Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో 'లాటరీ కింగ్' శాంటియాగో మార్టిన్ కుటుంబం సంచలనం సృష్టిస్తోంది. కేవలం భారీ ఆస్తులతోనే కాకుండా, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కీలక వ్యక్తులు మూడు వేర్వేరు పార్టీల తరపున బరిలోకి దిగడం ఇప్పుడు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా, లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న లీమా రోజ్ మార్టిన్, రాష్ట్రంలోనే అత్యంత ధనిక అభ్యర్థిగా రికార్డు సృష్టించారు.

తమిళనాడు రాజకీయాల్లో ధనబలం ఎప్పుడూ చర్చనీయాంశమే, కానీ ఈసారి అది అన్ని హద్దులను దాటేసింది. లాటరీ వ్యాపార దిగ్గజం శాంటియాగో మార్టిన్ సతీమణి లీమా రోజ్, AIADMK తరపున లాల్గుడి నియోజకవర్గ అభ్యర్థిగా దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఆమె సమర్పించిన వివరాల ప్రకారం, వారి కుటుంబం అక్షరాలా రూ5,000 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉంది.

Who is Leema Rose The 6th Grade Pass Candidate with Rs 5000 Crore Wealth Contesting from Lalgudi in TN

ఆస్తుల చిట్టా: అక్షరాలా అపర కుబేరులు

లీమా రోజ్ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆస్తుల విభజన ఇలా ఉంది:

  • లీమా రోజ్ ఆస్తులు: రూ.139.62 కోట్ల చరాస్తులు, రూ.909.94 కోట్ల స్థిరాస్తులు (మొత్తం సుమారు రూ.1,050 కోట్లు).
  • శాంటియాగో మార్టిన్ (భర్త): రూ.3,262.01 కోట్ల చరాస్తులు, రూ.887.36 కోట్ల స్థిరాస్తులు.
  • జోస్ డైసన్ మార్టిన్ (కుమారుడు): రూ.225.56 కోట్ల చరాస్తులు, రూ.439.21 కోట్ల స్థిరాస్తులు.
  • ఆదాయం: 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ కుటుంబం మొత్తం దాదాపు రూ.40.77 కోట్ల వార్షిక ఆదాయాన్ని ప్రకటించింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని శాసిస్తున్న లీమా రోజ్ తన విద్యాార్హతను 6వ తరగతిగా పేర్కొన్నారు. 1967లో దేవకోట్టైలో జన్మించిన ఆమె, ప్రస్తుతం మార్టిన్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూనే రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

తిరుచ్చిలో చిరంజీవి నామినేషన్, విజయ్ కోసం రంగంలోకి
తిరుచ్చిలో చిరంజీవి నామినేషన్, విజయ్ కోసం రంగంలోకి

ఒకే ఇల్లు.. మూడు పార్టీలు

మార్టిన్ కుటుంబం ఈసారి ఎన్నికలను ఒక వ్యాపార వ్యూహంలాగా డీల్ చేస్తోందా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ కుటుంబ సభ్యులు భిన్న ధృవాల్లాంటి పార్టీల్లో కీలక పదవుల్లో ఉన్నారు:

  • లీమా రోజ్ (తల్లి): ప్రధాన ప్రతిపక్షం AIADMK మహిళా విభాగం సంయుక్త కార్యదర్శిగా ఉంటూ లాల్గుడి నుండి పోటీ చేస్తున్నారు.
  • జోస్ చార్లెస్ మార్టిన్ (కుమారుడు): పుదుచ్చేరిలో "లక్షియా జననాయగ కచ్చి (LJK)" అనే సొంత పార్టీని స్థాపించి, అక్కడ NDA కూటమిలో భాగంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేసులో ఉన్నారు.
  • ఆదవ్ అర్జున (అల్లుడు): తమిళ స్టార్ హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీలో ఎన్నికల నిర్వహణ విభాగం ప్రధాన కార్యదర్శిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈయన చెన్నైలోని విల్లివాక్కం నుండి బరిలో ఉన్నారు.

ఇది ప్రజా సేవనా? అధికార రక్షణ కవచమా?

గతంలో దేశంలోనే అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్ల (రూ.1,300 కోట్లకు పైగా) ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన సంస్థగా మార్టిన్ గ్రూప్ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ కుటుంబం నేరుగా రాజకీయాల్లోకి రావడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ (ED) విచారణను ఎదుర్కొంటున్న మార్టిన్ కుటుంబం, రాజకీయ అధికారం ద్వారా తమ వ్యాపార సామ్రాజ్యానికి రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

విజయ్ ను గెలిపిస్తున్న అన్నామలై?.. లోగుట్టు బయటపెట్టిన సర్వే
విజయ్ ను గెలిపిస్తున్న అన్నామలై?.. లోగుట్టు బయటపెట్టిన సర్వే

వ్యూహాత్మక విస్తరణ..

ఒకరు అధికార పక్షానికి దగ్గరగా ఉండే కూటమిలో (పుదుచ్చేరి), మరొకరు బలమైన ప్రతిపక్షంలో (AIADMK), ఇంకొకరు యువతలో క్రేజ్ ఉన్న కొత్త పార్టీలో (TVK) ఉండటం ద్వారా.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ పట్టు కోల్పోకుండా జాగ్రత్త పడుతున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

మొత్తానికి, ఆరో తరగతి చదువుకున్న మహిళ రూ.5,000 కోట్ల ఆస్తితో ఎన్నికల బరిలో నిలవడం, తన కుటుంబాన్ని మూడు వేర్వేరు పార్టీల్లో మోహరించడం తమిళనాడు ఎన్నికల చరిత్రలో ఒక అరుదైన ఘట్టంగా నిలిచిపోనుంది. ఏప్రిల్ 9, 23 తేదీల్లో జరిగే పోలింగ్‌లో లాల్గుడి ఓటర్లు ఈ 'కోటీశ్వరురాలి'కి పట్టం కడతారో లేదో చూడాలి!

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+