పిలిస్తే వెళతా, బాధ్యత నిర్వర్తిస్తా: మోడీ భార్య యశోద
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: భావి భారత ప్రధాని నరేంద్ర మోడీ భార్య యశోదాబెన్ శుక్రవారం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భర్త పిలిస్తే తప్పకుండా ఆయన వద్దకు వెళ్తానని.. సహధర్మచారిణిగా తన బాధ్యతను నిర్వర్తిస్తానని మోడీ భార్య యశోదాబెన్ అన్నారు. గుజరాత్‌లోని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించారు. మోడీ ప్రధాని అవుతున్నారంటే యావత్ భారతదేశం మహాదానంద పడిపోతుంటే.. తాను వ్యక్తిగతంగా అనిర్వచనీయమైన సంతోషాన్ని పొందుతున్నానని ఆమె తెలిపారు.
తనను కనుక ఆహ్వానిస్తే.. భర్త ప్రమాణ స్వీకారోత్సవానికి తప్పకుండా హాజరవుతానని యశోదాబెన్ తెలిపారు. ఇటీవలి లోకసభ ఎన్నికల్లో మోడీ విజయం కోసం మీరేమైనా మొక్కుకున్నారా? అని ప్రశ్నించగా.. అది వ్యక్తిగత విషయమని, వెల్లడించలేనని చెప్పారు. భర్త నుంచి ఇంతకాలం దూరంగా ఉండటం గురించి ఆమె మాట్లాడుతూ.. మోడీ మొదట్నుంచీ కూడా దేశానికి సేవ చేయాలనే ఆలోచనలోనే ఉండేవారని చెప్పారు. అందుకే, ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా కాదనుకున్నారని యశోదాబెన్ తెలిపారు.
ఒక్కమాటలో చెప్పాలంటే తన భర్తకు దేశసేవ తప్ప మరో యోచన ఉండదని చెప్పారు. చాలా కాలం తర్వాత 1987లో ఒకే ఒకసారి ఆయనను కలుసుకున్నట్లు ఆమె తెలిపారు. తామిద్దరం విడివిడిగా జీవిస్తున్నామే తప్ప.. విడాకులు తీసుకోలేదని యశోదాబెన్ చెప్పారు. వడోదరా లోకసభ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసేటప్పుడు ఆ పత్రాల్లో భార్యగా తన పేరును పేర్కోనడం గురించి తెలిసి చెప్పలేనంత ఉద్వేగానికి గురైనట్లు చెప్పారు. ఆయన తన నుంచి వేరుగా జీవిస్తున్నప్పటికీ తనను మాత్రం చదువుకునేలా ఎంతగానో ప్రోత్సహించారని వెల్లడించారు.

వివాహానంతరం తామిద్దరం కలిసి ఉన్నది చాలా స్వల్ప కాలమేనని చెప్పిన యశోదాబెన్.. ఆ కొద్ది రోజుల సహచర్యంలోనూ ఆయన తనను ఎంతో బాగా చూసేవారని చెప్పారు. ఆయన భార్యనైనందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని ఆమె ఉద్వేగంగా అన్నారు. మోడీ ప్రధాని అవుతారని ఎప్పుడైనా అనుకున్నారా? అన్న ప్రశ్నకు సమాధానంగా.. 2002 తర్వాత ఆయన ప్రజల కోసం మంచి పనులు చాలా చేశారని చెప్పారు. అప్పుడే ఆయన చాలా సాహసి అని తెలుసుకున్నట్లు తెలిపారు.
మోడీ కష్టజీవి అని చెప్పిన ఆమె.. ఈ విజయాలన్నీ కూడా ఆయన శ్రమకు నిదర్శనాలు అన్నారు. ఓ ప్రధాని భార్యగా తనకు ఎస్‌పిజి భద్రత కల్పిస్తే.. తనకెలాంటి అభ్యంతరమూ లేదని చెప్పారు. మోడీ మరింతగా దినదినాభివృద్ధి చెందాలనీ.. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనీ భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నట్లు ఇంటర్వ్యూలో యశోదాబెన్ తెలిపారు.












Click it and Unblock the Notifications