ఎల్ నినో తర్వాత లా నినా వస్తుందా? వాతావరణంలో మరో కీలక పరిణామం!
ప్రపంచ వాతావరణ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే అత్యంత కీలకమైన ప్రక్రియల్లో ఎల్ నినో, లా నినా కీలకమైనవి. పసిఫిక్ మహాసముద్రంలో సంభవించే ఈ సహజసిద్ధమైన మార్పులను సంయుక్తంగా 'ఎల్ నినో-సదరన్ ఆసిలేషన్' అని పిలుస్తారు. సాధారణంగా ఇవి ఒకదాని తర్వాత ఒకటి మారుతూ వస్తుంటాయి. అయితే తీవ్రమైన 'ఎల్ నినో' పరిస్థితుల తర్వాత వెంటనే 'లా నినా' వస్తుందా? రాబోయే రోజుల్లో ప్రపంచ మార్పులు ఎలా ఉండబోతున్నాయి? అనే అంశంపై ప్రతిష్టాత్మక వాతావరణ సంస్థలు తమ విశ్లేషణలను వెలువరించాయి.
ఎల్ నినో వర్సెస్ లా నినా.. అసలేంటి తేడా?
స్పానిష్ భాషలో 'ఎల్ నినో' అంటే చిన్న బాబు అని.. 'లా నినా' అంటే చిన్న పాప అని అర్థం. ఇవి పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల ఆధారంగా ఏర్పడినప్పటికీ.. వీటి ప్రభావం మాత్రం భూగోళం అంతటా స్పష్టంగా కనిపిస్తుంది.
ఎల్ నినో(వెచ్చని దశ): పసిఫిక్ మహాసముద్రంలో సాధారణంగా వీచే వాణిజ్య పవనాలు బలహీనపడటం వల్ల వేడి నీరు తూర్పు, మధ్య పసిఫిక్ వైపు ప్రవహిస్తుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు, మరికొన్ని చోట్ల తీవ్ర కరువు పరిస్థితులు నెలకొంటాయి.

లా నినా(చల్లని దశ): దీనికి వేరొక కోణంలో వాణిజ్య పవనాలు అత్యంత బలంగా వీస్తాయి. వేడి నీటిని ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల వైపు నెట్టివేయడంతో దక్షిణ అమెరికా తీరం వెంబడి చల్లని నీరు పైకి వస్తుంది. దీని వల్ల ఇండియా, ఆసియా ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి.
ఎల్ నినో ముగియగానే లా నినా వస్తుందా?
వరల్డ్ మెటియోరోలాజికల్ ఆర్గనైజేషన్(డబ్ల్యూఎంవో), అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానికి అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ నివేదికల ప్రకారం.. ఎల్ నినో ముగిసిన వెంటనే లా నినా రావడం ప్రతిసారీ తప్పనిసరేమీ కాదు. ఎల్ నినో బలహీనపడిన తర్వాత సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు వరుసగా రెండేళ్ల పాటు ఎల్ నినో లేదా లా నినా దశలే కొనసాగే అరుదైన పరిస్థితులు కూడా ఉంటాయి.
ప్రస్తుతం సంభవించిన ఎల్ నినో ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టిన తర్వాత వాతావరణం మొదట తటస్థ స్థితికి చేరే అవకాశం ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో రాబోయే నెలల్లో చోటుచేసుకునే ఉష్ణోగ్రత మార్పులను నిశితంగా పరిశీలించిన అనంతరమే లా నినా సంభవించే అవకాశాలపై స్పష్టమైన దృశ్యం ఏర్పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.














Click it and Unblock the Notifications
