నాడు అభినందన్ వర్ధమాన్.. నేడు?- ఎవరీ వ్యోమికా సింగ్
India Pakistan War: అభినందన్ వర్ధమాన్. భారత వైమానిక దళం వింగ్ కమాండర్. పాకిస్తాన్ వెన్నులో చలి పుట్టించిన ఘనుడు. 2019 నాటి బాలాకోట్ వైమానిక దాడుల సందర్భంగా పాకిస్తాన్ భూభాగంపై అడుగు పెట్టినా.. ఆ దేశ సైనికుల చేతికి చిక్కినా.. రొమ్ము విరిచి నిలిచిన ధీరుడు.
ఇప్పుడు దాదాపుగా ఇదే పాత్రను పోషిస్తోన్నారు.. వైమానిక దళం వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. బాలాకోట్ దాడుల్లో అభినందన్ వర్ధమాన్.. నేరుగా సరిహద్దులను దాటుకుని పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించి ఉగ్రవాదుల పీచమణచగా.. ఇప్పుడీ పనిని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కూర్చుని చేశారు వ్యోమికా సింగ్. ఆపరేషన్ సింధూర్‌లో కీలక పాత్రను పోషించారు.

ఆపరేషన్ సింధూర్‌పై అప్‌డేట్స్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెరిశారు వ్యోమిక. వైమానిక దళం తరఫున ఆమె ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. మీడియాకు బ్రీఫింగ్ చేశారు. తాజా మిస్సైళ్ల దాడుల్లో సాధించిన పురోగతిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
ఈ ప్రెస్ మీట్‌లో విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ఆర్మీ తరఫున కల్నల్ సోఫియా ఖురేషితో కలిసి పాల్గొన్నారు. వాయుసేనలో చేరాలనేది వ్యోమికా సింగ్ చిరకాల స్వప్నం. దాన్ని ఆమె నెరవేర్చుకోగలిగారు. ఆరో తరగతి నుంచే వాయుసేనపై ఇష్టాన్ని పెంచుకున్నారు.
ఉన్నత పాఠశాల దశలో ఎన్‌సీసీలో సైతం చేరారు. అంబరాన్ని అధిరోహించే దిశగా కలలుగన్నారు. దీన్ని నిజం చేసుకున్నారు. ఆమె పేరు కూడా అదే. వ్యోమిక అంటే ఆకాశం. వ్యోమికా సింగ్ కుటుంబంలో ఎవరు కూడా ఆర్మీలో లేరు. తన కుటుంబం తరఫున సాయుధ దళాల్లో చేరిన మొట్టమొదటి మహిళ ఆమె. వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్‌గా నియమితులయ్యారు. 2019 డిసెంబర్ 18వ తేదీన ఆమె ఫ్లయింగ్ బ్రాంచ్‌లో శాశ్వత కమిషన్ పొందారు.
భద్రతపరంగా అత్యంత సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్ సహా ఈశాన్యంలోని సంక్లిష్ట భూభాగాల్లో పనిచేశారు. చీతా, చేతక్ వంటి విభిన్న హెలికాప్టర్లను నడిపారు. 2,500 కంటే ఎక్కువ గంటల పాటు విమానాన్ని నడిపించిన ఘనతను సొంతం చేసుకున్నారు. వివిధ మిషన్లలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications