కేజ్రివాల్ ధర్నా: అక్కడే ఫైళ్ల తనిఖీ, భారీగా పోలీసులు
న్యూఢిల్లీ: తమ మంత్రి ఆదేశాలను పక్కన పెట్టిన ఢిల్లీ పోలీసులపై చర్యలు చేపట్టని కేంద్ర హోంమంత్రిత్వ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, అతని ఆరుగురు మంత్రుల బృందంతోపాటు కార్యకర్తలతో కలిసి భారీ ధర్నా నిర్వహించారు. ధర్నా నేపథ్యంలో తమ ప్రభుత్వ కార్యకలాపాలకు ఎలాంటి భంగం కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ ఫైళ్లను ధర్నా చేస్తున్న రైల్ భవన్ వద్దకే తెప్పించుకున్న కేజ్రివాల్, మంత్రులు వాటిని అక్కడే పరిశీలించారు.
తమ మంత్రి ఆదేశాలను పాటించని ముగ్గురు పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణ అనంతరం పోలీసులపై చర్య తీసుకుంటామన్నకేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యల్ని కేజ్రివాల్ తోసిపుచ్చారు. ధర్నాను జంతర్ మంతర్ వద్దకు మార్చుకోవాలని పోలీసులు కోరగా.. అందుకు అరవింద్ కేజ్రివాల్ నిరాకరించారు.

కేంద్ర హోంమంత్రిత్వశాఖ నియంత్రణలో ఉన్న ఢిల్లీ పోలీసు బలగాలను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని కేజ్రివాల్ ఈ సందర్భంగా కోరారు. అసమర్థ పోలీసు బలగాలతో ఢిల్లీ ప్రజలు విసిగిపోయారని ఆమ్ ఆద్మీ మంత్రి యోగేంద్ర యాదవ్ తెలిపారు. గత వారం ఆప్ న్యాయమంత్రి సోమ్నాథ్ భారతి ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని, మత్తు పదార్థాలు ఉన్నాయని, దాని దాడి చేయాలని పోలీసులను ఆదేశించారు. అయితే ఢిల్లీ పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆప్ సోమవారం రైల్ భవన్ వద్ద భారీ ధర్నా చేపట్టింది. అక్కడికి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. ఇది ఇలా ఉండగా.. ఆప్ ధర్నా ఆ పార్టీ అసహనాన్ని, మానసిక పరిణతి లోపించడాన్ని ప్రతిబింబిస్తోందని సామాజిక కార్యకర్త కిరణ్ బేడీ అన్నారు. ముఖ్యమంత్రి కేజ్రివాల్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసిన ఒక మంత్రిని రక్షించడానికి ధర్నా చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అర్విందర్ సింగ్ లవ్లీ అన్నారు.
మరోవైపు కొందరు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూడా కేజ్రివాల్ ధర్నా చేయడాన్నివ్యతిరేకిస్తున్నారు. ఆప్ ఎమ్మెల్యే వినోద్ బిన్నీ ఇప్పటికే కేజ్రివాల్‌పై విమర్శలు సంధించగా.. మరో ఎమ్మెల్యే టినా శర్మ కూడా ఆయన వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. కేజ్రివాల్ ధర్నా చేయడాన్ని టినా వ్యతిరేకించారు. ముందుగా కేజ్రివాల్ మహిళలపై భద్రతపై తమ విధానాన్ని చెప్పాలని నిలదీశారు. మహిళల రక్షణ కోసం తీసుకోబోయే చర్యలను ప్రకటించిన తర్వాతే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవ్వాలని అన్నారు. లేదంటే కేజ్రివాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతానని తెలిపారు.












Click it and Unblock the Notifications