బెంగళూరు ప్రజలకు బ్యాడ్ న్యూస్, వాటర్ ట్యాంకుల యజమాన్యం నిరసనలు, నీళ్ల ట్యాంకులు బంద్ !
బెంగళూరులో నీటి సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నీటి ఎద్దడిని ఎదుర్కోవడం కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఇదిలా ఉంటే బెంగళూరులో నీటి ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగడంతో ఐటీ హబ్ ప్రజలకు నీటి సమస్య తీవ్రరూపం దాల్చనుంది. బెంగళూరులో నీటి ఎద్దడి పెరుగుతుండటంతో ప్రజలు ట్యాంకర్ నీటిని ఆశ్రయిస్తున్నారు.
దీన్ని ఆసరాగా చేసుకుని వాటర్ ట్యాంకర్ల యజమానులు నీటి ధరలను భారీగా పెంచేశారు. పెరుగుతున్న ప్రైవేట్ ట్యాంకర్ల ధరలను అరికట్టాలని సిద్దరామయ్య ప్రభుత్వానికి బెంగళూరు ప్రజలు వినతి పత్రాలు ఇస్తున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులపై చర్యలు చేపట్టింది. బెంగళూరులో నీటి సరఫరా చేస్తున్న బీడబ్లూఎస్ఎస్ బీ (BWSSB) అధికారులు ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్దం అయ్యారు.

కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలను ఖండిస్తూ బెంగళూరులోని వాటర్ ట్యాంకర్ల యజమానులు ఆందోళనకు దిగారు. బెంగళూరులోని జేపీ నగర్‌లోని జంబూసవారి దిన్నెలో సుమారు వంద మందికి పైగా వాటర్ ట్యాంకర్ల యజమానులు ఆందోళనకు దిగారు. సిద్దరామయ్య ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడితే నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేస్తామని, తరువాత నీటి సమస్య ఇంకా ఎక్కువ వస్తుందని ప్రభుత్వాన్ని వాటర్ ట్యాంకర్ల యజమానులు హెచ్చరించారు.

ట్యాంకర్ల యజమానుల నిరసన నేపథ్యంలో ఈరోజు (మార్చి 7వ తేదీ) బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డీకే శివకుమార్, ట్యాంకర్ అసోసియేషన్ మధ్య కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత వాటర్ ట్యాంకుల యజమానులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. మొత్తం మీద ఇప్పటికే నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న బెంగళూరు ప్రజలు ఇప్పుడు వాటర్ ట్యాంకుల యజమానుల ధర్నాలతో మరింత ఇబ్బంది పడే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు.












Click it and Unblock the Notifications