బెంగుళూర్ రేప్ : తప్పించుకున్నా.. మళ్లీ పట్టుకుని మరీ..
బెంగుళూర్ : ఎలక్ట్రానిక్ సిటీ బెంగుళూరులో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. దీనికి పార్టీ కల్చర్ ప్రభావం కూడా ఒక కారణం అనుకోవచ్చు. కాగా.. 24 ఏళ్ల సోనమ్ అనే మహిళపై ముగ్గురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తాజాగా చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా బ్యూటీషియన్ గా పనిచేసే ఓ బూటాన్ యువతిపై ముగ్గురు యువకులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. గత ఆరు నెలలుగా బెంగుళూరులో నివసిస్తున్న సోనమ్ ఆదివారం రాత్రి ఒక పుట్టినరోజు వేడుకకు హాజరైంది. అదే పుట్టినరోజుకు హాజరైన నిందితుడు సోనమ్ ను పొగ తాగడం కోసం ఆహ్వనించాడు. సోనమ్ కూడా మరో ఆలోచన లేకుండా ఆ నిందితుడితో కలిసి అతని అపార్ట్ మెంట్ కి చేరుకుంది.
అయితే.. సోనమ్ అపార్ట్ మెంట్ వద్దకు చేరుకునే సరికే మరో ఇద్దరు యువకులు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత సోనమ్ ను ఆల్కాహాల్ సేవించాల్సిందిగా తనపై ఒత్తిడి తీసుకొచ్చారు నిందితులు ఖదీమ్, బాబు, ముక్తియర్. సోనమ్ ఆల్కాహాల్ సేవించిందో లేదో తెలియరాలేదు గానీ తర్వాత ఆమెపై ముగ్గురు అత్యాచార యత్నానికి ప్రయత్నించారు.

నిందితుడితో కలిసి అపార్ట్ మెంట్ కు వెళ్లేముందు సోనమ్ తన బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడింది. తర్వాత చాలాసేపటి వరకు ఫోన్ రాకపోవడంతో, అనుమానించిన సదరు బాయ్ ఫ్రెండ్ తిరిగి ఆమెకు కాల్ చేయడం మొదలుపెట్టాడు. అయితే ఆ సమయంలో ముగ్గురు నిందితులు సోనమ్ ని వేధింపులకు గురిచేస్తుండడంతో కాల్ లిఫ్ట్ చేయలేకపోయింది.
అయితే.. ఎలాగోలా ఆ ముగ్గురు నిందితుల నుంచి తప్పించుకుని సోనమ్ అపార్ట్ మెంట్ బయటకు పరుగులు పెట్టింది. దారిలో కనిపించిన ఓ వ్యక్తితో తనను కాపాడవలసిందిగా కోరింది. కానీ, సోనమ్ భాష సదరు వ్యక్తికి అర్థం కాకపోవడంతో, వెనకాలే పరుగెత్తుకొచ్చిన నిందితులకే తిరిగి ఆమెను అప్పజెప్పాడు. మళ్లీ అపార్ట్ మెంట్ కు తీసుకెళ్లి ఆమెపై రేప్ కు యత్నించగా, మళ్లీ తప్పించుకున్న యువతి ఈసారి ఓ దంపతుల ఇంట్లోకి పరిగెత్తుకెళ్లి జరిగిన విషయం చెప్పింది.
దీంతో ఆ దంపతులు పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చే సమయానికి అక్కడి నుంచి పారిపోవడానికి యత్నిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముగ్గురు నిందితులు బెంగుళూరులోని ఓ స్నాక్ పార్లర్ లో పనిచేసేవారిగా సమాచారం. నిందితులంతా 20 ఏళ్ల లోపు వారే కాగా వీరి స్వస్థలం అస్సాంలోని కరీంగంజ్ గా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది.
నిందితుల మీద 367D కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఘటనపై స్పందించిన బాధిత యువతి సోనమ్ తనపై అత్యాచారం జరగలేదని.. కానీ అత్యాచారం చేయడానికి యత్నించారని తెలిపింది. టెక్నికల్ గా సోనమ్ పై అత్యాచారం జరగపోయినా రేప్ కిందనే కేసు బుక్ చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications