ఏనుగుపై ఆసనం వేస్తూ పడిపోయిన రాం దేవ్ బాబా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..
ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌కు ప్రమాదం తప్పింది. ఏనుగు మీద యోగా చేస్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో గల రామ్ నరేటి ఆశ్రమం మహావన్ ఆశ్రమంలో సోమవారం ఈ ఘటన జరిగింది. కానీ ఆలస్యంగా వెలుగుచూసింది. ఆశ్రమానికి వెళ్లిన రాం దేవ్ బాబా.. అక్కడున్న వారికి యోగాసనాలు వేసి చూపించే ప్రయత్నం చేశారు.

సాధారణంగా కాకుండా.. ఏనుగుపై ఎక్కి కూర్చొని పద్మాసనం వేశారు. భ్రమరీ ప్రాణాయామం చేస్తుండగా ఏనుగు ఒక్కసారిగి కదిలింది. దీంతో ఏనుగుపై కూర్చున్న రాం దేవ్ అదుపు తప్పి కిందపడ్డారు. కింద పడ్డ రాందేవ్ బాబాకు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. కానీ కిందపడటంతో ఆయన కొంత అసహనంగా కనిపించారు.
ఇదివరకు కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. సైకిల్ తొక్కుకుంటూ మలుపు వద్ద పడిపోయారు. అప్పట్లో ఆ వీడియో కూడా తెగ వైరల్ అయింది. చాలారోజుల తర్వాత ఏనుగుపై నుంచి పడిన వీడియో ట్రోల్ అవుతోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను ఇప్పటికే 18 వేల 400 మంది వీక్షించారు. వీడియోపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
రాం దేవ్ బాబా.. యోగా గురువు. వివిధ భంగిమల్లో ఆసనాలు వేస్తుంటారు. రకరకాలుగా ఆసనాలు వేస్తూ.. పేరు గడించారు. కానీ ఏనుగుపై చేసిన ఆసనం మాత్రం వికటించింది.












Click it and Unblock the Notifications