ఢిల్లీలో జగన్ అరెస్ట్, కోర్టుకెళ్తానన్న హెచ్చరిక, విడుదల
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం పార్లమెంటుకు కాలి నడకతో ముట్టడికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. జంతర్ మంతర్ వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో ధర్నా జరిగిన విషయం తెలిసిందే. ధర్నాలో మాట్లాడిన జగన్ దానిని ముగిస్తూ... మనకు ఎంత వరకు అనుమతి ఇస్తారో తెలియదు కానీ ఎంత దూరం సాధ్యమైతే అంత దూరం పార్లమెంటుకు అందరం సాగుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
దీంతో పార్టీ శ్రేణులు జంతర్ మంతర్ నుండి పార్లమెంటుకు బయలుదేరారు. జగన్ కాలి నడకన బయలుదేరారు. పార్లమెంటు దిశగా వెళ్తున్న పార్టీ శ్రేణులను పార్లమెంటు వీధి పోలీసు స్టేషన్ ఎదుట పోలీసులు అడ్డుకున్నారు. ఎపిన్జీవోలు, సమైక్యవాదులు, వివిధ పార్టీల నేతలు ఢిల్లీలో ఉండటంతో ముందే పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. పార్టీ క్యాడర్ జై సమైక్యాంధ్ర, జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసింది.

జగన్‌ను, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రేణులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. పార్లమెంటు స్ట్రీట్‌లోని అడిషనల్ డిజిపి కార్యాలయంలో జగన్‌ను ఉంచారు. తన అరెస్టుపై జగన్ తీవ్రంగా స్పందించారు. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అని, తనను అరెస్టు చేయడం అన్యాయమని, అరెస్టుకు నిరసనగా తాను రేపు కోర్టుకు వెళ్తానని చెప్పారు. పోలీసు స్టేషన్ ఎదుట పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం జగన్‌ను విడుదల చేశారు.
అంతకుముందు వైయస్ జగన్ ధర్నాలో మాట్లాడుతూ.. కలిసి ఉండగానే రాష్ట్రంలో ఇంత నీటి సమస్య ఉంటే విడిపతో ఇంకెన్ని ఇబ్బందులు వస్తాయని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోతే దిగువన ఉన్న ఎపికి మరింత నష్టం జరుగుతుందన్నారు. ఇంత అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదన్నారు. ఉభయ ప్రాంతాల అంగీకారం లేకుండా ఇదివరకు రాష్ట్రాల విభజన జరగలదేన్నారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెసు పార్టీ ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్రం విడిపోయాక సీమాంధ్రులు హైదరాబాదులో ఉండవచ్చునని చెబుతున్నారని కానీ మహారాష్ట్రలో ఎంఎన్ఎస్, కర్నాటకలో కన్నడిగుల పార్టీ, తమిళనాడులో ద్రవిడ పార్టీలో ఎందుకున్నాయన్నారు. కొంతకాలం తర్వాత హైదరాబాదులో తెలంగాణవారికే ఉద్యోగాలు అంటే తాము ఎక్కడకు వెళ్లాలన్నారు.
చంద్రబాబు, కిరణ్, సోనియా గాంధీలు ఎపి రిజిస్ట్రేషన్ కారు పైన చెన్నై వెళ్తే వారికి తెలుస్తుందన్నారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ ప్రాంతం కూడా నష్టపోతుందన్నారు. సీమాంధ్రులు ఉద్యోగాలు లేక ఎక్కడకు వెళ్లాలన్నారు. అందరం ఒక్కటై రాష్ట్రాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన ఎలా చేస్తారని, అన్ని జాతీయ పార్టీల పైన సమైక్యాంధ్ర కోసం ఒత్తిడి తెద్దామన్నారు.












Click it and Unblock the Notifications