245 ఏళ్ల భూతగాదా.. ఒక్క దెబ్బకు పరిష్కరించిన చారిత్రక లేఖ!
పక్కపక్కనే ఉండే రెండు కుటుంబాల మధ్య చిన్న భూ సరిహద్దు వివాదం మొదలైతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్ పరిధిలోని జియాన్ నగరంలో రెండు కుటుంబాల మధ్య సాగిన భూతగాదా మాత్రం చరిత్రలోనే నిలిచిపోయేలా మారింది. డూ, ఝాంగ్ అనే పొరుగింటి కుటుంబాల మధ్య కేవలం కొన్ని అడుగుల భూమి కోసం గత 245 ఏళ్లుగా, అంటే దాదాపు ఆరు తరాలుగా ఆధిపత్య పోరు సాగుతూనే ఉంది. క్రీస్తుశకం 1781 నాటి పురాతన భూమి దస్తావేజులు ఉన్నప్పటికీ, 1949లో చైనా ఆవిర్భావం సమయంలో పోరాడుకున్న ఈ కుటుంబాలు తరాలు మారినా ఆస్తి తగాదాలను మాత్రం వదులుకోలేదు.
చిన్న వంటగది నిర్మాణంతో మళ్లీ రగిలిన నిప్పు
ఈ దీర్ఘకాలిక వివాదం.. ఇటీవల డూ కుటుంబం తమ ఇంట వంటగదిని రెనోవేషన్ చేసి, ఎత్తైన కాంపౌండ్ గోడను నిర్మించేందుకు పూనుకోవడంతో మళ్లీ మొదటికి వచ్చింది. దీనివల్ల తమకు వెలుతురు, నీటి డ్రైనేజీ వసతికి ఇబ్బంది కలుగుతుందని పొరుగింటి ఝాంగ్ కుటుంబం అడ్డుపడింది. దాంతో చిన్నపాటి మాటల యుద్దంగా మొదలైన ఈ గొడవ, రానురాను భౌతిక దాడుల వరకు వెళ్లింది. గ్రామీణ కమిటీలు, స్థానిక పోలీసులు పదుల సంఖ్యలో పంచాయితీలు పెట్టి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఇరువర్గాలు తగ్గేదే లేదంటూ పట్టుబట్టాయి.

కోర్టు దృష్టికి చేరిన రచ్చ.. చారిత్రక లేఖతో అద్భుత పరిష్కారం!
చివరకు ఈ వ్యవహారం జియాన్‌లోని యాంటా జిల్లా స్థానిక న్యాయస్థానానికి చేరింది. 1781 నాటి పాత పత్రాలను బట్టి మాత్రమే తీర్పు ఇస్తే వివాదం శాశ్వతంగా సమసిపోదని గుర్తించిన న్యాయమూర్తి, ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టాన్ని ఈ వివాద పరిష్కారానికి ఆయుధంగా వాడుకున్నారు. ప్రాచీన కింగ్ రాజవంశ కాలంలో 'ఝాంగ్ యింగ్' అనే గొప్ప రాజనీతిజ్ఞుడు, పండితుడు తన కుటుంబానికి రాసిన ఓ లేఖలోని సారాంశాన్ని ఇరు కుటుంబాలకు గుర్తుచేశారు.
ఆ లేఖలో ఆయన "కేవలం ఒక గోడ కోసం సుదూరం నుంచి లేఖ రాస్తున్నారా? పక్కవారి కోసం ఓ మూడు అడుగుల స్థలాన్ని వదులుకుంటే ఏమవుతుంది? నాటి చైనా మహా ప్రాకారం.. గ్రేట్ వాల్ నేటికీ చెక్కుచెదరకుండా నిలిచే ఉంది.. కానీ దానిని నిర్మించిన చక్రవర్తి చివరకు ఏమయ్యాడో ఆలోచించండి!" అని రాశారు. ఆ మాటలతో స్పందించిన నాటి రాజనీతిజ్ఞుడి కుటుంబం మూడు అడుగుల స్థలాన్ని వదులుకోగా, వారి పక్కవారు కూడా అంతే స్థలాన్ని ఇచ్చి మధ్యలో ఆరడుగుల సందును ఏర్పాటు చేసుకున్నారు. నేటికీ ఆ వీధి ఉదారతకు నిదర్శనంగా పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది.
తగ్గిగ్గిన ఇరు వర్గాలు.. ప్రశాంతంగా ముగిసిన వివాదం!
కోర్టు వినిపించిన ఈ చారిత్రక పాఠం, చూపిన మానవీయ పరిష్కారం ఇరు కుటుంబాల మనసులను మార్చింది. ఒకరికొకరు సర్దుకుపోవాలనే భావన వారిలో కలిగింది. అనంతరం అధికారులు సరిహద్దులను సరిగ్గా కొలతలు వేసి, ఇరు కుటుంబాలకు ఇబ్బంది లేని రీతిలో వంటగది నిర్మాణానికి సరికొత్త ప్లాన్ రూపొందించారు. దీంతో డూ కుటుంబం విజయవంతంగా తమ ఇంటి పనులను పూర్తి చేసుకోగా, ఝాంగ్ కుటుంబం ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా దానిని ఆమోదించింది. అలా శతాబ్దాల కాలంగా సాగుతున్న ఈ శత్రుత్వం ఒక్క లేఖలోని నీతితో ప్రశాంతంగా ముగిసింది.














Click it and Unblock the Notifications
