నవరాత్రి, కన్య పూజల పేరుతో అమ్మాయిలను ఏం చేశారంటే ?, సీసీటీవీల్లో షాక్ !
భోపాల్/మధ్యప్రదేశ్: నవరాత్రి పండుగ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో పిల్లలకు కన్యా పూజ నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల కోసం ఆలయానికి వచ్చిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను కన్యాపూజ నెపంతో అపహరించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో చోటుచేసుకుంది. మాతా మందిర్ ఆవరణలో ఇద్దరు చిన్నారులు అపహరణకు గురయ్యారు. 8 ఏళ్లు బాలిక, 18 నెలల ఉన్న బాలిక అపహరణ భోపాల్ నగరంలో కలకలం రేపింది. కిడ్నాప్ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినా నిందితుల ఆచూకీ లభించలేదు. పిల్లల కోసం తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని రత్లాం జిల్లాకు చెందిన లక్ష్మి, ముఖేష్ దంపతుల ఇద్దరు పిల్లలు కిడ్నాప్‌కు గురయ్యారని పోలీసు అధికారులు తెలిపారు. నెల రోజుల క్రితం ముఖేష్, లక్ష్మీల కుటుంబం రత్లాం జిల్లా నుంచి భోపాల్‌కు వచ్చారు. కూలీగా పని చేస్తున్న ముఖేష్ అతని కుటుంబాన్ని పోషిస్తున్నారు.

నవరాత్రి (navratri) ఉత్సవాల కారణంగా ఆలయంలో ప్రసాదాల పంపిణి చేస్తున్నారు. ఇలా ఇద్దరు చిన్నారులు గత వారం రోజులుగా ప్రసాదం స్వీకరించేందుకు ఆలయానికి వెళ్తున్నారు. నిరుపేద కుటుంబం కావడంతో నవరాత్రి పూజ, దేవుడి దర్శనంతో పాటు చిన్నారులు రోజూ గుడికి వెళ్లి ప్రసాదాలు స్వీకరించి కడుపు నింపుకునేవారు. ఈ చిన్నారులను టార్గెట్ చేసిన కిడ్నాపర్లు ఆలయ ప్రాంగణంలో కిడ్నాప్ చేశారు.
కన్యపూజ చేస్తామని ఇద్దరు మహిళలు పిల్లలకు చెప్పారు. కన్యపూజ, మిఠాయిలు, కానుకలు, ఆహారం ఇస్తామని అమ్మాయిలను నమ్మించారు. మిఠాయిలు వస్తాయని ఇద్దరు అమ్మాయిలు తల ఊపి ఆ మహిళలతో వెళ్లిపోయారు.
మహిళలు ఇద్దరు అమ్మాయిలను ఎత్తుకుని దేవాలయం సమీపంలో నుంచి ఆటోలో వెళ్లిపోయారు. పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అదే రోజు రాత్రి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ నిర్వాహక మండలి అమ్మాయిల కోసం ఆరా తీశారు.

పాలకమండలి ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగిన భోపాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఆలయానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు చిన్నారులను ఆటోలో కిడ్నాప్ చేశారని వెలుగు చూసింది. ఆలయం పక్కనే ఉన్న రోడ్డుతోపాటు ఇతర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
కానీ పిల్లల గురించి ఎలాంటి ఆధారం చిక్కలేదని, నిందితులు చిన్నారులతో కలిసి ఎక్కడికి వెళ్లారనే సమాచారం లేదని పోలీసులు అంటున్నారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇద్దరు కుమార్తెలు ఓకేసారి కిడ్నాప్ కు గురికావడంతో తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. కేసు విచారణలో ఉంది. అమ్మాయిల కిడ్నాప్ కు అసలు కారణం తెలీకపోవడంతో భోపాల్ ప్రజలు ఉలిక్కిపడ్డారు.












Click it and Unblock the Notifications