అవిశ్వాసం: మమతా నో, నవీన్ పట్నాయక్ సై

మమతా బెనర్జీ పార్లమెంటులో బిజెపి నేతలు రాజ్‌నాథ్ సింగ్, అద్వానీలను, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఆమెను కలిసి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనను తాను వ్యతిరేకిస్తున్నప్పటికీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వలేనని మమతా బెనర్జీ వారితో చెప్పినట్లు సమాచారం.
అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చి, ఓటింగ్ జరిగినా బిఎస్పీ, ఎస్పీ ప్రభుత్వాన్ని కాపాడుతాయని ఆమె అన్నట్లు తెలుస్తోంది. యుపిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఇప్పటికే అవిశ్వాసం ప్రకటించారని, అందువల్ల ప్రత్యేకంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాల్సిన అవసరం లేదని మమతా బెనర్జీ అంతకు ముందు చెప్పారు. తాము బిజెపిని గానీ కాంగ్రెసును గానీ బలపరచబోమని, తమ పార్టీ ఒంటరిగానే సాగగుతుందని ఆమె చెప్పారు.
కాగా, సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల అవిశ్వాసానికి నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్ (బిజెడి) మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. తాము అవిశ్వాసానికి మద్దతు ఇస్తామని బిజెడి పార్లమెంటు సభ్యుడు జయపాండా చెప్పారు. ఈ పార్టీకి లోకసభలో 14 మంది సభ్యులున్నారు.
సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు వివిధ పార్టీల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. తమకు కావాల్సిన సంఖ్యాబలాన్ని సమీకరించే ప్రయత్నంలో తాము ఉన్నట్లు కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యుల మద్దతు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల ఎంపిల మద్దతు కూడా తమకు లభిస్తుందని ఆయన అన్నారు.
తాము ఇతర సీమాంధ్ర పార్లమెంటు సభ్యులతో మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు. అవిశ్వాసాన్ని బలపరచకపోతే దాని పరిణామాలను సీమాంధ్ర ఎంపీలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తమ ఆరుగురికి తోడు మరింత మంది సీమాంధ్ర ఎంపీలు వస్తారని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఆపడానికి సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు అనైతిక చర్యకు పాల్పడుతున్నారని తెలంగాణ కాంగ్రెసు నాయకులు విమర్శిస్తున్నారు. తాము అన్ని పార్టీల నాయకులతో మాట్లాడామని, వారంతా అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నారని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు.












Click it and Unblock the Notifications