తాలిబన్లపై పంజ్‌షీర్ పంజా-భీకర యుద్ధంలో 600 మంది హతం-వెయ్యి మంది లొంగుబాటు-ఇదీ తాజా పరిస్థితి
పంజ్‌షీర్‌పై కథనాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఆఫ్గనిస్తాన్‌లోని ఆ ప్రావిన్స్‌ను విజయవంతంగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని నిన్ననే తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఇంతలోనే పంజ్‌షీర్ తిరుగుబాటు దళం ఆ ప్రకటనను ఖండించింది. యుద్ధం కొనసాగుతోందని... పంజ్‌షీర్ లొంగిపోలేదని స్పష్టం చేసింది. తాజాగా పంజ్‌షీర్ తిరుగుబాటు దళం నుంచి మరో ప్రకటన వచ్చింది. 600 మంది తాలిబన్ ఫైటర్లను పంజ్‌షీర్ యోధులు మట్టుబెట్టారని తెలిపింది. మరో వెయ్యి పైచిలుకు మంది తాలిబన్లు లొంగిపోయారని వెల్లడించింది. ఈ మేరకు పంజ్‌షీర్ తిరుగుబాటు దళ ప్రతినిధి ఫహీం దష్టి ప్రకటన చేసినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.

ల్యాండ్ మైన్లతో తాలిబన్లను అడ్డుకుంటున్న పంజ్‌షీర్ దళం
పంజ్‌షీర్‌పై పైచేయి సాధించామని తాలిబన్లు... వారి దాడులను తిప్పి కొడుతున్నామని పంజ్‌షీర్ నాయకత్వం చేస్తున్న ప్రకటనలతో... అసలక్కడి వాస్తవ పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది.ఇరు వర్గాలు ప్రకటనలైతే చేస్తున్నాయి గానీ... ఎక్కడా ఆధారాలు బయటపెట్టట్లేదు. అంతర్జాతీయ మీడియా అల్‌జజీరాతో మాట్లాడుతూ తాలిబన్ ప్రతినిధి బిలాల్ కరిమీ కొన్ని విషయాలు వెల్లడించారు. పంజ్‌షీర్‌పై తాలిబన్ల యుద్ధం కొనసాగుతోందని చెప్పారు. అయితే పంజ్‌షీర్ రాజధాని బజారక్‌కి వెళ్లే రోడ్డు మార్గంలో ల్యాండ్ మైన్లు అమర్చారని... దానివల్ల అక్కడి నుంచి ముందుకెళ్లడం కష్టంగా మారిందని చెప్పారు. ఇప్పటివరకూ పంజ్‌షీర్‌లోని ఏడు జిల్లాల్లో నాలుగు తాలిబన్ల ఆధీనంలోకి వచ్చాయన్నారు. మిగతా జిల్లాలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు తాలిబన్లు పోరాడుతున్నారని చెప్పారు.

పంజ్‌షీర్‌లో తాజా పరిస్థితి...
పంజ్‌షీర్‌లో తాజా పరిస్థితులపై అక్కడి తిరుగుబాటు దళం స్పందించింది.ఖవాక్ పాస్ ప్రాంతంలో వేలాది మంది తాలిబన్ ఫైటర్స్‌ను తమ దళం చుట్టుముట్టిందని తెలిపింది.దీంతో తాలిబన్లు తమ వాహనాలను,ఆయుధాలను అక్కడే వదిలి పారిపోయారని పేర్కొంది. ప్రస్తుతం ఇరువురి మధ్య భీకర పోరు జరుగుతోందని... పంజ్‌షీర్ తిరుగుబాటు దళం తాలిబన్లను ధీటుగా ఎదుర్కొంటోందని తెలిపింది. ఆఫ్గన్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై అమెరికా ఆర్మీ జనరల్ మార్క్ మిల్లే స్పందిస్తూ... ఆఫ్గనిస్తాన్‌లో అంతర్యుద్దానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటులో,అధికారాన్ని ఏకీకృతం చేయడంలో తాలిబన్లు విఫలమైతే సివిల్ వార్ తప్పకపోవచ్చన్నారు.

ఎన్నికలు నిర్వహించాలన్న ఇరాన్...
ఆఫ్గనిస్తాన్‌లో ఎన్నికలు నిర్వహించాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు కోసం వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని అన్నారు. ప్రజల ఓట్ల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నారు. మరోవైపు తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. రేపు మాపు అంటూ ప్రకటనలు వస్తున్నాయి గానీ.. ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడనేది కచ్చితంగా తేల్చట్లేదు. తాలిబన్ నేతల మధ్య అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత... ప్రభుత్వ ఏర్పాటును వచ్చే వారానికి వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరో రెండు,మూడు రోజుల్లో కేబినెట్‌ను ప్రకటిస్తారని తెలుస్తోంది.

మహిళల నిరసనలు... టియర్ గ్యాస్ ప్రయోగించిన తాలిబన్లు...
తాలిబన్ల పాలనలో అందరికంటే ఎక్కువ ఆందోళన చెందుతున్న మహిళలు శనివారం(సెప్టెంబర్ 4) రోడ్ల పైకి వచ్చి నిరసన తెలిపారు. కాబూల్,హెరాత్ నగరాల్లో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తమ హక్కుల కోసం నినదించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు తాలిబన్లు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. సోషల్ మీడియాలో వెలుగుచూసిన ఓ వీడియోలో నిరసనల్లో పాల్గొన్న ఓ మహిళ రక్తమోడుతుండటం కనిపిస్తోంది. స్త్రీలకు విద్య,ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని.. షరియా చట్టాలకు లోబడి వారికి హక్కులు ఉంటాయని తాలిబన్లు తమ మొదటి ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. కానీ ఆ తర్వాత మహిళలపై తాలిబన్ల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. వారిని ప్రభుత్వ,ప్రైవేట్ ఆఫీసుల నుంచి వెళ్లగొట్టడం,ఇంటికే పరిమితం కావాలని హుకుం జారీ చేయడం జరిగాయి. పలుచోట్ల మహిళలను బలవంతంగా ఇళ్లల్లో నుంచి తమతో లాక్కెళ్లిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు.

ఇరాన్ ఫిలిం మేకర్ అభ్యర్థన....
ఆఫ్గనిస్తాన్‌లోని ఫిలిం మేకర్స్‌కి అంతర్జాతీయ సమాజం మద్దతుగా నిలవాలని ఆ దేశానికి చెందిన ఫిలిం మేకర్ ఒకరు విజ్ఞప్తి చేశారు. వెనీస్ ఫిలిం ఫెస్టివల్‌లోని ఓ ప్యానెల్‌లో ఒకరైన ఆమె... ఆఫ్గనిస్తాన్ ప్రజల గురించి,అక్కడి ఆర్టిస్టుల గురించి ప్రపంచం మరిచిపోవద్దని వేడుకున్నారు. సంస్కృతి,కళలకు తావు లేని దేశం త్వరలోనే తన ఉనికిని కోల్పోతుందని అన్నారు.ఆఫ్గనిస్తాన్‌కు ఆ పరిస్థితి రాకుండా అంతర్జాతీయ సమాజం అండగా నిలవాలన్నారు.

ఇంకా 200 మంది అమెరికన్లు అక్కడే...
ఆఫ్గనిస్తాన్‌లో చిక్కుకుపోయినవారిలో 200 మంది అమెరికన్ల వరకు ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. ఇతర దేశాలకు చెందినవారి సంఖ్య కూడా అంతే స్థాయిలో ఉండొచ్చునని భావిస్తున్నారు. వారిని వెనక్కి రప్పించే విషయంలో అమెరికా తమ అధికారులతో సమాలోచనలు జరుపుతోంది.ఆగస్టు 15 డెడ్ లైన్‌కి ఒకరోజు ముందే అమెరికా కాబూల్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. 15 రోజుల్లో వేల సంఖ్యలో తమ పౌరులను స్వదేశానికి తరలించింది. తాలిబన్లతో ఒప్పందం ప్రకారం డెడ్ లైన్ లోపే తమ బలగాలతో సహా అక్కడి నుంచి నిష్క్రమించింది. దీంతో తాలిబన్లు సంబరాలు జరుపుకున్నారు. తమకు నిజమైన స్వాతంత్య్రం ఇప్పుడే వచ్చిందని ప్రకటించారు.ప్రస్తుతం ముల్లా బరాదర్ నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతూనే... పంజ్‌షీర్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. పంజ్‌షీర్‌ను జయించడం ద్వారా కొత్త చరిత్ర లిఖించాలని తహతహలాడుతున్నారు. ప్రస్తుతం తాలిబన్లు-పంజ్‌షీర్ దళం మధ్య జరుగుతున్న యుద్ధంలో చివరికి విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications