షాక్: నాసాలో రూ.1.8 కోట్ల ఉద్యోగమని చెప్పి సన్మానాలు చేయించుకున్నాడు
భోపాల్: తాను నాసాలో పని చేస్తున్నానని, తనది రూ.1.8 కోట్ల ఉద్యోగమని నమ్మించిన ఓ ఇరవై ఏళ్ల యువకుడు మధ్యప్రదేశ్‌లో పలువురితో సన్మానాలు పొందాడు. ఈ సంఘటన తాజాగా వెలుగు చూసింది. అతను అందర్నీ చీట్ చేస్తున్నాడని గుర్తించిన పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేసారు.
తాను నాసాలో పని చేస్తున్నానని చెప్పడమే కాకుండా అందుకు సంబంధించి తప్పుడు ఐడెంటిటీ కార్డును కూడా చూపించేవాడు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతకాన్ని కూడా అతను ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అన్సార్ ఖాన్ అనే యువకుడు ఇంటర్ వరకు చదివాడు. ఇటీవల తనకు నాసాలోని స్పేస్ అండ్ ఫుడ్ ప్రోగ్రామ్‌లో ఉద్యోగం వచ్చిందని ఏడాదికి రూ.1.83 కోట్ల జీతమని, మరో నెలలో ఉద్యోగంలో చేరాలని అందరికీ చెప్పుకున్నాడు. దీంతో తెలిసిన వారంతా అతనికి సన్మానాలు చేయడం ప్రారంభించారు.

అలా ఒక సన్మాన కార్యక్రమానికి జిల్లా ఉన్నతాధికారులను ఆహ్వానించారు. వారితో పాటు కార్యక్రమానికి హాజరైన సీనియర్ పోలీసు అధికారి శశికాంత్ శుక్లాకి అతని మెడలో ఉన్న గుర్తింపు కార్డు, దాని పైన ఉన్న అమెరికా అధ్యక్షుడి సంతకం చూసి అనుమానం వచ్చింది. దీంతో ఈ విషయమై విచారణ జరపాలని అధికారులకు సూచించారు.
విచారణలో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. ఆగస్టు 14న అన్సార్ ఒక ఫొటో స్టూడియోకి వెళ్లి అక్కడే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతకం, నాసా లోగో ముద్రించిన నకిలీ గుర్తింపు కార్డును తీసుకున్నాడు.
అంతేకాదు నాసాలో జీతం రాగానే అప్పు తీరుస్తానని తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. స్థానికంగా ఉన్న సంస్థలు అన్సార్‌కి పలు సన్మాన కార్యక్రమాలు నిర్వహించాయి. అసలు నిజం వెలుగులోకి రావడంతో అతనిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications