వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైబర్ బుల్లీయింగ్ అంటే ఏంటి... పిల్లలు, టీనేజర్లు ఆ వలయంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సైబర్ నేరాలు

ప్రఖ్యాత సైబర్ సెక్యూరిటీ కంపెనీ, మెకఫీ, 2022లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచ దేశాల పిల్లలతో పోల్చుకుంటే భారత్‌లోని పిల్లలకు మొబైల్ మెచ్యూరిటీ (మొబైల్ ఫోన్లని, డివైజులని ఉపయోగించగలగడం) 10-14 ఏళ్ళకే వచ్చేస్తుంది. అలాగే, భారతీయ పిల్లలకు సైబర్ బుల్లీయింగ్ ప్రమాదం ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ఉందని కూడా ఈ అధ్యయనం వెల్లడించింది.

ఇతర దేశాల్లోని పిల్లల్లో 17% సైబర్ బుల్లీయింగ్‍కి గురవుతుంటే మన దేశంలో ఆ సంఖ్య 22% వరకూ చేరుకుంటోంది. 48% పిల్లలు తమకి తెలీని వ్యక్తులతో తరచుగానో, అప్పుడప్పుడూనో ఆన్‍లైన్‍లో మాట్లాడుతుంటామని చెప్పారు.

ఇవన్నీ ఆందోళన కలిగించే గణాంకాలు.

సమస్య ఇంతకు ముందు కూడా తీవ్రంగా ఉన్నా, కోవిడ్-19 వల్ల స్కూళ్ళు లేకపోవడం, ఆన్‍లైన్‍ క్లాసులు వల్ల డివైజుల ఉపయోగం ఎక్కువై, దానితో ఇంటర్నెట్‍ను మామూలు కన్నా తర్వగా వాడటం వల్ల తక్కువ వయసు పిల్లలు కూడా దుష్పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుంది. దానికి తోడు తల్లిదండ్రులకు, స్కూల్ యాజమాన్యానికీ కూడా ఈ విషయమై ఉండాల్సిన అవగాహన లేకపోవడం వల్ల సమస్య మరింత జటిలంగా మారుతోంది.

కరోనా మహమ్మారి కాలంలో ఇంటర్నెట్‌లో పిల్లలు

సైబర్ బుల్లీయింగ్ అంటే ఏమిటి?

టెక్నాలజీని వాడుతూ ఒకరిని వేధించడం, బెదిరించడం, వ్యక్తిగత విషయాలు బహిరంగపరచడం, అవమానించడం, అసభ్యపదజాలం వాడటం లాంటివన్నీ సైబర్ బుల్లియింగ్ కిందకు వస్తాయి. వ్యక్తి జాతిని, మతాన్ని, కులాన్ని, ఆచార వ్యవహారాలని, సెక్సువల్ ఓరియంటేషన్‍ని ఎద్దేవా చేస్తూ, తిడుతూ అవమానకరమైన కామెంట్స్/పోస్ట్స్ చేయడం కూడా ఇందులో భాగమే. అనుమతి లేకుండా దురుద్దేశ్యంతో ఇతరుల వీడియోలు, ఫోటోలు, పోస్టులు ఆన్‍లైన్‍లో షేర్ చేయడం కూడా నేరం.

సైబర్ బుల్లీయింగ్ జరిగే అవకాశాలు ఉన్న ప్రదేశాలు:

●సోషల్ మీడియా (ఫేస్‍బుక్, ఇన్‍స్టాగ్రామ్, ట్విట్టర్, టిక్‍టాక్ మొదలైనవి)

●ఎస్.ఎమ్.ఎస్/ఎమ్.ఎమ్.ఎస్ (సెల్యూలార్ నెట్వర్క్ పై పంపించే మెసేజ్‍లు)

●ఇన్‍స్టంట్ మెసేజింగ్ సర్వీసులు (ఫేస్‍బుక్ మెసెంజర్, వాట్సాప్ మొదలైనవి)

●ఈమెయిల్

కిడ్స్ స్టాప్ ప్రెస్.కామ్ వెబ్‍సైట్ వారు చేసిన అధ్యయనం ప్రకారం, టీనేజర్లు ఎక్కువగా ఎదుర్కొనేది మాటలు అనిపించుకోవడం, పుకార్లు లేవదీయడం, అసభ్యమైన ఫోటోలు అందుకోవడం లాంటివి. వీటిల్లో భాగంగా ఆడపిల్లలు బాడీ షేమింగ్, మగపిల్లలు తమ సెక్స్యువల్ ఓరియంటేషన్‍ గురించి వినరాని మాటలు వినాల్సి వస్తుంటుంది.

ఇవన్నీ చట్టవ్యతిరేక పనులు. అంటే, పోలీసులను, న్యాయవ్యవస్థను ఆశ్రయించి తగిన న్యాయం పొందే అవకాశాలున్నాయని గుర్తించాలి.

టీనేజర్లలో సైబర్ బుల్లీయింగ్ పర్యవసానాలు?

ముఖ్యంగా హైస్కూల్స్ లో బుల్లీయింగ్ అనేది ఒక సవాలే అయినప్పటికీ, సైబర్ బుల్లీయింగ్‍లో అవతలివారి ఐడెంటిటీ (అసలు పేరు, వివరాలు) తెలుసుకోవడం కష్టం. దీంతో, పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయి. అవతల ఉన్నది ఒక వ్యక్తా, అనేక వ్యక్తులా, ముఠానా అనేది తెలీకపోవడంతో శత్రువుని ఎదుర్కోవడం అసాధ్యమనిపించి ఆన్‍లైన్‍లోకి రావడమే మానుకోవడం, కొన్ని విపరీతమైన కేసుల్లో ప్రాణాలు తీసుకోవడం వరకూ వెళ్ళిన ఉదంతాలు ఉన్నాయి.

టీనేజ్ అనేది సున్నితమైన దశ. ఆ దశలో సైబర్ బుల్లీయింగ్ లాంటి అనుభవాలు ఎదుర్కొంటే పిల్లల మనసులపై చెరగని ముద్రలు పడతాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని అనుమానించాలో తెలీని తికమక, తమ తప్పు లేకపోయినా అవతలివారి బెదిరింపులకో, అదిలింపులకో భయపడి చేయకూడని పనులు చేసే అలవాటు మొదలవుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా వారి ఆత్మవిశ్వాసం దెబ్బ తింటుంది.

ఆన్‍లైన్‍లో బుల్లీయింగ్ ఎదుర్కొనే పిల్లలు చదువుల్లోనూ వెనుకబడే అవకాశాలు ఎక్కువ. చదువులు/ఆటల్లో ఆసక్తి చూపకపోవడం, ముభావంగా ఉండడం, చిన్నచిన్న విషయాలకి గాభరా పడటం, తమ ఫోన్/లాప్‍టాప్‍ దగ్గరకి ఇంకెవ్వరన్నా రాగానే కంగారు పడటం, ఆన్‍లైన్‍లో ఎవరితో మాట్లాడుతున్నారో ఎలాంటి స్టేటస్‍లు పంచుకుంటున్నారో మాటమాత్రంగా చెప్పడానికి కూడా నిరాకరించడం లాంటివి మామూలు కన్నా ఎక్కువగా కనిపిస్తే తల్లిదండ్రులు/గార్డియన్స్ గమనించుకోవాలి.

చాలా మంది పిల్లలు తల్లిదండ్రులతో ఈ విషయాలు పంచుకోడానికి సంకోచిస్తారు. పైగా పెద్దవాళ్ళకి గానీ తెలిస్తే ఇంకా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బుల్లియింగ్ చేసేవారు బెదిరించి ఉంటారు. అందుకని కూడా పిల్లలు తల్లిదండ్రులతో, టీచర్లతో ఈ విషయాలు పంచుకోడానికి వెనుకాడతారు.

ప్రతీకాత్మక చిత్రం

తల్లిదండ్రులు తీసుకోదగ్గ జాగ్రత్తలు

పిల్లలు సైబర్ బుల్లీయింగ్‌కు గురికాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే, ఇది కేవలం తల్లిదండ్రుల మీదే వదిలేసే బాధ్యత కాదు. స్కూళ్ళు, కమ్యూనిటీలు కూడా ఈ విషయమై పిల్లలతో చర్చించాలి. ఈ విషయమై తీసుకోదగ్గ కొన్ని జాగ్రత్తలు:

●పిల్లలను ఫోన్‍లో ఎవరు కాంటాక్ట్ చేయవచ్చనేది మీరే నిర్ధారించండి. తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్స్, మెసేజెస్ బ్లాక్ చేసేటట్టు వీలైతే సెట్టింగ్స్ పెట్టండి. వాళ్ళ నెంబర్లని నమ్మదగ్గవారితో పంచుకోండి. ఎట్టిపరిస్థితుల్లో పబ్లిక్ డొమైన్‍లో ఈ సమాచారం ఉండకుండా చూసుకోవాలి.

●పిల్లల ఫోన్‍లో వేసే యాప్స్‌లో వీలైనన్ని రూల్స్ సెట్ చేయండి. ఎవరు కాంటాక్ట్ చేయచ్చు, ఎవరికి వారి ఫోటోలు, స్టేటస్ అప్‍డేట్‍లు కనిపించాలన్న విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ యాప్స్ లో అయినా కిడ్స్ మోడ్, టీన్ మోడ్ ఉంటే దాన్ని యాక్టివేట్ చేయడం ఉత్తమం.

●పిల్లల ఫోన్‍లోని యాప్స్‌కి "కంటెంట్ ఆండ్ ప్రైవసీ రెస్ట్రిక్షన్స్" వీలున్న చోటల్లా ఎక్కువ స్థాయిలో ఉండేలా చూసుకోవాలి.

●రోజుకి ఎంత స్క్రీన్ టైమ్ లిమిట్ ఉందో, నెలకి ఎంత డేటా వాడవచ్చునో లాంటివి సెట్ చేయనిచ్చే "పేరంటల్ కంట్రోల్" యాప్స్ ఉంటాయి. పిల్లల డివైజులని ఇలాంటి యాప్స్ ద్వారా మానిటర్ చేస్తూ ఉంటే కొన్ని ప్రమాదాలను పసిగట్టవచ్చు. ఇలాంటివి దొంగచాటుగా చేయనవసరం లేదు. పెద్దవాళ్ళకి తమపై నమ్మకం లేదన్న భావన పిల్లలకి కలగడం మంచిది కాదు. అందుకని, వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్నెట్‍లో ఉండే "బ్యాడ్ ఆక్టర్స్" (దుష్టులు, హాని కలిగించేవారు) వివరంగా చెప్పి, వారి సంరక్షణ కోసమే ఇలాంటి చర్యలని అర్థమయ్యేలా చెప్పాలి.

●వయసు మళ్ళినవారికి టెక్నాలజీ వాడడంలో కొంత డిజిటల్ లిటరసీ అవసరం పడ్డట్టే, పిల్లల విషయంలోనూ అవసరం. ఎవరితో మాట్లాడచ్చు, స్టేటస్ అప్‍డేట్స్ లో ఏ విషయాలు రాయకూడదు, ఎలాంటి ఫోటోలు అప్‍లోడ్ చేయకూడదు వగైరా విషయాల గురించి వీలైనంతగా అవగాహన కలిపించాలి.

●సోషల్ మీడియా ఎటికెట్ - ఆన్‍లైన్‍లో తోటివారితో ఎలా మసలుకోవాలి, ఎలాంటి భాష వాడాలి, వాదోపవాదాలు తిట్టుకోవడాలకు ఎలా దూరంగా ఉండాలి అన్నవి కూడా చర్చించదగ్గ విషయాలు.

●వార్తల్లో వచ్చే సైబర్ క్రైముల గురించి, ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో జరిగి ఎక్కువ వైరల్ అయ్యే న్యూస్‍లు పిల్లలతో పంచుకుంటూ ఉండాలి. రేపు తమకో, తమ స్నేహితులకో చేదు అనుభవాలు ఎదురైనప్పుడు, "నాకే ఎందుకిలా జరిగింది? నేనేం తప్పు చేశాను?" లాంటి ఆలోచనల్లో ఇరుక్కోకుండా "ఇంటర్నెట్ లో ఇలాంటివి ఎవరికైనా జరగచ్చు. అందుకని నేను వెంటనే పెద్దల సాయం తీసుకుంటాను" అనే దిశగా ఆలోచించగలగుతారు.

●ఎంత నచ్చజెప్పినా, ఎంత స్నేహపూర్వకంగా ఉన్నా పిల్లలు తల్లిదండ్రులతో కొన్ని విషయాలు పంచుకోలేరు. ముఖ్యంగా టీనేజర్లు.

ఉదాహరణకి, తోటివాళ్ళల్లో ఎవరన్నా నచ్చితే, ఎవరితోనైనా స్నేహం చేయాలనిపిస్తే, ఆ వయసు కలిగించే భావావేశాలు వారికీ కొత్త. బుల్లీయింగ్ చేసేవాళ్ళు దీన్నే అవకాశంగా తీసుకుని, మంచి మాటలతో నమ్మించి, ఆ పైన తాము చెప్పింది చేయకపోతే పంచుకున్న ప్రైవేట్ విషయాలని పబ్లిక్ చేస్తామని బెదిరిస్తుంటారు. అందుకని పిల్లలకి తల్లిదండ్రులు మాత్రమే కాక వాళ్ళకన్నా కొంచెం పెద్దవాళ్ళైన కజిన్స్, సోషల్ సర్కిల్‍లో ఫ్రెండ్స్‌తో ఒక "బడ్డీ సిస్టమ్" ఉంటే అనూహ్య సంఘటనలు ఎదుర్కొన్నప్పుడు బయటకి చెప్పగలుగుతారు. లేదంటే పిల్లలు తమలో తామే కుమిలిపోయి విపరీత నిర్ణయాలు తీసుకునేదాకా వెళ్ళగలరు.

ప్రతీకాత్మక చిత్రం

టీనేజర్లు సైబర్ బుల్లీయింగ్ ఎదుర్కొంటే...

అన్నింటికన్నా ముందుగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయమేమిటంటే అన్ని సైబర్ బుల్లీయింగ్ కేసులు ఒకటే తీవ్రతను కలిగి ఉండవు. అవతలివారికి సమాధానం ఇవ్వకుండా, ఇంకేం సమాచారం అందించకుండా కేవలం "బ్లాక్" చేసి సమస్యను రూపుమాపే అవకాశాలున్న కేసులూ ఉంటాయని గుర్తుంచుకుంటే అప్పుడు బుల్లీయింగ్ కేస్ అనగానే హైరానా పడకుండా ఉండగలం.

కొన్ని కేసులు కొంత ఆందోళన కలిగించచ్చు. అలాంటి వాటి విషయంలో ముందు పిల్లలకు ధైర్యం చెప్పి, వాళ్ళని ఆ యాప్స్/డివైజులకి దూరంగా ఉంచి, బుల్లియింగ్ చేసే వ్యక్తులు ఏ స్థాయికి దిగజారుతున్నారు, ఏమని బెదిరిస్తున్నారన్నదాన్ని బట్టి తగిన చర్యలు తీసుకోవచ్చు.

బుల్లీయింగ్ చేసేవాళ్ళు స్కూల్‍కి సంబంధించినవారైతే స్కూల్ యాజమాన్యానికి, కాలనీకి సంబంధించినవారైతే అసోసిషేయన్లకి చెప్పి వారి సహాయం తీసుకోవచ్చు. ముఖ్యంగా, తెలిసినవాళ్ళే ఇలాంటి దురాగతాలకు పాల్పడినప్పుడు పిల్లలింకా బెదిరిపోతారు. ఇలా చేయడం సబబు కాదని, చట్టరిత్యానేరమని తెలీని తోటి పిల్లలే చేసినప్పుడు వారి-వీరి పేరెంట్స్, టీచర్స్ అంతా కలిసి చర్చించి, బుల్లియింగ్ చేసిన, గురైన పిల్లలకు సరైన మార్గం చూపించాలి.

మరికొన్ని కేసులు పూర్తిగా జటిలమైపోయి ఉండచ్చు. వాటికోసం సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్లు, పిల్లల సంక్షేమ సంస్థలు, పోలీసుల సహాయం తీసుకోడానికి వెనుకాడకూడదు. పోలీసులు, కోర్టులు వరకూ వెళ్ళడానికి మధ్యతరగతి కుటుంబాలు వెనుకాడతాయన్నది సైబర్ నేరాలు చేసేవాళ్ళ నమ్మకం. కానీ మనకి అవగాహన ఉంది, అన్యాయంగా ఇరుక్కోమని వారికి అనిపిస్తే మాత్రం చాలా మట్టుకు వెనక్కి తగ్గుతారు.

సోషల్ మీడియా

ఇండియాలో సైబర్ బుల్లీయింగ్ చట్టాలు

భారతదేశంలో సైబర్ బుల్లీయింగ్ కోసం ప్రత్యేకమైన చట్టాలేమీ లేవు. అయితే, ఇన్‍ఫర్మేషన్ టెక్నాలజీ ఆక్ట్ (IT Act)లోని సెక్షన్ 67 ద్వారా సైబర్ బుల్లియింగ్ కేసులు నమోదు చేయవచ్చు. సెక్షన్ 67 ప్రకారం అసభ్యమైన మెటీరియల్‍ను ఆన్‍లైన్‍లో పంచుకోవడానికి ఐదేళ్ళ జైలు శిక్ష, పది లక్షల రూపాయల వరకూ జరిమానా పడే అవకాశాలున్నాయి. ఈ విషయమై మరో రెండు చట్టాలు కూడా సహాయపడతాయని నిపుణుల అభిప్రాయం.

సెక్షన్ 507 ఐపీసీ: సైబర్ బుల్లియింగ్ దాదాపుగా "అనానిమస్" (అవతలివారి వివరాలు గోప్యంగా) జరుగుతుంటాయి కాబట్టి, ఆన్‍లైన్‍లో బెదిరింపులకి పాల్పడేవారికి ఈ సెక్షన్ కింద రెండేళ్ళ వరకూ జైలు శిక్ష పడచ్చు.

సెక్షన్ 66E:ఐటీ ఆక్ట్: వ్యక్తిగత సమాచారాన్ని అనుమతి లేకుండా దక్కించుకుని, ఆన్‍లైన్‍లో పెట్టడాన్ని ఈ సెక్షన్ కింద నమోదు చేయచ్చు.

జాగ్రత్త వహిస్తే ప్రమాదం దాదాపు తప్పినట్టే…

ఆన్‍లైన్‍కి దూరంగా ఉండి కేవలం ఆఫ్‍లైన్‍లోనే జీవితం గడిపే అవకాశం ఇప్పటి పిల్లలకు లేదు. అవకాశాలు, అనుభవాలు, ఆలోచనలు అన్నింటికీ ఆన్‍లైన్‍లో ఉండడం తప్పనిసరి. అయితే, సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదాలు తప్పించుకోలేకపోతే, లేత మనసులు చవిచూసే చేదు అనుభవాలు వాళ్ళని జీవితాంతం వెంటాడే అవకాశాలు ఉంటాయి.

బుల్లియింగ్‍లోలా ఆన్‍లైన్‌లో శారీరక ప్రమాదం ఉండకపోవచ్చు కానీ సైబర్ బుల్లియింగ్ మానసిక ఆరోగ్యాన్ని బాగా దెబ్బ కొడుతుంది. అందుకని, పదిమందితో కలిసి మెలిసి తిరగడానికి కావాల్సిన సోషల్ స్కిల్స్ లో ఆన్‍లైన్ ఎటిక్వెట్స్ కూడా నేర్పించాలి.

ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీ వెల్లువను మనం అర్థం చేసుకుంటూ వారికి అర్థం చేయించాలి. పిల్లలు ఇలాంటి విషయాలు త్వరగానే గ్రహిస్తారు, సరైన పద్ధతులు పాటిస్తారు. వారికి చెప్పేవారుండాలి. ఆ పనిని తల్లిదండ్రులమీదే వదలకుండా ప్రతి ఒక్కరూ తమకి చేతనైన విధంగా చేస్తూనే ఉండాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What is cyber bullying? What can children and teenagers do to avoid falling into that trap?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X