Haryana Polls: దేశంలోనే ధనిక మహిళ సావిత్రీ జిందాల్ మద్దతు ఎవరికి ?
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, ఆప్, జేజేపీ, ఏఎస్పీ, ఐఎన్ఎల్డీ, బీఎస్పీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. వీరితో పాటు పలు చోట్ల ఇండిపెండెంట్లు కూడా రంగంలో ఉన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో వీరందరి కంటే ఆసక్తి రేపుతున్న పోటీ సావిత్రీ జిందాల్ ది. హిసార్ నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన సావిత్రీ జిందాల్ దేశంలోనే అత్యంత సంపన్నురాలైన మహిళ.
దివంగత పారిశ్రామికవేత్త ఓపీ జిందాల్ సతీమణి అయిన సావిత్రీ జిందాల్ నిన్న మొన్నటివరకూ బీజేపీలో ఉన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఆమెకు హిసార్ నుంచి టికెట్ కేటాయిస్తారని అంతా భావించినా బీజేపీ మాత్రం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కమల్ గుప్తా వైపే మొగ్గు చూపింది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అప్పటికే అభ్యర్ధిని ప్రకటించడంతో చేసేది లేక హిసార్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా సావిత్రీ జిందాల్ బరిలోకి దిగారు. దీంతో జిందాల్ పోటీ ఎవరికి షాకివ్వబోతోందనే చర్చ జరుగుతోంది.

మరోవైపు ఈ ఎన్నికల్లో సావిత్రీ జిందాల్ గెలిస్తే బీజేపీకే తిరిగి మద్దతివ్వొచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమెను బీజేపీ బీ టీమ్ గా కూడా కాంగ్రెస్ అభివర్ణిస్తోంది. కానీ ఆమె మాత్రం హిసార్ ప్రజల కోరికపై తాను స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్లు చెప్తున్నారు. కానీ ఈ ఎన్నికల్లో హిసార్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధుల నుంచి ఆమెకు గట్టి పోటీ లభిస్తోంది. అయినా ధనవంతురాలు కావడంతో ఈ ఎన్నికల్లో ఆమె గెలిచినా ఆశ్చర్యం లేదు. చివరి నిమిషంలో బీజేపీ ఆమెకు మద్దతివ్వచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో సావిత్రీ జిందాల్ పోటీ, ఆమె ఏ పార్టీకి మద్దతిస్తారన్న చర్చ హర్యానా ఎన్నికల్లో జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications