మొన్న జో బైడెన్- ఇప్పుడు బ్రిటన్ ప్రధానిపై దాడికి కుట్ర: ఇంటి వద్ద కారుతో బీభత్సం
లండన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను హతమార్చడానికి కుట్ర పన్నిన తెలుగు కుర్రాడు.. కందుల సాయి వర్షిత్ ఆయన అధికారిక నివాసం వైట్‌హౌస్‌లోకి ఓ భారీ ట్రక్కుతో దూసుకెళ్లిన ఘటనను విస్మరించకముందే అలాంటి ఉదంతమే మరోసారి చోటు చేసుకుంది. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ అధికారిక నివాసంలోకి కారుతో సహా దూసుకెళ్లడానికి ప్రయత్నించాడో వ్యక్తి. ఇంటి ముందు కారుతో బీభత్సం సృష్టించాడు.
సెంట్రల్ లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికారిక నివాసం, ఆయన కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతం మొత్తం హైసెక్యూరిటీ జోన్. అత్యంత కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ మధ్య ఉంటుంది. అలాంటి ప్రదేశంలోకి కారుతో దూసుకెళ్లాడో వ్యక్తి. రిషి సునాక్ అధికారిక నివాసం గేట్లను ఢీ కొట్టాడు. గేట్లను దాటుకుని లోనికి దూసుకెళ్లడానికి ప్రయత్నించాడు.

ఆ సమయంలో రిషి సునాక్ తన కార్యాలయంలోనే ఉన్నారు. అప్రమత్తమైన భద్రత సిబ్బంది సకాలంలో అతణ్ని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేరపూరిత, ప్రమాదకరమైన డ్రైవింగ్, ఉద్దేశపూరకంగా నేరానికి పాల్పడటం వంటి కారణాలతో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ ఫోర్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపింది.
ఈ ఘటనను ఉగ్రవాద కోణంలో చూడట్లేదని స్పష్టం చేసింది. కారు మొత్తాన్నీ క్షుణ్నంగా పరీక్షించామని, పేలుడు లేదా అనుమానాస్పద వస్తువులు అందులో లేవని పేర్కొంది. ఈ సంఘటన చోటు చేసుకున్న వెంటనే మెట్రోపాలిటన్ పోలీస్ బలగాలు ఆ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించాయి. రెండు గంటల పాటు విస్తృతంగా తనిఖీలను చేపట్టాయి.

10 డౌనింగ్ స్ట్రీట్‌పై గతంలో దాడులు జరిగిన విషయం తెలిసిందే. 1991లో ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ మోర్టార్లతో అటాక్ చేసింది. మూడు శక్తిమంతమైన మోర్టార్లను ప్రయోగించింది. 2017లో వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జి దాడి ఘటన కూడా 10 డౌనింగ్ స్ట్రీట్‌ను లక్ష్యంగా చేసుకున్నదే. ఆ దాడుల తరువాత బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసానికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 24 గంటల పాటు భద్రత బలగాలు పహారా కాస్తుంటాయి. కాంక్రీట్ బొల్లార్డ్స్, మెటల్ క్రౌడ్ బ్యారికేడ్స్ ను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications