శవాలే వెళ్తాయి.. కదిలేది లేదు:డీఎంకె, 'స్పీకర్ నిర్ణయానికి తలొగ్గాల్సిందే'
స్పీకర్ నిర్ణయానికి సభ్యులంతా కట్టుబడి ఉండాల్సిందేనని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు.
చెన్నై: వీధి పంచాయితీలను తలపించేలా అసెంబ్లీ స్థాయిని దిగజార్చుతున్నాయి తమిళ రాజకీయాలు. రాజ్యాంగ విరుద్దంగా ఏకంగా స్పీకర్ చైర్ లోనే కూర్చొని డీఎంకె నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.
స్పీకర్ సైతం డీఎంకె నేతలు తనను వేధిస్తున్నారని వాపోయారు. సభను ఏమాత్రం ముందుకు కదలనివ్వకుండా డీఎంకె నేతలు అడ్డుపడుతుండటంతో వారందరిపై స్పీకర్ మూకుమ్మడి వేటు వేసి మధ్యాహ్నాం 3గం.లకు సభను వాయిదా వేశారు.

స్పీకర్ వేటు వేయడంతో డీఎంకె నేతలను సభ నుంచి బయటకు పంపించేందుకు మార్షల్స్ ప్రయత్నిస్తున్నారు. అయితే 'ఇక్కడి నుంచి బయటకు వెళ్లడమంటూ జరిగితే.. మా శవాలే వెళ్లాలి గానీ ప్రాణముండగా ఇక్కడి నుంచి కదిలేది లేదు' అని వారు మార్షల్స్ ను ప్రతిఘటించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీ పరిణామాలపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ ఈ పరిణామాలు దురదృష్టకరమన్నారు. స్పీకర్ నిర్ణయానికి సభ్యులంతా కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను టీవీల్లో ప్రసారం చేయకపోవడం పట్ల కపిల్ సిబల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ సుప్రీం కోర్టు జడ్జి మార్కండేయ కట్జూ సైతం తమిళ పరిణామాలపై స్పందించారు. తమిళనాడు అసెంబ్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అప్రజాస్వామికమని అన్నారు.












Click it and Unblock the Notifications