జయలలిత వీడియో, శశికళ ఫ్యామిలీ ఫైట్: చీప్ ట్రిక్స్, వీడియో ఇస్తే, క్రిష్ణప్రియ ఫైర్ !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియో విడుదల కావడంతో చిన్నమ్మ శశికళ కుటుంబంలో మాటల యుద్దం మొదలైయ్యింది. టీటీవీ దినకరన్ చీప్ ట్రిక్స్ చేశాడని శశికళ మేనకోడలు క్రిష్ణప్రియ విమర్శించారు. అసలు జయలలిత చికిత్స వీడియో ఎవరు విడుదల చెయ్యమన్నారు? అంటూ టీటీవీ దినకరన్ ను క్రిష్ణప్రియ నిలదీశారు.

వైరల్ వీడియో
టీటీవీ దినకరన్ వర్గంలోని అన్నాడీఎంకే పార్టీ అనర్హత ఎమ్మెల్యే వెట్రివేల్ జయలలితకు అపోలో ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న సమయంలో తీసిన వీడియో ఇదే అంటూ మీడియా విడుదల చేశారు. వెట్రివేల్ విడుదల చేసిన వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యింది.
Recommended Video


శశికళ పేరు !
అపోలో ఆసుపత్రిలో జయలలితకు చికిత్స చేస్తున్న సమయంలో స్వయంగా శశికళ ఈ వీడియో తీశారని వెట్రివేల్ మీడియాకు చెప్పారు. ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న శశికళ కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు.

చీప్ ట్రిక్స్ ప్లే చేస్తావా
శశికళ వదిన ఇళవరసి కుమార్తె, జయా టీవీ సీఇవో వివేక్ సోదరి క్రిష్ణప్రియ ఆమె ఫోస్ బుక్ లో టీటీవీ దినకరన్ చీప్ ట్రిక్స్ గేమ్ ప్లే చేస్తావా ? అంటూ పోస్టు చేశారు. తరువాత ఆ పోస్టును మార్చి టీటీవీ దినకరన్ వెట్రివేల్ ను అడ్డం పెట్టుకుని చీప్ ట్రిక్స్ గేమ్ ఆడుతావా ? అంటూ అసహనం వ్యక్తం చేశారు.

మేమే వీడియో ఇచ్చాం
జయలలితకు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియో జాగ్రత్తగా పెట్టాలని సూచిస్తూ తామే టీటీవీ దినకరన్ కు ఆ వీడియో ఇచ్చామని క్రిష్ణప్రియ స్పష్టం చేశారు. టీటీవీ దినకరన్ ఆ వీడియో జాగ్రత్తగా దాచి పెడతారని శశికళతో పాటు మేము నమ్మామని క్రిష్ణప్రియ అన్నారు.

వెట్రివేల్ ఎవరు ?
టీటీవీ దినకరన్ దగ్గర ఉన్న వీడియో వెట్రివేల్ దగ్గరకు ఎలా వచ్చిందని, అసలు వీడియో విడుదల చెయ్యడానికి ఆయన ఎవరని క్రిష్ణప్రియ మండిపడ్డారు. మాకు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోవడానకి వెట్రివేల్ ఎవరూ అంటూ క్రిష్ణప్రియ విరుచుకుపడ్డారు.

ఎవరి స్వార్థం కోసం ?
జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియో ఎవరి స్వార్థం కోసం విడుదల చేశారు ?, వీడియో విడుదల చెయ్యమని మీకు ఎవరు చెప్పారని క్రిష్ణప్రియ ప్రశ్నించారు. తన మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా వీడియో విడుదల చెయ్యడానికి శశికళ అంగీకరించలేదని క్రిష్ణప్రియ అన్నారు.

అమ్మకు ఇష్టం లేని పని !
జయలలిత తాను చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలు విడుదల చెయ్యకూడదని అమ్మ మాట తీసుకున్నారని, ఇప్పుడు ఆమెకు ఇష్టం లేని పని చేశారని క్రిష్ణప్రియ విచారం వ్యక్తం చేశారు. మొత్తం మీద నిజంగానే క్రిష్ణప్రియ టీటీవీ దినకరన్ మీద మండిపడ్డారా ? లేక ప్రజలను తికమకపట్టించడానికి ఇలా మాట్లాడారా ? అనే విషయం అర్థం కాలేదని అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు అంటున్నారు.












Click it and Unblock the Notifications