అమెరికాలో విధ్వంసానికి పాక్ జాతీయుడి ప్లాన్
అమెరికాలో భారీ విధ్వంసానికి ఓ పాకిస్తాన్ జాతీయుడు పన్నిన కుట్ర భగ్నం అయింది. న్యూయార్క్ బ్రూక్లిన్‌లో గల ఓ యూదుల కేంద్రంపై సామూహిక కాల్పులకు పాల్పడటానికి అతను చేసిన ప్రయత్నాలను ఫెడరల్ బ్యురో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సకాలంలో గుర్తించింది. అతన్ని అరెస్ట్ చేసింది.
నిందితుడి పేరు- మహ్మద్ షాజెబ్ ఖాన్. వయస్సు 20 సంవత్సరాలు. భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ తో అతనికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ఐసిస్ సహకారంతో ఈ దాడికి ప్లాన్ చేశాడని దర్యాప్తులో తేలింది. ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు జరిపిన మారణ హోమాన్ని తలపించేలా ఈ విధ్వంసానికి షాజెబ్ ఖాన్ ప్లాన్ వేసినట్లు ఎఫ్ బీఐ నిర్ధారించింది.

అతన్ని గత ఏడాది సెప్టెంబర్ 4వ తేదీన కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికా-కెనడా సరిహద్దు సమీపంలోని ఓర్మ్స్‌టౌన్‌లో కెనడియన్ అధికారులు అతన్ని అరెస్టు చేశారు. సమగ్ర దర్యాప్తు అనంతరం తాజాగా అతన్ని అమెరికాకు అప్పగించారు.
ఈ విషయాన్ని ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ నిర్ధారించారు. బ్రూక్లిన్ లో మాస్ షూటింగ్ కు పాల్పడటానికి షాజెబ్ ఖాన్ కుట్ర పన్నినట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు జరిపిన మారణ హోమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా 2024 అక్టోబర్ 7వ తేదీన బ్రూక్లిన్ లో ఈ విధ్వంసానికి అతను ప్లాన్ చేసినట్లు తెలిపారు.
న్యూయార్క్ వెళ్లి బ్రూక్లిన్‌లోని ఒక యూదు కేంద్రంలో సామూహిక కాల్పులు జరపాలని, దీనికి ఇస్లామిక్ స్టేట్ సహాయం తీసుకున్నాడనీ స్పష్టం చేశారు. అతను ఇప్పుడు తమ కస్టడీలో ఉన్నాడని, అతనిపై చట్టపరమైన చర్యలను తీసుకుంటామని కాష్ పటేల్ తెలిపారు. నేరం రుజువైతే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications