ప్రశంసలు: తల్లికి పురుడుపోసిన 11ఏళ్ల బాలుడు
వాషింగ్టన్: ఓ 11ఏళ్ల బాలుడు తన వయస్సుకు మించిన పని చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇంతకూ అతని చేసిన పనెంటో తెలుసా?.. తన తల్లికి పురుడుపోయడమే. ఈ అరుదైన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. జార్జియాలోని మరియెట్టా ప్రాంతానికి చెందిన కెన్యార్డా నిండు గర్భిణి. వారం రోజుల క్రితం ఆమెకు అనుకున్న సమయం కన్నా ముందే నొప్పులు ప్రారంభమయ్యాయి.
అప్పుడు ఇంట్లో ఆమెతో పాటు తన 11 ఏళ్ల కుమారుడు జేమ్స్ డ్యూక్స్ మాత్రమే ఉన్నాడు. అయితే తల్లి పరిస్థితి చూసిన డ్యూక్స్ ఏమాత్రం కంగారు పడకుండా ఆమెకు సహాయం చేయడానికి సిద్ధమయ్యాడు.

అత్యవసర విభాగం 911కి ఫోన్ చేసి అక్కడి ఎమర్జన్సీ ఆపరేటర్ సూచనల మేరకు చకచకా చేయాల్సిన పనులు చేశాడు. తల్లి, పుట్టబోయే బిడ్డ క్షేమంగా ఉండాలని మనసులో అనుకుంటూనే ఆమె ప్రసవానికి సహకరించాడు. దీంతో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
పుట్టిన బాబుని శుభ్రం చేయడం, వైద్య బృందం వచ్చేవరకు వెచ్చగా ఉండేలా ఏర్పాటు చేయడం... అన్నీ డ్యూక్స్ చూసుకున్నాడు. ప్రస్తుతం జేమ్స్ తల్లీ, అతని చిట్టి సోదరుడు క్షేమంగా ఉన్నారు.
కాగా, విషయం తెలుసుకున్న వారంతా జేమ్స్‌ని ప్రశంసింశలతో ముంచెత్తారు. తన కుమారుడే తన పాలిట వైద్యుడు అని, సూపర్ హీరో అంటూ కెన్యార్డా ఆనందం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications