కేజ్రీవాల్‌పై తీవ్రమైన ఆరోపణలు, వ్యక్తిగతంగా పరిశీలిస్తా: సీఎం చన్నీకి హోంమంత్రి అమిత్ షా హామి
న్యూఢిల్లీ: ఖలిస్థాన్ అనుకూల సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్(SFJ)తో అరవింద్ కేజ్రీవాల నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధాలపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి రాసిన లేఖలో "వ్యక్తిగతంగా పరిశీలిస్తానని" హామీ ఇచ్చారు. నిషేధిత సంస్థతో ఆప్ సంబంధాలు కలిగి ఉందని పంజాబ్ సీఎం చన్నీ.. అమిత్ షాకు లేఖ రాసిన నేపథ్యంలో ఈ లేఖ వచ్చింది.

కేజ్రీవాల్‌పై వచ్చిన ఆరోపణలు: అమిత్ షా సీరియస్
పంజాబ్ ఎన్నికల ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్ వేర్పాటువాదులకు మద్దతిస్తున్నారని ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని చన్నీ.. ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. హోంమంత్రి అమిత్ షా పంజాబ్ సీఎంకు రాసిన లేఖలో భారత ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుందని, ఈ విషయాన్ని తాను వ్యక్తిగతంగా వివరంగా పరిశీలిస్తున్నట్లు హామీ ఇచ్చారు. భారత ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటోందని, ఈ విషయాన్ని నేను వ్యక్తిగతంగా లోతుగా పరిశీలిస్తానని చన్నీళ్లకు రాసిన లేఖలో అమిత్ షా పేర్కొన్నారు.
వేర్పాటువాదులతో జట్టుకడతారా? తీవ్రమైన విషయం: అమిత్ షా
"మీ లేఖ ప్రకారం, ఎన్నికల సమయంలో ఒక రాజకీయ పార్టీ దేశ వ్యతిరేక, వేర్పాటువాద, నిషేధిత సంస్థతో సంప్రదింపులు జరపడం, మద్దతు కోరడం జాతీయ భద్రత విషయంలో తీవ్రమైన విషయం" అని హోం మంత్రి అమిత్ షా అన్నారు. 'అలాంటి వారి ఎజెండా దేశ శత్రువుల ఎజెండాకు భిన్నమైనది కాదు. అధికారం కోసం కొందరు వ్యక్తులు వేర్పాటువాదులతో జట్టుకట్టడం, పంజాబ్, దేశ ఐక్యతను దెబ్బతీసే స్థాయికి వెళ్లడం ఖండించదగినది. "అని లేఖలో పేర్కొన్నారు అమిత్ షా.

ఖలిస్థాన్‌కు ప్రధాని అవుతానన్నారు: కేజ్రీవాల్‌పై కుమార్ విశ్వాస్
2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ వేర్పాటువాద అంశాలకు పాల్పడ్డారని ఈ వారం ప్రారంభంలో విశ్వాస్ ఆరోపించిన వీడియో వైరల్ అయింది.
"ఒకరోజు, ఆయన (కేజ్రీవాల్) నాకు తాను (పంజాబ్) ముఖ్యమంత్రి అవుతానని లేదా స్వతంత్ర దేశానికి (ఖలిస్థాన్) మొదటి ప్రధాని అవుతానని చెప్పాడు.. అతను ఎలాగైనా అధికారం కోరుకుంటున్నాడు," అని విశ్వాస్ వీడియోలో చెప్పారు.

తాను తీపి ఉగ్రవాదినంటూ అరవింద్ కేజ్రీవాల్
ఆరోపణల తర్వాత, కేజ్రీవాల్‌పై కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శల దాడి చేశారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శుక్రవారం స్పందిస్తూ.. ఆస్పత్రులను నిర్మించే ప్రపంచంలోని "తీపి టెర్రరిస్ట్"ని అని అన్నారు.
"ఈ అవినీతిపరులందరూ నన్ను ఉగ్రవాది అని పిలుస్తున్నారు. పాఠశాలలు, ఆస్పత్రులు, విద్యుత్ సమస్యలను పరిష్కరించే ప్రపంచంలోనే మొదటి ఉగ్రవాదిని నేనే. ప్రపంచంలోనే తొలి 'తీపి' ఉగ్రవాదిని నేనే" అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
"బ్రిటీష్ వారికి భగత్ సింగ్ అంటే భయం. అందుకే అతన్ని టెర్రరిస్టు అని పిలిచేవారు. నేను భగత్ సింగ్ శిష్యుడిని" అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. పంజాబ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications