గాలి ఇంట పెళ్లి అదిరింది: ఆంధ్రా వంటకాలు (ఫోటోలు)
బెంగళూరు: మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తన స్థాయికి తగ్గట్లు తన కుమార్తె బ్రహ్మిణి వివాహం జరిపించారు. పెళ్లికి విచ్చేసిన అతిథులకు అదిరిపోయే ఆంధ్రా స్టైల్ భోజనాలు వండించారు. పెళ్లికి వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం ఎదురుకాకుండా చూసుకున్నారు.
మైసూరు పాక్, లడ్డు, 16 రకాల స్వీట్స్, పలు రకాల పచ్చళ్లు, గోంగూర చట్ని, పరోట, కుర్మా, అన్నం, పప్పు, సాంబార్, రసం, క్యారెట్ హల్వా, రసగుల్ల, పెరుగు, ఆవకాయ తదితర వంటకాలు అదిరిపోయే రిచితో తయారు చేయించారు.

అదిరిపోయే సెట్టింగ్స్
విజయనగర సామ్రాజ్యాన్నికళ్లకు కట్టినట్లు ప్రవేశ ద్వారం దగ్గర అదిరిపోయే విధంగా సెట్టింగ్స్ వేశారు. పెళ్లికి విచ్చేసిన ప్రముఖులను అక్కడ నుంచి గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కళ్యాణ మండపం దగ్గరకు తీసుకు వెళ్లారు.

ప్రముఖులు హాజరు
కన్నడ పవర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్, గోల్డన్ స్టార్ గణేష్, అలనాటి నటి జయంతి, శరత్ బాబు, సుమన్, శ్రీనాథ్, పలు పార్టీల శాసన సభ్యులు, ఎంపీలు, జిల్లా పంచాయితీ అధ్యక్షులు, సర్పెంచ్ లు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకులు, కర్ణాటక రెడ్డి జనసంఘం నాయకులు గాలి ఇంట జరిగిన పెళ్లికి హాజరైనారు.

ధన్యవాదాలు
పెళ్లికి విచ్చేసి వధూవరులను ఆశిర్వదించిన ప్రతి ఒక్కరికి గాలి జనార్దన్ రెడ్డి తులసి, శ్రీగంధంతో పాటు కృతజ్ఞతలు చెబుతున్న ఓ పత్రికను ఇచ్చారు. మీరు నా కుమార్తె పెళ్లికి వచ్చి ఆశిర్వదించినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటానని గాలి అతిథులకు వినయంగా చెప్పారు.

పార్టీలకు అతీతంగా
గతంలో గాలి జనార్దన్ రెడ్డి మీద కత్తులునూరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఇప్పుడు ఆయన కుమార్తె పెళ్లికి హాజరై అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. అదే విధంగా వివిద రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు గాలి ఇంట జరిగిన పెళ్లి వేడుకులకు హాజరైనారు.

మాట నిలబెట్టుకున్న యడ్డీ
బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లికి వస్తానని మాట ఇచ్చారు. హై కమాండ్ మాత్రం పెళ్లికి హాజరుకావద్దని చెప్పిందని వార్తలు వచ్చాయి. అయితే బుధవారం యడ్యూరప్ప, బీజేపీ ఎంపీ శోభా కరందాజ్లే, బీజేపీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి సీటి. రవితో సహ పలువురు బీజేపీ నాయకులు పెళ్లికి హాజరైనారు.

కేంద్ర మంతులు రాలేదు
కేంద్ర మంత్రులు (బీజేపీ) అనంతకుమార్, సదానందగౌడ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లికి హాజరుకాలేదు. వారిద్దరితో పాటు పలువురు బీజేపీ ఎంపీలు ఈ పెళ్లికి దూరంగా ఉన్నారు.

కాంగ్రెస్ మాట పక్కన పెట్టారు
కాంగ్రెస్ హైకమాండ్ ను కాదని పలువురు కాంగ్రెస్ ప్రముఖులు ఈ గాలి ఇంట జరిగిన పెళ్లికి హాజరైనారు. స్వయంగా కర్ణాటక హోం శాఖా మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్, ఇందన శాఖా మంత్రి, కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయకుడు డీకే. శివకుమార్ సైతం గాలి ఇంట పెళ్లికి హాజరైనారు.

మేమేం తక్కువ తిన్నాం
బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెళ్లికి హాజరు కావడంతో మేమేం తక్కువ తిన్నాం అంటూ జేడీఎస్ పార్టీకి చెందిన పలువురు శాసన సభ్యులు, మాజీ మంత్రులు గాలి ఇంట జరిగిన పెళ్లికి హాజరైనారు. ఇక బెంగళూరుకు చెందిన వివిధ పార్టీల కార్పొరేటర్లు, తమిళనాడు నుంచి పలువురు శాసన సభ్యులు గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి పెళ్లికి హాజరైనారు.












Click it and Unblock the Notifications