పోలీసులు చేస్తోన్నారు?- సీజేఐ డీవై చంద్రచూడ్ ఫైర్..!!
న్యూఢిల్లీ: రోజులు గడుస్తున్నప్పటికీ మణిపూర్‌లో చెలరేగిన హింసకు బ్రేకులు పడట్లేేదు. అక్కడి పరిస్థితులు అదుపులోకి రావట్లేదు. రెండున్నర నెలలుగా ఈ రాష్ట్రం మండిపోతూనే వస్తోంది. మెయితీ, కుకీ సామాజిక వర్గాల మధ్య మొదలైన రిజర్వేషన్ అంశం రోజురోజుకూ తీవ్రరూపాన్ని దాల్చుతూనే ఉంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపినప్పటికీ.. ఏ మాత్రం ఫలితం ఉండట్లేదు.
ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి.. ఊరేగించడం, అందరూ చూస్తుండగానే వారిపై అత్యాచారానికి పాల్పడిన అమానవీయ సంఘటనల వీడియోలు వెలుగులోకి రావడం- అక్కడి హింసాత్మక పరిస్థితులకు ఆజ్యం పోసినట్టయింది. ఈ ఘటన- అటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ ప్రస్తావనకు వచ్చింది. ఉభయసభల్లో ప్రకంపనలు పుట్టించింది. ఇవ్వాళ్టికీ అదే తీరు కొనసాగుతుంది.

మణిపూర్‌లో చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులపై అటు దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం స్పందించింది. మణిపూర్ అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లపై ప్రస్తుతం వాడివేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు జరుగుతున్నాయని, ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని వ్యాఖ్యానించారాయన. ఈ వాస్తవాన్ని అందరూ అంగీకరించక తప్పదనీ పేర్కొన్నారు. మత కలహాలు సంభవించినప్పుడు మహిళలపైనే దాడులు తీవ్రతరమౌతున్నాయని పేర్కొన్నారు. మణిపూర్‌లో జరిగిన అమానవీయ ఘటనను సమర్థించలేమని తేల్చి చెెప్పారు.
ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ మణిపూర్ తరహాఉదంతమే పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌లల్లో జరిగాయని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ అభ్యర్థిని వివస్త్రను చేసి ఊరేగించిన వీడియో వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. దేశంలో ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని చెప్పారు.
దీనికి సీజేఐ బదులిస్తూ- దేశంలో ఇతర ప్రాంతాల్లో మహిళలపై జరిగిన దాడులు, హింసను మణిపూర్ ఘటనతో ముడిపెట్టి చూడటం ఏ మాత్రం సహేతుకం కాదని అన్నారు. మహిళలపై దాడులు ఎక్కడ జరిగినా తప్పేనని వ్యాఖ్యానించారు. మణిపూర్, పశ్చిమ బెంగాల్.. ఇలా వేర్వేరుగా చూడటం మంచిది కాదని హితవు పలికారు.
రక్షిస్తే మహిళలందరినీ రక్షించాలి. లేదా ఏ ఒక్కరినీ కాపాడకూడదు.. అనే ఉద్దేశంలో ఉన్నట్లుగా కనిపిస్తోందని సీజేఐ.. సొలిసిటర్ జనరల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను మే 4వ తేదీన నగ్నంగా ఊరేగించగా.. అదే నెల 18వ తేదీన ఎఫ్‌ఐఆర్ నమోందైందని, ఇంత జాప్యం ఎందుకు చోటు చేసుకుందని డీవై చంద్రచూడ్ సూటిగా ప్రశ్నించారు.
మే 4 నుంచి మే 18 వరకు పోలీసులు ఏం చేస్తున్నారు? మహిళలను నగ్నంగా ఊరేగించి, ఇద్దరిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిందని, పోలీసులు ఏం చేశారని డీవై చంద్రచూడ్ నిలదీశారు. దీన్ని నిర్భయ అత్యాచార ఘటనతో సమానంగా చూడటం సరికాదని చెప్పారు. తాము ఐపీసీ ప్రత్యేక నేరంగా గుర్తించే దైహిక హింస గురించి మాట్లాడుతున్నామని గుర్తు చేశారు.
పరిపాలనపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించే విషయం తమను ఆందోళనకు గురి చేస్తోందని డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై సీబీఐ, సిట్‌లకు విచారణకు అప్పగించడం చాలదని పేర్కొన్నారు. బాధితురాలికి సత్వర న్యాయం అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. అనంతరం దీనిపై విచారణను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications