Ajinkya Shinde: కాక్రోచ్ కొత్త సారథి సక్సెస్ స్టోరీ! సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్..
ఢిల్లీలో ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారిన 'జంతర్ మంతర్ 2.0' ఆందోళనలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను టార్గెట్ చేస్తూ తలపెట్టిన ఈ నిరసనను ముందుండి నడిపించాల్సిన కాక్రోచ్ జనతా పార్టీ అగ్రనేతలను పోలీసులు దారిలోనే అడ్డుకున్నారు. అయితే, పోలీసులు తమను అరెస్ట్ చేస్తారనే ముందస్తు ఊహతోనే సీజేపీ అధినేత అభిజీత్ దిప్కే ముందుగానే ఒక వీడియోను రికార్డు చేసి ఉంచారు.
ఒకవేళ తాను గనుక అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వస్తే లేదా అరెస్టైతే, పార్టీ బాధ్యతలను, నిరసనను యువ నాయకుడు అజింక్య షిండే భుజాన వేసుకుంటారని ఆ వీడియోలో ఆయన స్పష్టం చేశారు. దీంతో అసలు ఈ ఆందోళనను లీడ్ చేస్తున్న అజింక్య షిండే ఎవరు? ఆయన నేపథ్యం ఏంటన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

శనివారం ఉదయం ముంబై నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేతో పాటు కో-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ఎయిర్‌పోర్ట్‌లోనే పోలీసులు అడ్డుకున్నారు. విమానం దిగడానికి ముందే రన్ వేపై ల్యాండ్ అయి ఉన్న విమానం లోపలికి వెళ్లిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించారు.
అంతకుముందే పార్టీ లీగల్ అఫైర్స్ హెడ్ రత్నా సింగ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు అరెస్టులను తీవ్రంగా ఖండించిన సీజేపీ వర్గాలు, ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డాయి. అయితే, అరెస్టుల వార్త ముందే ఊహించిన అభిజీత్ దిప్కే.. తన సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోను విడుదల చేసి, తన తర్వాత ఈ ఉద్యమాన్ని జాతీయ సంస్థాగత ఇన్‌ఛార్జ్ అయిన అజింక్య షిండే ముందుకు నడిపిస్తారని కార్యకర్తలకు స్పష్టమైన పిలుపునిచ్చారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి గుడ్‌బై.. మహారాష్ట్ర నుంచి రాజకీయ ప్రయాణం
మహారాష్ట్రలోని తీర ప్రాంత నగరమైన అలీబాగ్‌కు చెందిన 35 ఏళ్ల అజింక్య షిండే కుటుంబం పూర్తిగా వ్యవసాయ నేపథ్యం కలిగి ఉంది. కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన ఆయన పూణెలోని ఓ మల్టీ నేషనల్ ఐటీ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం చేశారు. అయితే సమాజంలో మార్పు కోసం ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2016లో గోవాలో అభిజీత్ దిప్కేను తొలిసారి కలిసిన షిండే.. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో కలిసి పనిచేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికలతో పాటు మహారాష్ట్రలో ఆ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా, పింప్రి-చించ్‌వాడ్ కన్వీనర్‌గా సేవలందించారు. ఆ తర్వాత కాలంలో అభిజీత్ దిప్కేతో కలిసి 'కాక్రోచ్ జనతా పార్టీ' స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం సీజేపీ జాతీయ సంస్థాగత ఇన్‌ఛార్జీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్.. 'స్కూల్ థిక్ కరో' ఉద్యమంతో గుర్తింపు
మహారాష్ట్ర అంతటా ప్రతి జిల్లాను చుట్టివచ్చిన అజింక్య షిండేకు యువతలో మంచి పట్టు ఉంది. గతంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని మారుస్తూ సీజేపీ చేపట్టిన 'స్కూల్ థిక్ కరో' ఉద్యమంలో ఆయన ముందుండి నడిచారు. అలాగే ఈ నెల ప్రారంభంలో ముంబైలోని దాదర్‌లో జరిగిన ఆందోళనలోనూ ఆయన పాల్గొన్నారు. గాంధీ జయంతి రోజున నిబంధనలు అతిక్రమించారన్న ఆరోపణలతో అభిజీత్ దిప్కేతో పాటు అజింక్య షిండేపై కూడా కేసులు నమోదయ్యాయి. క్షేత్రస్థాయిలో పార్టీని బలపడటంలోనూ, సోషల్ మీడియాలో తన గళం వినిపించడంలోనూ ముందుండే షిండేకు ఇన్‌స్టాగ్రామ్‌లో వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.
జంతర్ మంతర్ పోరుకు పూర్తి సన్నద్ధత
అగ్రనేతలందరినీ పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ, నిరసనను ఆపేది లేదని సీజేపీ తేల్చిచెప్పింది. అభిజీత్ దిప్కే ఇచ్చిన ఆదేశాల మేరకు జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన 'జంతర్ మంతర్ 2.0' ఆందోళనకు అజింక్య షిండే నేతృత్వం వహించనున్నాు. ఓటర్ల జాబితా సవరణలోని లోపాలను ఎత్తిచూపుతూ కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చేందుకు సీజేపీ శ్రేణులు భారీగా తరలివెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవైపు ఢిల్లీ పోలీసులు నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసి ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయగా.. అరెస్టయిన నాయకులకు బదులుగా అజింక్య షిండే రంగంలోకి దిగడంతో ఈ నిరసన రాజకీయంగా మరింత హీటెక్కింది.














Click it and Unblock the Notifications
