యువతుల అసభ్యపదజాలం: ఆప్‌కి కౌంటర్ వీడియో
న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు దాడి చేసిన వీడియోను ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేస్తే.. దానికి కౌంటర్‌గా ఢిల్లీ పోలీసులు మరో వీడియోను విడుదల చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోడీని, ఢిల్లీ పోలీసులను అసభ్య పదజాలంతో దూషించిన వీడియోను పోలీసులు మంగళవారం విడుదల చేశారు.
ప్రధానిని, పోలీసులను అసభ్య పదజాలంతో దూషించిన నేపథ్యంలోనే వారిపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై దాడి చేసిన వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ వీడియోను విడుదల చేశారు.
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో గత శనివారం ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం వద్ద జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాయలం(జేఎన్‌యూ)కు చెందిన కొందరు విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.
ఆందోళన చేస్తున్న విద్యార్థులను నియంత్రించేందుకు పోలీసు బలగాలను ఉపయోగించారు ఢిల్లీ పోలీసులు. అయితే, బిజెపి ఢిల్లీ పోలీసులను ఉపయోగించి విద్యార్థులను ఆందోళనలను అణిచివేస్తుందంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
ఆ తర్వాత విద్యార్థులపై పోలీసులు దాడి చేసిన వీడియోను విడుదల చేశారు. ఈ దాడిలో ప్రైవేటు వ్యక్తులు(బిజెపి, ఆర్ఎస్ఎస్‌కు చెందినవారు) కూడా పాల్గొన్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. విద్యార్థులపై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications