అవిశ్వాసానికి ఎవరి మద్దతు?: వ్యూహాత్మకంగా టిడిపి
న్యూఢిల్లీ/చిత్తూరు: సీమాంధ్ర కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో వారికి ఎవరెవరు మద్దతిస్తారనే చర్చ సాగుతోంది. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసులు నోటీసును ఇచ్చాయి. తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అధిక ధరలు, అవినీతి అంటూ ప్రస్తావిస్తోంది.
తమ అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టేందుకు అవిశ్వాస నోటీసు ఇచ్చిన వారు ప్రయత్నాలు చేస్తున్నారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలు వివిధ పార్టీ నాయకులను కలుస్తున్నారు. అవిశ్వాసానికి మద్దతివ్వాల్సిందిగా కోరుతున్నారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు కూడా వివిధ పార్టీల మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చేస్తోంది.

సీమాంధ్ర కాంగ్రెసు ఎంపీలు అధిష్టానం బుజ్జగించినప్పటికీ వెనక్కి తగ్గడం లేదు. సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలను కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని, ఇన్నాళ్లు తమను కాదనుకున్నారని, ఇప్పుడు తాము కూడా తెగించి అధిష్టానాన్ని కాదనుకొని అవిశ్వాస తీర్మానం పెట్టామని చెబుతున్నారు.
అవిశ్వాస తీర్మానానికి పలు పార్టీలు మద్దతిచ్చే అవకాశాలున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బిజెడి, అన్నాడిఎంకె, శివసేన, జెడిఎస్ పార్టీల మద్దతు లభించవచ్చునని చెబుతున్నారు. మరోవైపు బిజెపి పార్లమెంటరీ బోర్డు దీనిపై చర్చిస్తోంది.
అవిశ్వాసానికి మద్దతు
ఎవరు అవిశ్వాసం పెట్టినా తాము మద్దతిస్తామని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి చిత్తూరు జిల్లా తిరుపతిలో అన్నారు. ఆయన మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ ఇలా ఖాతరు చేయకపోవడం వల్లనే నాలుగు రాష్ట్రాల్లో తుడిచి పెట్టుకుపోయిందన్నారు. విభజనపై ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతిస్తామన్నారు.












Click it and Unblock the Notifications