రిసార్ట్‌కు కరెంట్ కట్, మీడియాపై దాడి: జయ ఫోటోపై ఒట్టు.. శశికళ బుజ్జగింపు
అన్నాడీఎంకే అధినేత్రి శశికళను ఈ రోజు రాత్రి పోలీసులు అరెస్టు చేసి తీసుకు వెళ్తారనే ప్రచారం తమిళనాట జోరుగా సాగుతోంది. శశికళ, ఆమె వర్గం ఎమ్మెల్యేలు ఉన్న గోల్డెన్ బే రిసార్టు వద్దకు పోలీసులు చేరుకున్నారు
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళను ఈ రోజు రాత్రి పోలీసులు అరెస్టు చేసి తీసుకు వెళ్తారనే ప్రచారం తమిళనాట జోరుగా సాగుతోంది. శశికళ, ఆమె వర్గం ఎమ్మెల్యేలు ఉన్న గోల్డెన్ బే రిసార్టు వద్దకు పోలీసులు చేరుకున్నారు.
ఇప్పటికే కొంతమంది పోలీసులు రిసార్ట్ వద్ద ఉన్నారు. మరికొంతమంది పోలీసులను అక్కడికి పంపిస్తున్నారు. గోల్డెన్ బే మార్గాన్ని కూడా పోలీసులు క్లియర్ చేస్తున్నారు. దీంతో ఆమెను ఈ రాత్రికి అరెస్టు చేసి తీసుకెళ్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.
అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష, జరిమానా పడిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఈ రోజు ఉదయం దీనిపై తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

ఎమ్మెల్యేలను ఉంచిన కూవత్తూర్‌లో సోమవారం రాత్రి నుంచి నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శశికళపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆ గ్రామంలో 144 సెక్షన్ విధించారు.
సోమవారం రాత్రి శశికళ రిసార్ట్‌లో బస చేయడంతో అదనపు బలగాలను మోహరించారు. కాంచీపురం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. ఇదే సమయంలో రిసార్ట్‌లోని ఎమ్మెల్యేలను నగరానికి తీసుకురావడానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ప్రత్యేక చర్యలు చేపట్టారు.
మంగళవారం రెండు బస్సులను కూడా కూవత్తూర్‌కు పంపారు. ఉత్తర జోన్ ఐజీ సెంతామరై కన్నన్ సహా పలువురు ఉన్నతాధికారులు రిసార్ట్‌లోకి వెళ్లి అక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించారు. శశికళకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు మినహా ఇతరులు రిసార్ట్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో శశికళ వర్గీయులు ఆందోళన చేస్తారనే సమాచారంతో 144 సెక్షన్ విధించి స్ట్రెయికింగ్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ప్రత్యేక పోలీసు బలగాలతో ఆ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించారు.
రిసార్ట్ వద్ద ఉన్న ప్రయివేటు భద్రత సిబ్బందితో పాటు రిసార్ట్ లోపల, బయట, కూవత్తూర్ గ్రామంలో ఉన్న అనుమానితులు, శశికళ మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పలువురు అన్నాడీఎంకే సర్వసభ్య కమిటీ సభ్యులనూ అదుపులోకి తీసుకుని, అయిదు బస్సుల్లో వారిని కూవత్తూర్ నుంచి బయటకు తరలించారు.
రిసార్టు వద్ద ఉద్రిక్తం
- శశికళ రిసార్టు నుంచి వెళ్లిపోయారు. మరోవైపు పన్నీరు సెల్వం మరోసారి జయ సమాధి వద్ద నివాళులు అర్పించారు. జయ మేనకోడలు దీపా జయకుమార్ కూడా సమాధిని సందర్శించారు.
- మీడియా ప్రతినిధుల పైన శశికళ వర్గీయులు మరోసారి దాడికి పాల్పడ్డారు. గోల్డెన్ బే రిసార్టుకు భారీగా పోలీసులు వచ్చారు. ఖైదీల వ్యాన్ సిద్ధం చేశారు. దీంతో అమె అరెస్టుపై ప్రచారం సాగింది. అదే సమయంలో శశికళ మీడియాతో మాట్లాడుతారని వర్తమానం అందింది. కెమెరామెన్లు మాత్రమే లోపలకు రావాలని, రిపోర్టర్లు బయటే ఉండాలని శశికళ వర్గయులు చెప్పారు. లోనికి వెళ్లిన కెమెరామెన్లపై వారు దాడికి పాల్పడ్డారు.
- పన్నీరుకు కాకుండా తాను ఎంపిక చేసిన పళని స్వామికి మద్దతివ్వాలని అంతకుముందు శశికళ రిసార్టులోని ఎమ్మెల్యేలను బుజ్జగించారు. జయ ఫోటోపై ఒట్టు పెట్టాలని సూచించారు.
- పోలీసులతో శశికళ వాగ్వాదం జరిపారు. కుటుంబ సభ్యులను ఎలా పంపిస్తారని శశికళ పోలీసులపై మండిపడ్డారు.
- బౌన్సర్లు, నేతలు తక్షణం వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు.
- ప్రజాప్రతినిధులు కాని వారు రిసార్టును వదిలి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు.
- శశికళ ఇంకా రిసార్టులోనే ఎమ్మెల్యేలతో కలిసి ఉన్నారు.
- రిసార్టు వద్ద ఉన్న శశికళకు చెందిన గ్యాంగును పోలీసులు అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఎమ్మెల్యేలతో పాటు గ్యాంగును కూడా రిసార్ట్ ఖాళీ చేయమని ఆదేశించి, పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
- రిసార్టులో ఉన్న నేతలను వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలను కూడా వెళ్లిపోవాలని ఆదేశించారని సమాచారం.
- రిసార్టుకు విద్యుత్ కనెక్షన్‌ను తొలగించారు. ఇప్పటికే అక్కడ కొంతమంది పోలీసులు ఉన్నారు. మరికొంతమందిని తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications