తొలిరోజు భారీగా ప్రాణనష్టం: ఉక్రెయిన్: అంతుచిక్కని పుతిన్ స్ట్రాటజీ: రష్యాలో నిరసనలు..అరెస్టులు
కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఊహించినట్టే యుద్ధం ఆరంభమైంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దూకుడు చూస్తోంటే ఉక్రెయిన్‌ను తన దారికి తెచ్చుకునేంత వరకూ యుద్ధాన్ని కొనసాగించేలా ఉన్నారు. ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యం తనకు లేదంటూ తొలి రోజే ఆయన స్పష్టం చేయడంతో- సైనిక చర్యకు ఎందుకు పాల్పడాల్సి వచ్చిందనే విషయాన్ని స్పష్టం చేసినట్టయింది.
Recommended Video

తొలి రోజు ఆధిపత్యం..
తొలి రోజు- ఉక్రెయిన్‌పై రష్యా ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్టేననే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఉక్రెయిన్‌కు చెందిన కొన్ని కీలక పట్టణాలు రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయాయి. రష్యా సైనికులు వాటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోర్ట్ సిటీ ఒడెస్సాను తొలి రోజు- యుద్ధం ఆరంభంలోనే రష్యా సైనికులు తమ వశం చేసుకున్నారు. రాజధాని కీవ్‌పైనా ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఉక్రెయిన్ సైన్యానికి చెంది పలు ప్రాంతాలను ఆక్రమించుకున్నారు.

74 టార్గెట్ల ఛేదన..
ఉక్రెయిన్ సైన్యానికి చెందిన 74 టార్గెట్లను ఛేదించినట్లు రష్యా ప్రకటించింది. ఇందులో ఆ దేశానికి చెందిన 11 ఎయిర్‌ఫీల్డ్స్, 18 రాడార్ స్టేషన్లు, మూడు కమాండ్ పోస్టులు ఉన్నట్లు వెల్లడించింది. వాటన్నింటినీ ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కొనషెన్కోవ్ తెలిపారు. ఎస్-300, బీయూకే-ఎం1 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ వ్యవస్థను ధ్వంసం చేసినట్లు చెప్పారు. పలు మిలటరీ హెలికాప్టర్లు, నాలుగు డ్రోన్లను నేలకూల్చామని అన్నారు.

137 మంది మృతి..
మరోవంక- తొలి రోజు యుద్ధంలో 137 మంది మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. వారిందరినీ హీరోలుగా ఆయన అభివర్ణించారు. అమరవీరులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. రష్యా సైనికుల సంధించిన మిస్సైళ్లు, వైమానిక దాడుల్లో పలువురు సాధారణ పౌరులు కూడా మృతి చెందారని వొలొదిమిర్ చెప్పారు. 316 మంది గాయపడ్డారని అన్నారు. వారికి నాణ్యమైన చికిత్సను అందిస్తున్నామని, మిలటరీ ఆసుపత్రులకు తరలించామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

రష్యాలో వ్యతిరేకత..
మరోవంక- ఈ యుద్ధం పట్ల రష్యాలో వ్యతిరేకత చెలరేగింది. వందలాదిమంది నిరసనకారులు రోడ్డెక్కారు. యుద్ధాన్ని ఆపివేయాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. వుయ్ డోన్ట్ నీడ్ వార్ అంటూ నినదించారు. మాస్కోలో పెద్ద ఎత్తున ర్యాలీని చేపట్టారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటిదాకా 1,700 మంది ఆందోళనకారులను నిర్బంధంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. యుద్ధానికి దిగే పరిస్థితులు లేవని, ఆర్థికంగా చితికిపోవాల్సి వస్తుందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.

పుతిన్ స్ట్రాటజీ..
వ్లాదిమిర్ పుతిన్.. స్ట్రాటజీని అర్థం కావట్లేదని, ఆర్థికంగా నష్టాన్ని కలిగించే సైనిక చర్యకు ఆయన ఎందుకు దిగాల్సి వచ్చిందనేది తెలియట్లేదంటూ మిఖాయిల్ అనే యువకుడు వ్యాఖ్యానించారు. పొరుగు దేశంతో నెలకొన్న సమస్యలను దౌత్యపరంగా పరిష్కరించుకోవడానికి అవకాశాలు ఉండేవని పేర్కొన్నారు. యుద్ధానికి దిగడం వల్ల సంభవించే పరిణామాలు- ఆర్థికంగా, సామాజికంగా ముందు తరాలను వెంటాడుతాయని అన్నారు.












Click it and Unblock the Notifications