' అని రూఢకోట అంగన్వాడీ కార్యకర్త శ్యామలదేవి బీబీసీతో చెప్పారు.

''నీళ్లను పరీక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు. నీటిలో ఏదైనా తేడా ఉంటే మిగతా వారికి కూడా అనారోగ్యం రావాలి కదా. గ్రామంలో అంతా బాగానే ఉంటున్నారు'' అన్నారామె.

రూఢకోటలో ఆరోగ్య కేంద్రం ఉన్నా, చిన్నారుల మరణాలు ఆగడం లేదు.

'మరణాలకు కారణాలనేకం'

కడుపు నొప్పి, వాంతులు, ఊపిరి సమస్యతో చిన్నారులు ఇబ్బంది పడుతుంటే స్థానికంగా ఉన్న రూఢకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుని వెళ్తున్నారు. ఇది కూడా గ్రామానికి కిలోమీటరు కంటే తక్కువ దూరంలోనే ఉంది.

రెండేళ్లుగా రూఢకోట గ్రామంలో సంభవిస్తున్న శిశుమరణాలపై అధ్యయనం చేస్తున్నామని రూఢకోట ఆరోగ్య కేంద్రం ఇంఛార్జ్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ బీబీసీతో చెప్పారు.

"నవజాత శిశువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి పాలు పట్టడం నుంచి, తిండి, నిద్ర అన్నింటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. రెండేళ్లకు ముందు పుట్టిన పిల్లలంతా బాగానే ఉన్నారు. ప్రస్తుతం గ్రామంలో మరో నలుగురు గర్భిణీలు ఉన్నారు. చనిపోయిన వారిలో నాటు మందు వాడటం, పాలు సమయానికి ఇవ్వకపోవడం, మోతాదుకు మించి ఇవ్వడం, ఊపిరి సరిగా అందకపోవడం, డయేరియా వంటి కారణాలతో చనిపోయారని ప్రాథమికంగా నిర్థారణ జరిగింది’’ అన్నారు శ్యామ్ ప్రసాద్ అన్నారు.

గర్భంలోనే కొందరికి ఆరోగ్య సమస్యలుంటాయని, మేనరిక వివాహాలు కూడా శిశుమరణాలకు కారణాలయ్యే అవకాశం ఉందని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ చెప్పారు. ఈ పరిణామాలపై పూర్తిస్థాయి అధ్యయనం చేయాల్సి ఉందని ఆయన వెల్లడించారు.

చిన్నారులకు అన్నం తినిపిస్తున్న మహిళ

రూఢకోటకు కేజీహెచ్ వైద్య బృందం

వరుస శిశుమరణాలపై అధ్యయనం చేసేందుకు విశాఖ కేజీహెచ్ నుంచి వైద్య బృందాన్ని రూఢకోట పంపిస్తున్నట్లు పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ చెప్పారు. వారం రోజుల్లో ఈ బృందం గ్రామంలో పర్యటించి మరణాలకు కారణాలు, అక్కడున్న పరిస్థితులు, ఇతర ఆరోగ్య సమస్యలు వంటి వాటిపై అధ్యయనం చేస్తారని చెప్పారు.

"ఇప్పటికే స్థానిక అధికారులు, వైద్యుల నుంచి ప్రాథమిక నివేదిక అందింది. శిశుమరణాలు పునరావృతం కాకుండా వైద్యుల బృందం అందించే పూర్తిస్థాయి నివేదిక ద్వారా ప్రభుత్వం తరపున అవసరమైన చర్యలన్నీ తీసుకుంటాం" అని పీవో గోపాలకృష్ణ తెలిపారు.

'రాష్ట్రంలో శిశు మరణాలు తగ్గాయి...రూఢకోట కలవరపెడుతోంది'

రాష్ట్రంలో ఒకవైపు శిశుమరణాలు రేటు తగ్గుతోందని నివేదికలు చెబుతున్నాయి. తాజా కేంద్ర వార్షిక నమూనా ప్రకారం ఏపీలో ఆరేళ్ల నుంచి శిశు మరణాలు తగ్గుతున్నాయి. ఈ మరణాల రేటులో జాతీయ సగటు 30 ఉండగా ఏపీలో 29గా ఉందని పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ సురేశ్ చెప్పారు.

"ఏడాదిలోపు వయసున్న శిశు మరణాల రేటు ఆంధ్రప్రదేశ్లో ఆరేళ్ల నుంచి క్రమంగా తగ్గుతోంది . ఏపీలో 2014లో శిశు మరణాల రేటు 39 కాగా...అది 2019 నాటికి 29కి తగ్గింది. శిశుమరణాల్లో ఎక్కువగా పౌష్ఠికాహార లోపం, సరైన ఆహారం, తల్లిపాలు అందకపోవడం, టీకాలపై అవగాహన లేకపోవడం, ఇంటి పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం వంటివి కూడా కారణాలు కావొచ్చు’’ అన్నారు డాక్టర్ సురేశ్.

ఏజెన్సీలో ఏడాదిలోపు వయసున్న శిశుమరణాలు మాత్రం కలవరపెడుతున్నాయని డాక్టర్ సురేశ్ అన్నారు.

గ్రామంలో నీటిని పరీక్ష చేయాలని రూఢకోట గ్రామ మహిళలు కోరుతున్నారు

అధికారులు పట్టించుకోవడం లేదు

రూఢకోటలో గత రెండేళ్లుగా మరణాలు సంభవిస్తున్నా...అధికారులు ఇప్పటికి కళ్లు తెరవలేదని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. గత పదిహేను రోజులుగానే అధికారులు దీనిపై మాట్లాడుతున్నారని వారు చెబుతున్నారు.

"శిశుమరణాలకు అంగన్‌వాడి, ఏఎన్ఎం, ఆశ వర్కర్లను కారణంగా చూపిస్తూ...వారిని బలిచేస్తున్నారు. అసలు గ్రామంలోకి ఉన్నతాధికారులు పర్యటనలు చేసి, అక్కడ స్థానికులతో మాట్లాడి వారికి ధైర్యం కల్పించి, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలి" అని గిరిజన సంఘం ప్రతినిధి సన్నిబాబు బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Visakhapatnam: What is the mysterious disease that is killing children in the agency
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X