ఆస్ట్రేలియాలో ఉగ్రదాడులకు కుట్ర: అరెస్టు
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని ప్రభుత్వ కార్యాలయాలను టార్గెట్ చేసుకుని దాడులు చెయ్యడానికి పక్కా ప్లాన్ వేసిన ఓమైనర్ తో పాటు ఇద్దరిని అరెస్టు చేశామని ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. 15 సంవత్సరాల బాలుడు, 20 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశామని గురువారం పోలీసులు చెప్పారు.
ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసు డిప్యూటీ కమిషనర్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అధికారి మైఖెల్ పెలాన్ వివరాలు వెల్లడించారు. నిందితులు ఇద్దరూ ప్రభుత్వ కార్యాలయాలను టార్గెట్ చేసుకుని ఉగ్రదాడులు చెయ్యడానికి ప్లాన్ వేశారని అన్నారు.
ఇదే డిసెంబర్ నెలలో వీరిద్దరూ ఉగ్రదాడులు అమలు చెయ్యాలని స్కెచ్ వేశారు. ఈలోగా నిఘా వర్గాలు చాల వేగంగా స్పందించి సమాచారం ఇవ్వడంతో ఉగ్రదాడులను భగ్నం చేశామని ఆయన వివరించారు.

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశామని, వారితో గురువారం అరెస్టు అయిన ఈ ఇద్దరికీ సంబంధాలు ఉంటాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై తాము చాల అప్రమత్తంగా ఉన్నామని, ఉగ్రదాడులను ఏ మాత్రం సహించం అంటూ ఆయన హెచ్చరించారు.
నిందితులు ఇద్దరూ సిడ్నీలోని ఇంట్లో ఉండగానే అరెస్టు చేశామని, వారి ఇండ్లు సీజ్ చేశామని వివరించారు. గత సంవత్సరం ఓ వ్యక్తిని కిడ్నాప్ చెయ్యడానికి ప్రయత్నించిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాపర్లు తెలిపిన వివరాల ఆధారంగా ఈ ఉగ్రదాడుల కుట్ర బయటపడిందని ఆస్ట్రేలియా పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications