నేపాల్ వరదల్లో 644 మంది పర్యాటకులు మిస్సింగ్: 32 దేశాలు- భారత్ నుంచి..!!
టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భూకంపం హిమాలయ పర్వత శ్రేణుల్లో ప్రకృతి విలయానికి కారణమైంది. కొండచరియలు విరిగిపడటం, బురద ప్రవాహం, నదులు ఉప్పొంగడం.. వెరసి నేపాల్ లోని కొన్ని గ్రామాలను తుడిచి పెట్టేశాయి. ప్రళయం అంటే ఇదేనేమోననిపించాయి. ఈ బీభత్సానికి వందల మంది గల్లంతయ్యారు. 175 మంది బలి అయ్యారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్న కొద్దీ మృతదేహాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఫలితంగా మృతుల సంఖ్య పెరుగుతూనే పోతోంది.
ఈ వరదల్లో వివిధ దేశాలకు చెందిన 644 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. దీనికి సంబంధించిన జాబితాను విడుదల చేసింది. మొత్తం 33 దేశాలు ఉన్నాయి ఇందులో. వీరిలో అత్యధికులు భారత్ కు చెందిన పర్యాటకులే ఉన్నారు. భారత్ నుంచి నేపాల్ కు వెళ్లిన 178 మంది పర్యాటకుల ఆచూకీ తెలియరావట్లేదని నేపాల్ టూరిజం బోర్డు తెలిపింది.

భారత్- 178, అమెరికా- 65, ఆస్ట్రేలియా- 35, ఉక్రెయిన్- 53, మలేసియా- 51, ఆస్ట్రేలియా- 35, యూకే- 33, సింగపూర్- 9, జర్మనీ- 8, రష్యా- 8, దక్షిణాఫ్రికా- 6, లాత్వియా- 6, జపాన్- 5, న్యూజిలాండ్- 5, ఫ్రాన్స్- 4, బెల్జియం- 3, స్పెయిన్- 3, ఇటలీ- 2, ఐరిష్- 2, కజకిస్తాన్- 2, నెదర్లాండ్స్- 2, పోర్చుగల్- 2 మంది ఉన్నారు. బెలారస్, బల్గేరియా, ఫిన్లాండ్, ఇజ్రాయెల్, లిథువేనియా, ఫిలిప్పీన్స్, సెర్బియా, స్వీడన్, స్విట్జర్లాండ్ కు చెందిన పర్యాటకులు ఒక్కొక్కరు చొప్పున గల్లంతయ్యారు.

నేపాల్ కు చెందిన 127 మంది పర్యాటకులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. వారందరూ నేపాల్ లోని ఇతర ప్రాంతాల నుంచి రసువా, నువాకోట్, ధాడింగ్, గూర్ఖా జిల్లాలకు వెళ్లిన వాళ్లే. వీరి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి నేపాల్ పర్యాటక బోర్డు , టూరిస్ట్ పోలీసుల ప్రత్యేక బృందాలు నిరంతరాయంగా పని చేస్తోన్నాయి. వివిధ ట్రావెల్ ఏజెన్సీలు, స్థానిక గైడ్స్, రక్షణ దళాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
బాధితులకు తక్షణ సహాయం అందించడానికి నేపాల్ ప్రభుత్వం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1234 లేదా హాట్‌లైన్ నంబర్ 1144 ద్వారా అధికారులను సంప్రదించవచ్చు. అత్యవసర పోలీస్ సహాయం కోసం నేపాల్ టూరిస్ట్ పోలీస్ అధికారిక నంబర్ 9851289445 కు కాల్ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చు. నేపాల్ లోని భారత రాయబార కార్యాలయం వారి వివరాలను తెప్పించుకుంది.













Click it and Unblock the Notifications