రెండేళ్లుగా పోర్నోగ్రఫీకి బానిసైన భర్త: సంసారం కూలిపోతోందని కోర్టుకెక్కిన భార్య
విద్యావంతుడైన తన భర్తే ఇంతలా పోర్నోగ్రఫీకి వ్యసనపరుడిలా తయారైతే.. ఇక యువతరం సంగతేంటని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ఆమె పేర్కొంది.
న్యూఢిల్లీ: ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం మొత్తం అరచేతిలో ఇమిడిపోయేలా తయారైంది. అదే సమయంలో 'పోర్న్' మార్కెట్ శక్తులు తమ మార్కెట్ పరిధిని మరింత విస్తరించుకున్నాయి.
చిన్నా-పెద్దా అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్కరి బుర్రలో తమకంటూ ఓ స్పేస్ క్రియేట్ చేసుకుని.. వారిచేత సీక్రెట్ పోర్న్ వీక్షించేలా చేస్తున్నాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే 30ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఓ పెద్దమనిషి పోర్నోగ్రఫీకి బానిసయ్యాడని అతని భార్య ఏకంగా కోర్టుకెక్కి మొరపెట్టుకుంది.

సదరు భర్త అస్తమానం పోర్నోగ్రఫీ వీక్షణతోనే కాలం గడిపేస్తుండటంతో తన సంసారం కూలిపోయే పరిస్థితి వచ్చిందని ఆమె ఆవేదన చెందింది. ఎదిగిన పిల్లలు, తాను ఆయన తీరు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా తెలిపింది. అశ్లీల సైట్ల నిషేధానికి ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
విద్యావంతుడైన తన భర్తే ఇంతలా పోర్నోగ్రఫీకి వ్యసనపరుడిలా తయారైతే.. ఇక యువతరం సంగతేంటని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ఆమె పేర్కొంది. తమకు పెళ్లయి 30ఏళ్లు అయిందని, ఇన్నాళ్లు సాఫీగానే తమ సంసారంలో రెండేళ్ల నుంచి పోర్నోగ్రఫీ చిచ్చు పెట్టిందని ఆమె చెబుతోంది.
ఓ సామాజిక కార్యకర్తగా ఇలాంటివి తాను చాలానే చూస్తూ వస్తున్నానని, అందువల్ల పోర్నోగ్రఫీ సైట్లను నిషేధించడానికి సుప్రీం కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గతంలో సుప్రీంకోర్టు పిల్లల పోర్నోగ్రఫీకి సంబంధించిన సైట్లను నిరోధించాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించినా అమలు కాలేదని మహిళ తెలిపారు.












Click it and Unblock the Notifications