చెన్నైలో వరదలు: పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
చెన్నై: గత నెల రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు తమిళనాడు తల్లడిల్లుతోంది. రాజధాని చెన్నైలో కూడా కుండపోత వర్షాలు కురవడంతో ప్రజల జనజీవన విధానం అస్తవ్యస్తంగా తయారైంది. భారీ వర్షాల కారణంగా చెన్నై మాహా నగరం 100 ఏళ్ల రికార్డుని అధిగమించింది.
నెలరోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా మృతిచెందినవారి సంఖ్య 230 చేరుకోగా సోమ, మంగళవారాల్లో మరో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 260కు చేరింది. ఈ నేపథ్యంలో, తమిళనాడుకు రూ. 15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అసోచామ్ అంచనా వేసింది.
అనేక పరిశ్రమలు దెబ్బతిన్నాయని, రోడ్డు, రైలు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లిందని తెలిపింది. కాగా చెన్నై నగరంలోని రైల్వే వంతెనలపై ప్రమాదక స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో పలు రైళ్లను రద్దు చేశారు.
చెన్నైలో సోమవారం అర్ధరాత్రి వరకే 119.73 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెన్నైలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఇది సహాయక బృందాలకు సైతం ఇబ్బందికరంగా మారింది.

చెన్నైలోని పలు కాలనీలలో వరద నీరు చేరడంతో ప్రజలు ఇళ్లలోనే చిక్కుకుపోయారు. ఇంకా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వరదల్లో చిక్కుకున్నప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలను ఒక్కసారి పరిశీలిద్దాం.
పాటించాల్సిన జాగ్రత్తలు:
* విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలి. ఒకవేళ విద్యుత్ వైర్లు కిందకు వేలాడినట్లుగా లేదా కిందపడి ఉంటే కనుక వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలి.
* వరద నీరు పోయిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలి. పగిలిపోయిన సీసా ముక్కలు, పదునైన వస్తువుల వంటివి ఏవైనా ఉంటే గాయాలపాలవుతారు కాబట్టి.
* ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని తెలిసుకోవాలి.
* ఎమర్జెన్సీ కిట్‌ను దగ్గర పెట్టుకోవాలి. మీరు ఎక్కడున్న విషయం మీ బంధువులకు, మిత్రులకు వెంటనే తెలియజేయాలి.
* వరదనీటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే, మురుగు, కెమికల్స్, ఇతర పదార్థాలతో ఆ నీరు కలుషితమై ఉంటుంది.
* నీటి ప్రవాహం లేకుండా మామూలుగా ఉన్న నీటిలో నడిచి వెళ్లాల్సి వస్తే కనుక చేతికి ఊతంగా ఒక చిన్న కర్రను ఉపయోగించాలి. ఎందుకంటే, ఎక్కడ మాన్ హోల్స్ ఉన్నాయో, గొయ్యలు ఉన్నాయో తెలియదు కాబట్టి.
చేయకూడని పనులు:
* క్యాండిల్స్, లాంతర్లు వంటివి వెలిగించడం వంటి పనులు చేయాలి.
* టీవీలు, వీసీఆర్‌లు, సీఆర్‌టీ టెర్మినల్స్ వంటి వాటిని ఆన్ చేసేటప్పుడు తడి నేలపై నిలబడొద్దు.
* వరద నీటి ప్రవాహంలో నడవకూడదు.
* ఆ నీటిలో ఈత కొట్టకూడదు.
* నిలిచిపోయిన వరద నీటిని తొలగించేందుకు వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించవద్దని, మొదలైన జాగ్రత్తలు, సూచనలు పాటించాలి.
* విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులకు వెంటనే పూనుకోవద్దు.












Click it and Unblock the Notifications