పన్నీర్-శశికళ వార్: చీలిక వెనుక స్క్రీన్‌ప్లే ఎవరిది?, కాచుకు కూర్చొన్న 'డీఎంకె'
ప్రస్తుతం పార్టీ ఇరువురు నేతల మధ్య నిలువునా చీలిపోయే పరిస్థితులు ఏర్పడటంతో.. అసలు ఈ తతంగం వెనుక ఎవరున్నారు? అనే వాదనలు వినిపిస్తున్నాయి.
చెన్నై: తమిళ అధికార పార్టీలో ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. కొద్దిరోజుల హైడ్రామా నేపథ్యంలో.. శశికళ 'సీఎం' పదవి చేపట్టడానికి సర్వం సిద్దమవడం.. ఇంతలోనే సుప్రీం కీలక ప్రకటన నేపథ్యంలో ఆమె ప్రమాణ స్వీకారం వాయిదా పడటం జరిగిపోయాయి.
ఈ పరిణామాలన్ని ఇలా కొనసాగుతుండగానే.. పన్నీర్ తో రాజీనామా చేయించడం కూడా జరిగిపోయింది. అయితే ముందుగా భావించినట్టు మంగళవారం నాడు శశికళ ప్రమాణ స్వీకారం జరిగిపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో గానీ.. అర్థరాత్రి 'పన్నీర్' ప్రకటించిన ధిక్కారంతో సీన్ అంతా రివర్స్ అయిపోయింది.
ప్రస్తుతం పార్టీ ఇరువురు నేతల మధ్య నిలువునా చీలిపోయే పరిస్థితులు ఏర్పడటంతో.. అసలు ఈ తతంగం వెనుక ఎవరున్నారు? అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు చెప్పిందల్లా చేసుకుపోయేవాడిగానే ముద్రపడ్డ పన్నీర్.. ఒక్కసారిగా తిరుగుబాటు ఎగరవేయడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది.
స్వతహాగా నెమ్మదస్తుడైన పన్నీర్.. ఇంత దూకుడుగా వ్యవహరించడం వెనుక కథా స్క్రీన్ ప్లే అంతా బీజేపీదే అయి ఉండవచ్చునని శశికళ వర్గీయులు భావిస్తున్నారు.
అనుకూలంగా మార్చుకుని తీరుతాం: డీఎంకె
అన్నాడీఎంకె ఆధిపత్య పోరు ప్రతిపక్షం డీఎంకెకు కలిసొచ్చేలా తయారైంది. పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తామని ఆ పార్టీ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తోంది.డీఎంకె కూడా ఈ పరిణామాలన్నింటి వెనుక కేంద్రం హస్తం ఉండవచ్చునని భావిస్తోంది.
ఏదేమైనా అన్నాడీఎంకెలో చీలిక పరిస్థితి వస్తే.. పన్నీర్ కు మద్దతుగా ఉండైనా.. ఆ పార్టీలో చీలిక తీసుకొచ్చే దిశగా డీఎంకె పావులు కదుపుతోంది. పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. చూడాలి మరి.. తమిళ రాజకీయాల్లో అన్నాడీఎంకె పరిస్థితి ఏ దిశగా సాగుతుందో?












Click it and Unblock the Notifications