విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణా బోర్డును విశాఖలో ఏర్పాటుచేయాలని ఏపీ ప్రభుత్వం ఎందుకు అనుకుంటోంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
శ్రీశైలం

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ మధ్య నదీ జలాల పంపిణీ వ్యవహారాల నిర్వహణకు యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేశారు.

దానికి అనుగుణంగానే కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డులు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి.

తాజాగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విశాఖపట్నానికి తరలించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, ఈ నిర్ణయం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా నదికి సంబంధం లేని ప్రాంతంలో బోర్డు ఏర్పాటు తగదని వాదిస్తున్నారు.

ప్రభుత్వం మాత్రం విశాఖ అన్నింటికీ అనుకూలంగా ఉన్న ప్రాంతమని, వ్యతిరేకత అవసరం లేదని అంటోంది.

మరోవైపు కేఆర్ఎంబీని విశాఖ తరలించేందుకు బోర్డు అంగీకరించింది.

ఏపీ ప్రభుత్వ ప్రతిపాదన మేరకు సుముఖత వ్యక్తం చేస్తూ మెంబర్ సెక్రటరీ మీనా కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాశారు.

విశాఖలో బోర్డు కార్యాలయం ఏర్పాటు కోసం తగిన వసతి ఏర్పాటు చేయగానే తెలియజేస్తామని లేఖలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం వసతి ఏర్పాట్లు చేస్తుందని వివరించారు. కేఆర్ఎంబీకి నిధుల కొరత ఉందని లేఖలో ప్రస్తావించిన మెంబర్ సెక్రటరీ, ఇరు రాష్ట్రాల నుంచి నిర్వహణకు నిధులు కేటాయించలేదని తెలిపారు.

విశాఖలో బోర్డు ఏర్పాటుకి అభ్యంతరం లేదని చెబుతూనే, తరలింపు కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు లేఖలో వివరించారు.

విభజన చట్టంతో మనుగడలోకి కేఆర్ఎంబీ

కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ని 2014లో ఏర్పాటు చేశారు. ఇది కేంద్ర జలవనరుల శాఖ పరిధిలో ఉండే స్వయంప్రతిపత్తి గల సంస్థ.

కృష్ణా బేసిన్‌లో నదీ జలాల నిర్వహణ, నియంత్రణ ఈ బోర్డు చూస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల విషయంలో ఈ బోర్డు పాలనాపరమైన నిర్ణయాలు చేస్తుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో సమస్యలు రాకుండా ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం రెండు బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - 2014 పార్ట్ 9 సెక్షన్ 86 ప్రకారం ఈ రెండు ప్రధాన నదులకు మేనేజ్‌మెంట్ బోర్డులు ఏర్పాటయ్యాయి.

అందులో గోదావరి రివర్ మేనేజ్ మెంట్‌బోర్డ్ కార్యాలయం తెలంగాణలో ఏర్పాటు చేయాలని, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా నిర్వహించాలని నిర్ణయించారు.

అయితే రెండు రాష్ట్రాలకు అప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఉండటంతో, అక్కడే రెండు నదుల మేనేజ్‌మెంట్ బోర్డులను ఏర్పాటు చేశారు.

కేఆర్ఎంబీని ఏపీకి తరలించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా విశాఖలో కేఆర్ఎంబీ కార్యాలయం ఏర్పాటు చేయాలని తాజాగా ప్రతిపాదించింది.

విశాఖపట్నం

తొలుత విజయవాడ.. ఇప్పుడు విశాఖ

కేఆర్ఎంబీని ఏపీలో ఏర్పాటు చేయాలని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వం తొలుత విజయవాడలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేసింది. దానికి అనుగుణంగా కేంద్ర జలవనరుల శాఖకు తమ ప్రతిపాదనలు పంపించింది.

ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది. విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ తన నిర్ణయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖకు నివేదించింది.

దానికి తగ్గట్టుగా కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శికి గత డిసెంబర్ 25న ఏపీ నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ హోదాలో ప్రస్తుత సీఎస్‌గా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. గతంలో విజయవాడ కేంద్రంగా కేఆర్ఎంబీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు హయాంలో ఏపీ ప్రభుత్వం పలుమార్లు కేంద్రాన్ని కోరింది. కానీ, అది ప్రతిపాదనల దశలో ఆగిపోయింది.

వైసీపీ ప్రభుత్వం బోర్డును విజయవాడను కాదని విశాఖలో ఏర్పాటు చేయాలని కోరడం ఇప్పుడు చర్చనీయమవుతోంది.

'విశాఖకి కృష్ణా నదితో సంబంధం ఏంటి?’

కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు విశాఖలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరడం సరికాదని కొల్లి నాగేశ్వర రావు అధ్యయన కేంద్రం సమన్వయకర్త టి.లక్ష్మీనారాయణ అంటున్నారు.

విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని ఆయన చెప్పారు.

''కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోనే బోర్డు కార్యాలయాన్ని విధిగా ఏర్పాటు చేయాలి. విశాఖపట్నానికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయడంలో కుట్ర దాగి ఉందనే సందేహాలు వస్తున్నాయి.

అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించాలనే చట్టాల చెల్లుబాటుపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖకు తరలించే ప్రతిపాదన చేయడం ద్వారా ప్రజలను మభ్యపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’’ అని లక్ష్మీనారాయణ అన్నారు.

''కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో బోర్డు కార్యాలయాన్ని నెలకొల్పితే బోర్డు తన బాధ్యతలు సజావుగా నిర్వహించడానికి సౌలభ్యంగా ఉంటుంది.

కృష్ణా నదిపై ఆధారపడిన కరవు పీడిత రాయలసీమ ప్రాంతం, ప్రకాశం జిల్లా నీటి అవసరాలు తీర్చడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం.

కృష్ణా నది, దాని ఉపనది తుంగభద్రపై రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, జలాశయాలను పరిగణలోకి తీసుకొని కర్నూలులో బోర్డు కార్యాలయాన్ని నెలకొల్పడం సముచితం’’ అని ఆయన అన్నారు.

ప్రకాశం బ్యారేజ్

'కార్యాచరణకు దిగుతాం’

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని సహజ న్యాయసూత్రాలకు భిన్నంగా రాయలసీమలో కాకుండా ఎలాంటి ప్రాతిపదిక లేని విశాఖలో ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం తగదని రాయలసీమ మేధావుల ఫోరం ప్రతినిధి మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి అంటున్నారు.

కేఆర్ఎంబీని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలంటూ కార్యాచరణకు దిగుతామని ఆయన బీబీసీతో చెప్పారు.''మూడు రాజధానులు ఆలోచనలో భాగంగా సీమకు న్యాయ రాజధాని నిర్ణయం సంతృప్తి కాకపోయినా సీమ ప్రజల మనోభావాలను గౌరవించినందుకు సంతోషించాం.

నీటి ప్రాజెక్టుల విషయంలో కొంత మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మంచి జరగబోతుంది అని ఆశలు నింపుకున్న వేళ సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా కేఆర్ఎంబీని రాయలసీమలో కాకుండా విశాఖలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధపడటం ఆందోళన కలిగిస్తోంది.

ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాయలసీమకు తగిన న్యాయం జరుగుతుందన్న భరోసా సీమ ప్రజలకు లేకపోవడం ఇక్కడి ప్రజల దైన్యం. అందుకే రాయలసీమ ప్రజాసంఘాల ప్రతినిధులు కేఆర్ఎంబీ సాధనే ద్యేయంగా సమాలోచన చేస్తాం’’ అని పురుషోత్తంరెడ్డి తెలిపారు.

'కృష్ణా తీరంలోనే ఏర్పాటు చేయాలి’

ప్రస్తుతం కేఆర్ఎంబీ పరిధిలో పలు ప్రాజెక్టులున్నాయి. అందులో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రధానమైనవి.

ఇక ప్రకాశం బ్యారేజ్‌తో పాటుగా కల్వకుర్తి, నెట్టెంపాడు, వెలిగోడు, హంద్రీనీవా, గాలేరు నగరి, పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ వంటివి కూడా శ్రీశైలం జలాశయానికి సమీపంలో ఉన్నాయి.

దాంతో ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కేఆర్ఎంబీని కర్నూలు కేంద్రంగా ఏర్పాటు చేస్తే అటు తుంగభద్ర నదీ జలాల విషయాలతో పాటుగా సుంకేశుల, ఆర్డీఎస్ వంటి అనేక ప్రాజెక్టుల విషయంలో నీటి పంపిణీ సహా అన్నింటినీ ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుందనే వాదన వినిపిస్తోంది.ఆయకట్టు రైతు సంఘాలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాయి.

''కృష్ణా ఆయకట్టు పరిధిలో బోర్డు ఉంటే ప్రయోజనాలు ఎక్కువ. ప్రభుత్వం కృష్ణా నదికి 400 కి.మీ.ల దూరంలో ఉన్న విశాఖలో ఏర్పాటు చేసినా ఒక్కటే, ప్రస్తుతం ఉన్నట్టుగా హైదరాబాద్ లో కొనసాగించినా ఒక్కటే.

ప్రభుత్వం పునరాలోచన చేయాలి. రైతులు, రైతు సంఘాల తరుపున కేంద్రాన్ని కోరుతున్నాం’’ అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు బీబీసీతో అన్నారు.

విశాఖపట్నం

'పాలనాపరమైన సౌలభ్యం కోసమే’

పాలనాపరమైన నిర్ణయాలకు మాత్రమే కేఆర్ఎంబీ పరిమితమని, క్షేత్రస్థాయి పరిస్థితులతో దానికి సంబంధం లేదని ఏపీ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌ నారాయణ రెడ్డి బీబీసీతో అన్నారు.

విశాఖలో కేఆర్ఎంబీ కార్యాలయం ఏర్పాటు వెనుక నిర్వహణకు అనుకూలత ఉండటమే కారణమని ఆయన అంటున్నారు.

''విశాఖలో పలు జాతీయ సంస్థలున్నాయి. రవాణా సదుపాయాలు కూడా అనుకూలం. ఏపీలోని మిగిలిన నగరాలతో పోలిస్తే విశాఖకు అదనపు సదుపాయాలున్నాయి. సీడబ్ల్యూసీ సహా కీలక అధికారులు రావడానికి, వెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. ఇతర అధికారులతో అవసరమైన సమాచారం తీసుకోవడానికి కూడా విశాఖ ఉపయోగం. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే విశాఖలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరివాహక ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు లేవు. కేఆర్ఎంబీని విశాఖలో ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలకు పరిష్కారం వస్తుంది’’ అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why does the AP government want to set up a Krishna Board in Visakhapatnam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X