243 మంది ప్రయాణికులు ఉన్న భారీ నౌక అదృశ్యం- తెగిన సంబంధాలు
ఇండోనేషియా సమీపంలో ఓ భారీ నౌక సముద్రంలో అదృశ్యమైంది. జావా సముద్రంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ నౌకతో ఉన్న రేడియో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో నౌకలో మొత్తం 243 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం సముద్రంలో గల్లంతైన ఈ నౌక కోసం రెస్క్యూ బృందాలు, ఇండోనేషియా నౌకాదళం రంగంలోకి దిగింది. ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది.
సముద్రంలో అదృశ్యమైన ఈ ప్రయాణీకుల నౌకను విర్గో ట్రాన్స్‌పోర్ట్ 8' (Virgo Transport 8)గా అధికారులు గుర్తించారు. ఇండోనేషియాలోని రెండో అతిపెద్ద నగరం సురబాయా నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇది.. సౌత్ కాళీమంథన్ ప్రావిన్స్ రాజధాని బాంజర్‌మాసిన్ కు చేరుకోవాల్సి ఉంది. సముద్ర మార్గం మధ్యలో కమ్యూనికేషన్ సిగ్నల్స్ కోల్పోయింది. సముద్రం మధ్యలోకి వెళ్లిన తర్వాత కంట్రోల్ రూమ్‌తో సంబంధాలు తెగిపోయాయి. బాంజర్ మాసిన్ కు 148 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు కాంటాక్ట్ కోల్పోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

నౌక అదృశ్యమైనట్లు వార్త అందిన తక్షణమే ఇండోనేషియా ప్రభుత్వం రంగంలోకి దిగింది. సైన్యానికి చెందిన ప్రత్యేక యుద్ధ నౌకలు, రెస్క్యూ బోట్లు, హెలికాప్టర్లతో గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు లేదా నౌక ప్రమాదానికి గురై మునిగిపోయినట్లు ఎటువంటి అధికారిక సమాచారం లభించలేదు. వాతావరణంలో అకస్మాత్తుగా ఏర్పడిన ప్రతికూల మార్పుల వల్లే సిగ్నల్స్ నిలిచిపోయి ఉండొచ్చని అంచనా వేస్తోంది.
భౌగోళికంగా అనేక చిన్న చిన్న ద్వీపాలతో కూడిన ఇండోనేషియాలో సముద్ర రవాణా అత్యంత కీలకం. నిత్యం ప్రజలు వీటి మీదే ఆధారపడుతుంటారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, అనూహ్యంగా మారే సముద్ర వాతావరణం ఇక్కడ తరచుగా ప్రమాదాలకు దారితీస్తుంటాయి. ఈ నేపథ్యంలో తాజా సంఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.
నౌక సముద్రంలో ఏ ప్రాంతంలో ఉందో గుర్తించడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తోన్నారు. చుట్టుపక్కల ప్రయాణించే ఇతర నౌకలను కూడా అప్రమత్తం చేశామని అధికారులు తెలిపారు. సముద్రంలో గాలి వేగం, అలల దిశను బట్టి నౌక ఏ వైపు కొట్టుకుపోయి ఉంటుందో అంచనా వేస్తోన్నారు. ఈ ప్రక్రియలో స్థానిక మత్స్యకారులు సైతం తమ వంతు సహాయం అందిస్తోన్నారని వివరించారు. నౌక జాడ దొరుకుతుందని రెస్క్యూ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications
